ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..! - Sunday Magazine
close

ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..!

మనోజ్‌ బాజ్‌పాయ్‌... భాషలకి అతీతంగా పాత్రలకి ప్రాణం పోయగల జాతీయ నటుల్లో ఒకడు. ఆ రకంగా కమల్‌హాసన్‌, మోహన్‌లాల్‌, నసీరుద్దీన్‌ షాలకి అసలైన వారసుడు. రామ్‌గోపాల్‌ వర్మ ‘సత్య’తో తెలుగువారికి పరిచయమైన మనోజ్‌ ఆ తర్వాత ‘ప్రేమకథ’, ‘హ్యాపీ’, ‘వేదం’ సినిమాల్లో చక్కటి నటుడిగా మెప్పించాడు. ఇప్పుడు ‘ఫ్యామిలీమ్యాన్‌’ వెబ్‌సిరీస్‌లతో మాస్‌నీ కట్టిపడేసే స్టార్‌గానూ అలరిస్తున్నాడు. బిహార్‌లోని ఓ మారుమూల పల్లెటూర్లో జీవితాన్ని మొదలుపెట్టి నటనలో శిఖరాలని అందుకున్న మనోజ్‌... మనోగతం ఇది.

‘ప్రియమైన నాన్నకి! నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు నీకు కోపం తెప్పించవచ్చుకానీ... ఇకపైనా నీతో అబద్ధాలు ఆడటం నాకిష్టంలేదు. అబద్ధం రాసిన ప్రతిసారీ ఎంతో అమాయకంగా ఉండే నీ మొహమే కళ్లలో మెదిలి గుండెని మెలిపెడుతూ ఉంది. ఇప్పుడు కాదు, గత రెండేళ్లుగా నీకు నేను నా కెరీర్‌ గురించి చెప్పినవేవీ నిజాలు కావు నాన్నా! నేను దిల్లీలో డిగ్రీ చదువుతూ యూపీపీఎస్సీకి సిద్ధం కావడం అసలు నిజం కాదు. అసలు నేను దిల్లీ వచ్చింది... డిగ్రీ కోసం కాదు. నటన కోసం... అదీ ఇక్కడున్న ‘నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా’ (ఎన్‌ఎస్‌డీ)లో చేరడం కోసం. పదకొండో తరగతి చదివేటప్పుడే అమ్మకీ, నీకూ ఈ విషయం చెప్పాను. అమ్మయితే ‘నా కొడుకు నటుడైపోతాడంట!’ అని సంబరపడిపోయిందికానీ నువ్వు మాత్రం ముఖం పక్కకి తిప్పుకుని వెళ్లిపోయావు. నీకిష్టంలేదని అప్పుడే అనుకున్నాను. అందుకే ‘దిల్లీలోనైతే పోటీపరీక్షలకి సిద్ధం కావడం సులభం’ అని నిన్ను నమ్మించి ఇక్కడికొచ్చాను. వచ్చిన మొదటిరోజే మా క్యాంపస్‌లో వీధినాటకం వేస్తున్న బృందంలో చేరి వాళ్లతోనే తిరుగుతున్నా. మధ్యలో ఖాళీ దొరికితేనే కాలేజీకి వెళుతూ వచ్చాను. ఇవాళే రిజల్ట్స్‌ వచ్చాయి. డిగ్రీ సెకెండ్‌ క్లాస్‌లో పాసయ్యాను. ఎన్‌ఎస్‌డీలో చేరాలనే నా లక్ష్యానికి కనీసార్హత ఈ డిగ్రీ నాన్నా. అది చేతికి వచ్చేసింది, ఇక దరఖాస్తు చేసుకోవడమే మిగిలింది. నీకు చెప్పకుండానూ నేను దరఖాస్తు చేయొచ్చుకానీ... దానికి నీ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. అందుకే ఈ లేఖ...’ - 1989లో మా నాన్నకి నేను పంపిన ఉత్తరం సారాంశం ఇది. నన్ను అట్టే ఎదురుచూడనివ్వకుండా నాన్న నాకు రెండ్రోజుల్లోనే ఉత్తరం పంపారు. అందులో ఏముందో చెప్పేముందు... నా నేపథ్యం గురించి ఇంకొంత పంచుకోవాలి మీతో...

భారత్‌-నేపాల్‌ సరిహద్దులో బెల్వా అనే ఓ మారుమూల గ్రామం మాది. బిహార్‌ రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్‌ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఆ గ్రామంలో మా నాన్న పదిహేను ఎకరాల ఆసామి. ఇంట్లోని ఆరుగురు సంతానంలో నేను రెండోవాణ్ణి. పెద్ద కుటుంబం కావడంతో సాగుతో వచ్చే ఆదాయం కనీసావసరాలకే సరిపోయేది. అయినా సరే... మమ్మల్నందరినీ డిగ్రీ చదివించాలనే పట్టుదలతో ఉండేవాడు నాన్న. మేం నాలుగో తరగతిదాకా మా ఊళ్లోని సర్కారు ‘గుడిసె బడి’లో చదువుకునే దాకా ఏ సమస్యా లేదుకానీ... ఆ తర్వాతి తరగతుల్లో చేర్చాల్సి వచ్చే టప్పటికి ఆయన ఎన్నో అవస్థలు పడాల్సి వచ్చింది. ఐదారు తరగతుల్లోనైతే మొదటి రోజు బడికెళ్లే చివరి నిమిషం దాకా... తనదగ్గరున్న డబ్బుని అణాపైసలు సహా లెక్కపెడుతూ కూర్చునేవాడు. అవీ చాలక, ఊళ్లోవాళ్ల దగ్గర  అప్పులు అడుగుతూనే ఉండేవాడు. ఎట్టకేలకి యుద్ధంలో గెలిచిన వీరుడిలా డబ్బు పోగేసి తెచ్చి మమ్మల్ని బడికి పంపించేవాడు. ఏడో తరగతిలో మాకు దగ్గర్లోని బెటాయా పట్నంలో ఉండే క్రీస్తురాజా రెసిడెన్షియల్‌ బడిలో చేరాను. అది మిషనరీల పాఠశాల కాబట్టి ఫీజు తక్కువగా తీసుకునేవారు. దాంతో పన్నెండో తరగతిదాకా సమస్యలేకుండా పోయింది. మరి ఈ సినిమా పిచ్చి ఎలా పట్టుకుందంటారా... అమ్మానాన్నలు చిన్నప్పటి నుంచే సినిమాలు బాగా చూసేవారు. అలనాటి హిందీ హీరో మనోజ్‌కుమార్‌పైన అభిమానంతో నాకీ పేరు పెట్టారంటేనే చూసుకోండి. ఆ కారణంగానేమో... ఏడో తరగతి నుంచే నటుణ్ణి కావాలని నిర్ణయించుకున్నాను. తొమ్మిదో తరగతి నుంచి ఏకంగా నేను నటుణ్నని నమ్మడం మొదలుపెట్టాను. అందుకో సంఘటన దారితీసింది...

అందుకే అబద్ధమాడా...

అప్పట్లో మా జిల్లాలో వక్తృత్వ పోటీలు పెట్టారు. అందులో కవిత కూడా పాడొచ్చని చెప్పారు. అందుకని ప్రముఖ కవి హరివంశరాయ్‌ బచ్ఛన్‌ రాసిన ‘జో బీత్‌ గయీ... సో బాత్‌ గయీ!’ (జరిగిందేదో జరిగిపోయింది...) అనే హిందీ కవితని భావ, రాగయుక్తంగా పాడటానికి వారం రోజులు సాధన చేశాను. పోటీ రోజు వందలాదిమంది ముందు ఆ కవిత చదువుతుంటే ప్రతి పాదానికీ చప్పట్లు మారుమోగిపోయాయి! ఆ హర్షధ్వానాలే తొలిసారి నన్ను నేను నటునిగా నమ్మేలా చేశాయి. అప్పటి నుంచి సినిమాపత్రికలు చదవడం మొదలుపెట్టాను. నసీరుద్దీన్‌ షా, ఓంపురిలాంటివాళ్లు తమ ఇంటర్వ్యూలో దిల్లీలోని ‘ఎన్‌ఎస్‌డీ’ సంస్థే తమని నటులుగా తీర్చిదిద్దిందని కథలుకథలుగా చెబుతుండేవారు. దాంతో నేనూ ఆ సంస్థలో చేరాలనుకున్నాను.

ఇంటర్‌ పాస్‌ అయ్యాక... నా ఫ్రెండ్‌ ఒకబ్బాయి దిల్లీలో చదువుకోవడానికి వెళుతున్నాడని తెలిసి... ‘అక్కడ డిగ్రీ చేస్తే పోటీపరీక్షలకి హాజరు కావడం ఈజీ అట’ అని నాన్నకి చెప్పి రైలెక్కాను. దిల్లీ కాలేజీలో బీఏలో చేరాను. మొదటి రోజు నుంచే క్లాసులు ఎగ్గొట్టి వీధినాటకాల్లో పాల్గొన్నాను. రెండో ఏడాది నుంచి యూపీపీఎస్సీ, బ్యాంకింగ్‌ పరీక్షలకి సిద్ధమవుతున్నానని నాన్నతో బొంకాను. ఆపైనా అబద్ధాలు ఆడలేకే నాన్నకి ఆ ఉత్తరం రాశాను. నాన్న ప్రత్యుత్తరం నేనసలు ఊహించలేదు. ‘మనో..! ఎన్‌ఎస్‌డీ అంటే ఏమిటో నాకు అర్థం కావడంలేదు. కానీ, నువ్వు నటన వైపు వెళ్లడంపైన నాకే అభ్యంతరమూ లేదు. నా పిల్లలందరూ డిగ్రీ చేస్తే చాలనుకున్నాన్నేను. నువ్వు అది చేశావు కాబట్టి... నాకే బాధా లేదు. నాతో అబద్ధాలాడినందుకు బాధపడొద్దు. చిన్నప్పటి నీ కవిత గుర్తుందిగా జో బీత్‌ గయీ... సో బాత్‌ గయీ!’ అని మాత్రం రాశారు. ఇంకేం... ఇక నటనా ప్రపంచాన్ని ఏలేద్దామనే కలతో ఎన్‌ఎస్‌డీకి దరఖాస్తు చేశాను. గోడక్కొట్టిన బంతిలా వచ్చింది సమాధానం ‘సారీ... యూ ఆర్‌ రిజెక్టడ్‌’ అని!

చచ్చిపోదామనుకున్నా!

ఎన్‌ఎస్‌డీ అన్నది నా పదేళ్ల కల. ఆ కల ఓ చిన్నమాటతో కూలిపోవడం అసలు భరించలేకపోయాను. ‘ఇందుకా నేను దిల్లీ వచ్చింది? ఇందుకేనా నాన్నతో అబద్ధాలాడింది? అసలు నాకేం తక్కువ?’ అన్న ప్రశ్నలు నిద్రపోనిచ్చేవి కావు. మనసులో గూడుకట్టుకున్న ఏడుపు ఆవేశంగా పెల్లుబికేది. నా స్నేహితులు మరో ఏడాది ఆగిచూడమన్నారు. అలాగే చేశాను. ఈసారీ అదే ఫలితం. ఇక... తట్టుకోలేకపోయాను. ఆత్మహత్య ఆలోచనలు చుట్టుముట్టాయి. ఆ విషయం గ్రహించారేమో... నా స్నేహితులు వంతులవారీగా నన్ను రాత్రింబవళ్లు కనిపెట్టుకుని ఉన్నారు. ఆ బాధ నుంచి తేరుకున్నాక దిల్లీలో ‘సంభవ్‌’ అనే సంస్థ ఏడాది పాటు నటన వర్క్‌షాపు నిర్వహిస్తుంటే చేరాను. అక్కడే ప్రముఖ నటనా శిక్షకుడు బ్యారీ జేమ్స్‌ నాకు పరిచయమయ్యాడు. ఆయన ప్రాథమికంగా కొంత శిక్షణ ఇచ్చాక... మానసిక వికలాంగ చిన్నారులూ, వీధి బాలల దగ్గరకి తీసుకెళ్లాడు. వాళ్లకి నచ్చేలా... నవ్వించేలా సొంతంగా ఏదైనా నటించి చూపమనేవాడు. వాళ్ల దైన్యాన్ని చూశాక వచ్చే కన్నీళ్లని అణచిపెట్టి... నవ్వించడం నటించిచూపడమంటే మాటలు కాదు! అదే నాకు శిక్షణగా మారింది. రాన్రాను ఆ పిల్లలనీ కలుపుకుని నాటికలు వేయడం మొదలుపెట్టాను. వీధిబాలల ఆకలిబాధలనే నాటకాలుగా మలిచేవాణ్ణి. ఆ అనుభవాలు నాకు నటనని నేర్పడమే కాదు... నా వ్యక్తిత్వాన్నీ తీర్చిదిద్దాయి.

1993 ఏడాదికంతా దిల్లీలోని రంగస్థల నాటకాల్లో మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నాను. ఆ తర్వాత శేఖర్‌కపూర్‌ పిలుపుతో ‘బండిట్‌ క్వీన్‌’లో మాన్‌సింగ్‌ అనే బందిపోటు పాత్ర చేశాను. ఆయన సూచనతోనే ముంబయి వచ్చాను. అక్కడ ఏ అవకాశమూ రాక నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. ఓ ఏడాది తర్వాత ‘స్వాభిమాన్‌’ అనే దూరదర్శన్‌ సీరియల్‌ చిన్న వెలుగు రేఖలా కనిపించింది. రోజుకి రెండున్నరవేల పారితోషికం లెక్కన... పది ఎపిసోడ్‌లకి పనిచేయమన్నారు. పదో ఎపిసోడ్‌ పూర్తయ్యాక మళ్లీ అవకాశం కోసం అడిగితే ‘నీ పాత్రకి మంచి పాపులారిటీ వచ్చిందోయ్‌. ఇకపైన ఈ సీరియల్‌ నీది!’ అన్నారు. అలా 250 ఎపిసోడ్‌లు చేశాను. అప్పట్లో నేను వెళ్లేదారిలో హాలీవుడ్‌ ఇన్‌ అనే హోటల్‌ ఉండేది. అందులోకి వెళ్లి తినాలనే కోరిక ఉన్నా... తిన్నాక బిల్లుకి సరిపడా డబ్బులేకపోతే అక్కడి బుర్రమీసాల వాచ్‌మ్యాన్‌ చేత తన్నిస్తారని భయపడేవాణ్ని. ఓ రోజు ధైర్యం చేసి ఆ హోటల్‌లోకి అడుగుపెడితే ‘మీరు సీరియల్‌ హీరో కదా... వెల్కమ్‌ సార్‌’ అన్నాడు ఆ బుర్రమీసాలాయన వినయంగా!

వర్మ ద్వారానే...

ఆ సీరియల్‌ అయ్యాక రామ్‌గోపాల్‌ వర్మ ‘దౌడ్‌’ సినిమాలో ఓ చిన్న పాత్ర ఇచ్చాడు. షూటింగ్‌కి ముందు ‘ఇదివరకు ఏమేం సినిమాలు చేశావ్‌!’ అని అడిగాడు. ‘బండిట్‌ క్వీన్‌’ అని చెప్పాను. ‘ఆ సినిమా నేను చాలా సార్లు చూశాను... నువ్వెక్కడున్నావ్‌?’ అన్నాడు రాము పరీక్షగా. ‘మరి అందులోని మాన్‌సింగ్‌ ఎవరు!’ అన్నాను. అంతే... ‘ఇన్‌క్రెడిబుల్‌... సూపర్బ్‌ యాక్టింగ్‌. నీతో మంచి సినిమా చేస్తాను... ఈ చిన్న(దౌడ్‌) పాత్ర వద్దులే నీకు’ అన్నాడు. ‘బాబ్బాబు... అంతపనిచేయొద్దు. ఈ సినిమాకి పాతికవేలు ఇస్తామన్నారు!’ అంటే నవ్వేశాడు. అలా రాము ద్వారా నాకు ‘సత్య’లో బిక్కూ పాత్ర వచ్చింది. సినిమా రిలీజైన వారం తర్వాతనుకుంటా రాము ఫోన్‌ చేసి ముంబయిలోని ప్లాజా థియేటర్‌కి వెళ్లమన్నాడు. ఆ రోజు మా అమ్మ కూడా నాతో ఉన్నారు. నన్ను చూడగానే ‘అరె... బిక్కూ వచ్చాడ్రా!’ అంటూ చుట్టుముట్టారు. నాకు ఊపిరాడలేదు. వాళ్ల నుంచి తప్పించడానికి సెక్యూరిటీవాళ్లు నన్ను చేతులపైకి ఎత్తుకుని మోసుకెళుతుంటే... అమ్మ దూరం నుంచి నవ్వుతూ కనిపించింది. సక్సెస్‌మీట్‌లో మా అమ్మ ముందు మైకు పెడితే ‘విజయం సాధించలేనంత మాత్రాన ఎవరూ అసమర్థులు కారు. సామర్థ్యం బయటపడటానికి కాస్త టైం పడుతుంది...’ అంటుంటే... ఆమెవైపు కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయాను!

కుటుంబం తర్వాతే ఏదైనా!

‘సత్య’తో నాకు తొలిసారి సహాయనటుడిగా జాతీయ పురస్కారం వచ్చింది. ఆ తర్వాత మరో మూడుసార్లు ఆ అవార్డు అందుకున్నాను. రెండేళ్లకిందట ‘పద్మశ్రీ’ కూడా వచ్చింది. కానీ ఈ అవార్డులేవీ ఇవ్వని ఆనందం... నాకు కుటుంబమే ఇస్తుంది. 2008లో నటి షబానా రజాని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాను. మాకో పాప. నేనెప్పుడూ ఎడాపెడా సినిమాలు చేసింది లేదు. నాకు తగ్గవే... నచ్చినవే ఎంచుకుంటున్నాను. మిగతా సమయమంతా కుటుంబానికే కేటాయిస్తాను. పాప చేత హోమ్‌వర్క్‌ చేయించడం నుంచి ఇంటి శుభ్రతా వంటదాకా అన్నింటా పాలుపంచుకుంటాను. అందుకే ‘ఫ్యామిలీ మ్యాన్‌’ అన్న టైటిల్‌ వినగానే ‘ఓకే’ చెప్పాను. కాకపోతే, అందులోని హీరో శ్రీకాంత్‌ తివారి కుటుంబం మాలాంటిది కాదు... వాళ్లకి లోలోపల ఎన్నో పొరపొచ్చాలున్నాయి. వాటిని అదుపులో పెడుతూనే దేశంపైన విరుచుకుపడే తీవ్రవాదుల పనిపట్టాలి! ఆ వైరుధ్యం నచ్చే ఆ పాత్ర కోసం ఇష్టంగా పనిచేశాను. భాషలకి అతీతంగా ఇన్నికోట్లమందికి నచ్చుతుందని మాత్రం అసలు ఊహించలేదు!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న