చనిపోయిన బిడ్డ మళ్లీ కనిపిస్తే..! - Sunday Magazine
close

చనిపోయిన బిడ్డ మళ్లీ కనిపిస్తే..!

చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ...?’ అని అడుగుతూ ఉండేదట ఆకాశాన్ని చూసినప్పుడల్లా.. ఆ తల్లి మనసు.  ‘మునిమాపు వేళాయె కనుపాప నిన్ను కోరె...’ అంటూ వెతుకుతుండేదట పసిపిల్లని పోగొట్టుకున్న ఆ కన్నపేగు! ఆ తల్లి బాధని కొంతవరకైనా తీర్చగలిగింది నేటి టెక్నాలజీ.  ఆ తల్లికే కాదు ప్రపంచంలో ఆత్మీయుల్ని కోల్పోయిన ఎంతోమందికి సాంత్వన నిచ్చేలా... చనిపోయినవాళ్లని ‘డిజిటల్‌’గా బతికిస్తోంది. దేశ విదేశాల్లో విస్తరిస్తున్న ఈ సరికొత్త సాంకేతికత కథాకమామీషు ఇది..

దక్షిణకొరియాకి చెందిన జాంగ్‌ జీకి ముగ్గురు పిల్లలు. ఇయాన్‌ వాళ్లలో చివరిది. 2016లో ఏదో గుర్తుపట్టలేని జ్వరంతో ఏడేళ్ల వయసులో ఆ పాప చనిపోయింది. నాటి నుంచి ఆ తల్లి బాధ అంతా ఇంతా కాదు. చనిపోయినవాళ్లు ఇరు సంధ్యల్లో ఆకాశం నుంచి మనల్ని చూస్తుంటారన్నది కొరియన్‌ల నమ్మకం. ఆ నమ్మకంతోనే ఉదయం, పగలూ ఆకాశాన్ని చూస్తూ కబుర్లు చెబుతుండేదట జాంగ్‌ జి. ఆమె గురించి విని ఆ బాధని కొంతయినా పోగొట్టాలనుకున్నాడు కిమ్‌ జాంగ్‌ అనే కంప్యూటర్‌ నిపుణుడు. చనిపోయిన ఇయాన్‌ ఫొటోల్నీ, వీడియోల్నీ సేకరించి... అచ్చం తనలాంటి 3డీ యానిమేషన్‌ రూపాన్ని తయారు చేశాడు. ఆ బొమ్మ చుట్టూ ఓ అందమైన వాతావరణాన్ని సృష్టించి... చనిపోయిన ఆ పాప ఇప్పుడు తానున్న ఈ ‘స్వర్గం’ గురించి వాళ్లమ్మకి కబుర్లెన్నో చెబుతున్నట్టు ఓ కథ అల్లాడు. దీన్నంతటినీ ‘వర్చువల్‌ రియాల్టీ’(వీఆర్‌) వీడియోగా మలిచాడు. ఓ రోజు జాంగ్‌ జీని తన స్టూడియోకి రమ్మని ఆ ‘వీఆర్‌’ హెడ్‌సెట్‌ని ఆమెకిచ్చాడు. ఆశ్చర్యం..! ఆ వీఆర్‌ వీడియోలోని కొత్తలోకంలో- ఓ బెంచి చాటునుంచి చటుక్కున బయటకొచ్చే పాప ‘అమ్మా... నేనిక్కడున్నా!’ అంటూ కళ్లముందు నిలిచింది. ‘నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నా మమ్మీ, నువ్వేం బెంగెట్టుకోకు..’ అంది. ఇంకా బోలెడు కబుర్లు చెప్పింది. ఇంతటినీ సాధ్యం చేసిన ఆ 20 నిమిషాల వీడియోని చూస్తున్నంత సేపూ జాంగ్‌ జీకి కన్నీరు ఆగలేదు. ఈ వీడియో సంభాషణ రూపంలో ఉంటుంది కాబట్టి... తన చిట్టిపాపతో మాట్లాడుతూనే ఉండిపోయింది. ఆ వీడియో అయ్యాక ‘ఇది ఊహే కావొచ్చు... ఒట్టి గ్రాఫిక్స్‌ అయి ఉండొచ్చు. కానీ నా బిడ్డను నిజంగా చూస్తున్నట్లే ఉంది, పాప ఎక్కడో చోట సంతోషంగానే ఉందన్న సంతృప్తినిచ్చింది!’ అని చెప్పింది జాంగ్‌ జీ.

తనక్కావాల్సింది కూడా అదేనంటాడు ఈ వీఆర్‌ సృష్టికర్త కిమ్‌ జాంగ్‌. అంతేకాదు... ఆత్మీయుల్ని పోగొట్టుకున్నవాళ్ల కోసం ఇలాంటి గ్రాఫిక్స్‌ వీడియోలు తయారుచేసేందుకే ‘వివే స్టూడియోస్‌’ అనే సరికొత్త సంస్థనీ ఏర్పాటుచేశాడు! ఒక్క వివే స్టూడియోస్‌ మాత్రమే కాదు... చనిపోయినవాళ్లని ఇలా డిజిటల్‌గా వివిధ రూపాల్లో బతికించే సంస్థలు ప్రపంచంలో మరెన్నో పుట్టుకొస్తున్నాయి...

హాలోగ్రామ్‌లా...

ఎస్‌ఎస్‌ రాజమౌళో, శంకరో తమ సినిమాల కోసం గ్రాఫిక్స్‌ ద్వారా ఓ అద్భుత లోకాన్ని సృష్టిస్తారు కదా... ఈ సంస్థలు కూడా అదే చేస్తున్నాయి. కాకపోతే మన దర్శకులు బతికున్నవాళ్ల ద్వారా కొత్తలోకాన్ని సృష్టిస్తే వీళ్లు చనిపోయినవాళ్లని ఇలా తెస్తున్నారు. వాళ్లు సినిమాల కోసం చేస్తే వీళ్లు సామాన్యుల కోసం వీటిని సృష్టిస్తున్నారు. ఇందుకోసం చనిపోయినవాళ్ల ఫొటోలూ వీడియోలే కాకుండా... వాళ్లు ఇదివరకు సామాజిక మాధ్యమాల్లో, వాట్సాప్‌ల్లో ఉంచిన మెసేజ్‌లూ సేకరిస్తారు. వాటిని కృత్రిమ మేథ(ఏఐ) సాయంతో విశ్లేషించి అదే వ్యక్తిత్వాన్ని పోలిన డిజిటల్‌ మనిషిని సృష్టిస్తారు. దక్షిణకొరియా సంస్థ వివే స్టూడియోస్‌ వీఆర్‌ 3డీ బొమ్మల్ని సృష్టించినట్టే అమెరికాలోని కలీడా హాలోగ్రామ్‌లతో చనిపోయినవాళ్లని చిరంజీవుల్ని చేస్తోంది. పోయినవాళ్ల సంభాషణలూ వీడియోలూ తీసుకుని వాటిని నేటి సందర్భానికి తగ్గ హావభావాలు పలికించి అభిప్రాయాలనీ చెప్పిస్తుంది. ఏ గాంధీ మహాత్ముడో సుభాష్‌ చంద్రబోసో మన స్వాతంత్య్ర అమృతోత్సవాలకు శుభాకాంక్షలు చెబితే ఎలా ఉంటుందో... అలా చూపిస్తుందన్నమాట!

వాళ్లలాగే మాట్లాడిస్తారు!

వివే స్టూడియోస్‌, కలీడా సంస్థలంత భారీగా కాకున్నా... చిన్నచిన్న చాట్‌బోట్‌ల రూపంలోనూ, ఫొటోల రూపంలోనూ పోయినవాళ్లని బతికిస్తున్న ఆప్‌లు కొన్ని ఉన్నాయి. వాటిలో ‘రెప్లికా’ ఒకటి. చనిపోయినవాళ్ల ఫేస్‌బుక్‌ పోస్టులూ, వాట్సాప్‌ మెసేజ్‌లూ, ఈమెయిళ్లు వంటివాటిని అందిస్తే చాలు... ఈ సంస్థ వాటన్నింటినీ విశ్లేషించి అతను/ఆమెలాగే మెసేజ్‌ చేయగల ఓ ‘చాట్‌బోట్‌’ని తయారుచేసి ఇస్తుంది. ‘కొవిడ్‌’తో ఆత్మీయుల్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిన ఎంతోమంది కోసం చనిపోయినవాళ్లని ‘సృష్టించి’ ఇచ్చిందీ సంస్థ. ఇక, ‘మై హెరిటేజ్‌’ ఆప్‌నైతే అప్పటికప్పుడు ఎవరైనా వాడుకోవచ్చు. ఇందులో చనిపోయినవాళ్ల ఫొటోని పెడితే... ఆ ఫొటోలోనివాళ్లు ముఖాన్ని అటూఇటూ కదిలిస్తున్నట్లుగా నవ్వుతూ కళ్ళు తిప్పుతున్నట్లుగా... ఓ 15 సెకన్ల వీడియోను మన కళ్లముందు నిలుపుతుందీ ఆప్‌!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న