కేకుకూ ఉందో స్టాండ్‌! - Sunday Magazine
close

కేకుకూ ఉందో స్టాండ్‌!

ఆగస్టులో అమ్మ బర్త్‌డే... అక్టోబర్‌లో పాపాయి పుట్టిన రోజు, డిసెంబరు నెలలోనేమో పెళ్లిరోజు... ఇలా ఏడాదిలో ప్రతి ఇంట్లోనూ ఎన్నెన్నో ప్రత్యేక సందర్భాలొస్తుంటాయి. దాదాపు అందరూ కూడా ఆ ఆనందాల్ని పంచుకోవడానికి చాలాసార్లే కేక్‌ కటింగ్‌ వేడుకలు జరుపుకుంటారు. మరి ఇన్నిసార్లు కేక్‌ కటింగులు చేసుకుంటున్నప్పుడు ఇంట్లో మిగతా వస్తువులతోపాటు కేక్‌ స్టాండూ ఉంటే బాగుంటుంది కదూ! వస్తువు చిన్నదే అయినా ఉపయోగకరంగా ఉండే ఈ స్టాండ్‌ ఆన్‌లైన్లో దొరుకుతోంది. కేకును నేరుగా టేబుల్‌ మీద ఉంచేయకుండా ఈ స్టాండ్‌పైన పెట్టేస్తే సరి. ప్రత్యేకమైన ఆ ఏర్పాట్లకు కొత్త లుక్కు వచ్చితీరుతుందంతే. స్టీలూ, ఫైబర్‌తోపాటు రకరకాల వెరైటీల్లో చక్కనైన అలంకరణలతో రాళ్లూ, పూసలూ, రంగులూ అద్దుకుని వస్తున్నాయివి. ‘ఎప్పుడో ఏడాదికి నాలుగుసార్లు జరిగే కేక్‌ కటింగ్‌ కోసం ఇది అవసరమా...’ అనుకుంటున్నారేమో... మామూలు రోజుల్లో దాన్ని చిన్న టీపాయ్‌గానో, ఫ్లవర్‌వేజ్‌ పెట్టుకోవడానికో వాడుకునేంత అందంగా ఉంటాయివి.


ఈ గ్లౌజులకు గోళ్లుంటాయ్‌!

పెరట్లోనో, మిద్దెమీదనో లేదంటే ఇంటి ముందైనా సరే కాస్త చోటుంటే చాలు, చాలామంది తమ అభిరుచికి తగ్గట్టు మొక్కలు పెంచుకుంటున్నారు. అందుకే గార్డెనింగ్‌ పనుల్ని సులువుగా చేయడానికి బోలెడన్ని వస్తువులు కొత్తగా వస్తున్నాయి. వాటిల్లో ఒకటి ఈ ‘గార్డెనింగ్‌ గ్లౌజ్‌ విత్‌ క్లాస్‌’. ఇది మామూలు గ్లౌజులానే ఉన్నా వేళ్లకు పదునైన కొసలు ఉంటాయి. వీటిని వేసుకుని తోటపనిచేస్తే చేతులకు మట్టి అంటకుండా ఉండటంతోపాటు కుండీల్లోని మట్టిని ఈజీగా పెళ్లగించవచ్చు. అంటే, మట్టి తీయడానికి మళ్లీ వేరే పనిముట్లు అక్కర్లేకుండానే పనైపోతుందన్నమాట.


ఎంతసేపైనా కాఫీ వేడిగా...

కంప్యూటర్‌లో చూస్తూనో, ఇంకేదైనా పని చేసుకుంటూనో చేతికి ఇచ్చిన కాఫీని టేబుల్‌ మీద పెడతాం. అంతే, పనిలో పడి మర్చిపోవడం, తీరా చూస్తే అది చల్లారిపోవడం... మామూలే. దాంతో ఆ కాఫీని అటు పడబొయ్యలేక, ఇటు తాగలేక ఇబ్బంది పడాల్సొస్తుంది. అవునుమరి, కాఫీ టీలు వేడిగానూ కూల్‌డ్రింకులూ జ్యూసులూ కాస్త చల్లగానూ ఉంటేనే బాగుంటాయి. ఇక, ఫోనుకి ఛార్జింగ్‌ పెట్టడానికి ప్రతిసారీ ప్లగ్గు పిన్నుని గుచ్చడం, ఏదైనా ఫోనొస్తే దాన్ని తియ్యడం కన్నా వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ అయితే సౌకర్యంగా ఉంటుంది కదా... పై రెండు సమస్యలకూ పరిష్కారంగా వచ్చిందే ఈ ‘నొమడొ ట్రయొ వైర్‌లెస్‌ ఛార్జర్‌ విత్‌ మగ్‌ వార్మర్‌’. ఫొటోలో చూపినట్లూ దీన్లో ఒకపక్క ఫోన్‌ని పెడితే ప్లగ్‌తో పనిలేకుండా ఛార్జింగ్‌ అయిపోతుంది. మరోవైపు పానీయాల కప్పులూ గ్లాసుల్ని పెట్టుకోవచ్చు. దీని బటన్‌ని రెండుసార్లు నొక్కితే మనం పెట్టిన టీ లేదా కాఫీ ఎంతసేపైనా వేడిగా ఉంటాయి. చల్లటివాటి కోసమైతే బటన్‌ని ఒకసారి నొక్కితే సరిపోతుంది.


  ప్యాంటూ షర్టులే కుండీలు!

మనుషులు వేసుకున్నట్లే మొక్కలు జీన్సు ప్యాంటూ జాకెట్‌ వేసుకుంటే... బుజ్జి బాబులా జంప్‌సూటునూ, చిన్నారి పాపలా డెనిమ్‌ గౌనునీ తొడిగితే... చూడ్డానికి భలే చిత్రంగా ఉంటుంది కదూ... ఈ కాన్సెప్టుతో తయారైనవే ఈ ‘డెనిమ్‌ రెజిన్‌ ప్లాంటర్స్‌’. ఈ కుండీలను రెజిన్‌ లేదా సిమెంటుతో షర్టు, ప్యాంటు, నిక్కరు, టోపీ... ఇలా కావల్సిన ఆకారంలో తయారుచేసి ఆపైన అచ్చం డెనిమ్‌ క్లాత్‌లా కనిపించేలా రంగులద్దుతారు. ఆశ్చర్యం ఏంటంటే వీటిలో ప్యాంటు షర్టుల గుండీల దగ్గర్నుంచి జీన్సు మీద కనిపించే కుట్టూ మడతలూ ముడతలూ కాలర్లూ జిప్పులూ బెల్టులూ పాకెట్‌లూ అన్నీ అచ్చం నిజమైన జీన్సుకున్నట్లే కనిపిస్తాయి. అందుకే, వీటిని చూసినవారెవరైనా ‘ఏమిటీ చిత్రం...’ అనుకుంటూ కాసేపు అక్కడే ఆగిపోతారనడంలో సందేహం లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న