శుభలేఖలతో ఆటాడుకుందామా.. - Sunday Magazine
close

శుభలేఖలతో ఆటాడుకుందామా..

‘ఫలానా తేదీన మా అమ్మాయి పెళ్లి ఉంది... మీరు తప్పకుండా రావాలి...’ అని ఎవరైనా శుభలేఖ ఇచ్చి వెళ్తే ఓసారి తెరిచి అబ్బాయీ అమ్మాయీ పేర్లూ... కల్యాణ మండపం చిరునామా చూసి పక్కన పెట్టేస్తాం. కానీ ఈమధ్య శుభలేఖలతో ఎన్నో ఆటలు ఆడేసుకుంటున్నారు తెలుసా... వాటిని రకరకాల గేమ్‌బోర్డుల్లా,  పజిల్స్‌లా డిజైన్‌ చేయించడం కొత్త ట్రెండ్‌ అయింది మరి.

పెళ్లి... రెండు బతుకులను ముడిపెట్టే అందమైన బంధం. ఇరు కుటుంబాల సంతోషాన్ని అంబరానికి తాకించే చూడచక్కని ఘట్టం. ‘శ్రీరస్తు, శుభమస్తు...’ అంటూ ఆ వేడుకలకు అంకురార్పణ జరిగేది లగ్నపత్రికతోనే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముహూర్తం మారొచ్చు, వధూవరుల పేర్లు మారొచ్చు, పెళ్లి వేదికా మారొచ్చు... కానీ ప్రతి శుభలేఖా పెళ్లి పిలుపు పేరుతో ఆనందాన్ని బంధువులతో పంచుకునేందుకు ఆహ్వానం పలికే వారధే. అయితే, ఇంతకుముందులా ఆత్మీయులు పెళ్లికి వచ్చినప్పుడే కాదు, పెళ్లి పత్రికను అందుకున్నప్పట్నుంచీ తమ సరదాల్లో పాలుపంచుకోవాలని కోరుకుంటోంది ఈతరం. అందులో భాగంగా పుట్టుకొచ్చినవే ఈ ‘గేమ్‌ థీమ్‌’ శుభలేఖలు.
అవునుమరి, ఆటలను మించిన సరదా ఇంకేముంటుందీ... కాబట్టే, ఆహ్వాన పత్రికలను లూడో, చదరంగం, వైకుంఠపాళి... లాంటి బోర్డ్‌ గేముల్లానూ జిగ్‌సా, సుడొకు... వంటి పజిల్స్‌లానూ కూడా రూపొందిస్తున్నారు.

గుర్తుండిపోయేలా...

లగ్నపత్రికతో పాటే కానుకలూ స్వీట్లను కూడా ఓ బాక్సులో పెట్టి ఇవ్వడం ఈమధ్య సాధారణం అయిపోయింది. అయితే, చిన్నచిన్న కళాఖండాలూ స్టీలూ గాజు వస్తువుల్లాంటివాటిని అందరూ ఇస్తున్నారు. అందుకుభిన్నంగా గేమ్‌ బోర్డుల్నే చెక్క బాక్సులుగా తయారు చేయించి అందులో స్వీట్లూ శుభలేఖలూ పెట్టివ్వడమే కొత్త ట్రెండ్‌. ఇవి మూసి ఉన్నప్పుడు గిఫ్ట్‌ బాక్సుల్లానే ఉంటాయి. కానీ పూర్తిగా తెరిచి బోర్లించి పెడితే వాటిపైన చదరంగం, లూడో లాంటివి ఆడుకోవచ్చు. అందుకు తగ్గట్టు డిజైన్‌ చేస్తారు మరి. వీటికి సంబంధించిన డైస్‌, పావుల్ని కూడా బాక్సులో స్వీట్లతో పాటే పెట్టి అందిస్తారు. ఇక, ఈ చెక్క బాక్సులోపలి భాగంలో వధూవరుల పేర్లూ వివాహ తేదీ రాసి ఉంటుంది. విడిగానూ శుభలేఖల్ని పెట్టెతోపాటు అందిస్తారు. జిగ్‌సా పజిళ్లను కూడా ఇలా బాక్సుల్లో పెట్టి ఇస్తున్నారు కొందరు. ఈ పెట్టెల పైభాగంలో ఆటలేమీ ఉండవు కానీ, లోపల స్వీట్లతోపాటు మందపాటి జిగ్‌సా పజిల్‌ కార్డులు ఉంటాయి. వీటిని జతచేస్తే శుభలేఖ దర్శనమిస్తుందన్నమాట. ‘పజిల్‌ చేసే తీరికలేకపోతే ఎలా’ అనుకోనక్కర్లేదు. అలాంటివారికోసం విడిగా వివరాలతో మరో చిన్న కార్డునీ ఇస్తున్నారు.

బాక్సులేకుండా ఇచ్చే మామూలు శుభలేఖల్లోనూ జిగ్‌సా పజిళ్లూ బోర్డుగేమ్‌ల డిజైన్లున్నవి వస్తున్నాయి. ఈ తరహా శుభలేఖల్లో అట్టపెట్టెలమీదా విడిగా మందపాటి గ్లేజ్డ్‌ కాగితాల మీదా బోర్డుగేమ్‌లని రూపొందిస్తున్నారు డిజైనర్లు. ఆ పక్కనే పెళ్లి వివరాలు ఉంటాయి. డైస్‌లూ కార్డులూ అవసరమైన ఆటలకి అవీ కలిపే వస్తాయి. కొందరైతే వధూవరుల ప్రేమా, పెళ్లికి సంబంధించిన శేషాలన్నిటితో కలిపి పర్సనలైజ్డ్‌ వైకుంఠపాళి ఆటలనూ సుడొకు పజిళ్లనూ రూపొందించి మరీ ఆహ్వానాన్ని అందిస్తున్నారు. వీటితో అటు పిల్లా పెద్దా సరదాగా ఆడుకోవచ్చు, ఇటు శుభలేఖ ఎప్పుడూ లేనంత కొత్తగానూ కనిపిస్తుంది. ఏమంటారు..?

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న