ఈ ఆలయాన్ని చూసే పార్లమెంటుని కట్టారట! - Sunday Magazine
close

ఈ ఆలయాన్ని చూసే పార్లమెంటుని కట్టారట!

పార్లమెంటు అనగానే వలయాకారంలో చుట్టూతా గదులూ మధ్యలో ఖాళీ ఉండే పెద్ద భవనం కళ్లముందు కదులుతుంది. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే... బ్రిటిషర్లు ఈ కట్టడాన్ని మధ్యప్రదేశ్‌లోని ‘చౌసఠ్‌ యోగిని’ ఆలయం స్ఫూర్తితో నిర్మించారన్నది ఈమధ్య ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ ఆలయాన్ని చూసిన ఎవరైనా ఈ మాట నిజమే అని నమ్మి తీరాల్సిందే. కావాలంటే మీరూ చూడండి. అన్నట్లూ భారత పార్లమెంటు భవనం నిర్మాణం ప్రారంభమై ఈ ఏడాదికి సరిగ్గా వందేళ్లు.

తిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ పరిపాలనకు కేంద్ర బిందువు మన పార్లమెంటు(సంసద్‌) భవనం. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కి దగ్గర్లో ఉండే ఈ భవన నిర్మాణం వందేళ్ల కిందట 1921లో మొదలై 1927లో పూర్తైంది. అప్పట్లో ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌గా ఉపయోగించిన దీన్ని బ్రిటిష్‌ శిల్పకారులు సర్‌ ఎడ్విన్‌ లటెన్స్‌, సర్‌ హెర్బెర్ట్‌ బేకర్‌ డిజైన్‌ చేశారు. అసలు విషయానికొస్తే... వీళ్లు మధ్యప్రదేశ్‌లోని మురైనా జిల్లా, మితావలీ గ్రామంలో ఉన్న చౌసఠ్‌ యోగిని ఆలయాన్ని చూసే ఈ నమూనాని గీశారన్నది ఎంతోమంది అంటున్న మాట. ‘ఏకట్టసొ మహాదేవ ఆలయం’గా కూడా పిలిచే ఇది అచ్చుగుద్దినట్లు పార్లమెంటు భవనంలానే ఉంది మరి. స్థానికంగా కొండమీద కట్టిన ఈ గుడి నిర్మాణం కూడా వలయాకారంలో ఉండడంతో పాటు సంసద్‌ భవనం మాదిరిగానే చుట్టూ స్తంభాలు కనిపిస్తాయి. గుండ్రంగా కట్టిన రాతి గోడలోనే వరుసగా అరవైనాలుగు ఉపాలయాలు ఉంటాయి. పూర్వం ఒక్కోదాన్లో ఒక్కో యోగినీ దేవత కొలువై ఉండేదట. అందుకే, దీనికి చౌసఠ్‌(64) యోగిని గుడిగా పేరొచ్చింది. ఇక, వలయాకారపు గోడకు సరిగ్గా మధ్య భాగంలో మహాదేవుడి ఆలయం దర్శనమిస్తుంది. దీన్ని కూడా గుండ్రంగా చుట్టూతా స్తంభాలతో కట్టారు.

చూడచక్కగా...
శ్రీ యంత్రంలో మహాశక్తి మధ్యలోనూ ఆ చుట్టూతా ఇతర యోగినులూ ఆసీనులై ఉంటారంటారు. ఆ నమూనా ఆధారంగానే క్రీ.శ 1323లో మహారాజా దేవపాల ఈ మహాదేవ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఆలయం లోపలి గోడలపైన వేరువేరు దేవతామూర్తుల రూపాలను అందంగా చెక్కారు. ఈ కట్టడాన్ని 1950ల్లోనే ప్రాచీన చారిత్రక నిర్మాణంగా గుర్తించినప్పటికీ పర్యటకంగా పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. అందుకే, కొంతకాలం కిందటి వరకూ దీనిగురించి మిగిలిన ప్రపంచానికి తెలియలేదు. అయితే, ఈమధ్య అక్కడికి వెళ్లిన పర్యటకులు కొందరు చౌసఠ్‌ యోగిని ఆలయం- పార్లమెంటు భవనంలానే ఉందంటూ ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సంసద్‌ భవనాన్ని దీన్ని చూసే నిర్మించారన్నదానికి చారిత్రక ఆధారాలు లేకపోయినా ఆ నిర్మాణశైలి దాదాపు ఈ గుడి నమూనాతోనే ఉండడం కొట్టిపారేయాల్సిన విషయం కాదని కొందరు పురావస్తుశాఖ అధికారులు కూడా నొక్కి చెబుతున్నారు. ఈ ఆలయం భూకంప జోన్‌లో ఉన్నా ఇప్పటివరకూ దాని నిర్మాణానికి తీవ్రహాని జరగలేదు. ఆ ఉద్దేశంతో కూడా పార్లమెంటు భవనానికి ఈ నమూనాని ఎంచుకుని ఉండొచ్చన్నది మరికొందరి వాదన. ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఒకప్పటి రీజనల్‌ డైరెక్టర్‌గా పనిచేసి, మురైనా ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న ఆలయాలకు కొత్త రూపు ఇచ్చిన కేకే మహమ్మద్‌ కూడా యోగిని ఆలయం స్ఫూర్తితోనే పార్లమెంటు డిజైన్‌ని గీసి ఉంటారన్నది తన గట్టి నమ్మకం అంటారు. నిజంగానే రెండు కట్టడాలూ ఒకేలా ఉన్నాయి కదూ..!


అక్కడ మగపిల్లలు పుట్టడంలేదు!

టీనేజీ పిల్లలకు మధ్య జరిగే ‘వలంటీర్‌ అగ్నిమాపక సిబ్బంది’ పోటీ కోసం ఆమధ్య పోలెండ్‌లోని మెజ్సె అడ్రజన్స్కీ గ్రామం నుంచి అందరూ ఆడపిల్లలే వెళ్లారట. ఎందుకలా... అని ఆరా తీసిన స్థానిక మీడియాకు ఆ ఊళ్లో టీనేజీ వాళ్లందరూ ఆడపిల్లలే ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోయారట. అసలు విషయం ఏంటంటే... గత పదేళ్ల నుంచీ అక్కడ మగ పిల్లలే పుట్టలేదు. అంతకుముందూ వారి జనాభా తక్కువే. ఏ ఇంటికి వెళ్లి చూసినా ఇద్దరూ ముగ్గురూ పిల్లలున్నా అందరూ ఆడపిల్లలే కనిపిస్తారు. ఇది యాదృచ్ఛికమా... లేదా ఏదైనా కారణం ఉందా అని  తెలుసుకునేందుకు ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా ఆ ఊరికి వెళ్తున్నారు. ఇక, స్థానిక నాయకులూ అధికారులైతే మెజ్సె అడ్రజన్స్కీలో ఎవరికైనా మగపిల్లాడు పుడితే ఓ వీధికి ఆ పిల్లాడి పేరు పెడతామనీ, బాబుని కన్న తల్లిదండ్రులకు బహుమతులు ఇస్తామనీ ప్రకటిస్తున్నారు. వింతగా ఉంది కదూ..!

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న