అంతుబట్టని రహస్యం.. కైలాస దేవాలయం..! - Sunday Magazine
close

అంతుబట్టని రహస్యం.. కైలాస దేవాలయం..!

మనదేశంలో అడుగడుగునా ఎన్నో దేవాలయాలు... అవన్నీ ఒకెత్తయితే, ప్రపంచంలోనే ఏక రాతితో చెక్కిన అతిపెద్ద అత్యంత పురాతన ఆలయంగానూ అద్భుతమైన వాస్తునిర్మాణంగానూ పేరొందిన ఎల్లోరాలోని కైలాస దేవాలయం మాత్రం అటు చరిత్రకారులకీ ఇటు శాస్త్రజ్ఞులకీ కూడా అంతుబట్టని రహస్యంగానే మిగిలిపోయింది. యునెస్కో వారసత్వ సంపదలోనూ చోటుచేసుకున్న ఆ ఆలయం వెనకున్న విశేషాలేంటో చూద్దామా..

హ్యాద్రి పర్వతశ్రేణిలోని చరణాద్రి కొండల్లో ఉన్న ఎల్లోరాలోని 16వ గుహలోని ఏకశిలా నిర్మాణమే కైలాస దేవాలయం. అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు, ఎవరు, ఎలా నిర్మించారనే దానిపట్ల ఇప్పటికీ స్పష్టత లేదు. వందల సంవత్సరాల నాటిదని కొందరంటే, వేల సంవత్సరాల క్రితమే నిర్మించి ఉంటారనీ తరవాతికాలంలో మార్పులు చేసి ఉంటారనీ భావిస్తున్నారే తప్ప సరైన ఆధారం లేదు... ఇటీవల లభించిన కొన్ని ఆధారాల ప్రకారం- క్రీ.శ. ఎనిమిదో శతాబ్దంలో కృష్ణ-1 అనే రాష్ట్రకూట చక్రవర్తి పునర్నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే కృష్ణ యాజ్ఞవల్కి రచించిన ‘కథా కల్పతరు’ అనే గ్రంథం ప్రకారం- ఆ ప్రాంతాన్ని పాలించే ‘ఎలు’ అనే రాజు ఓసారి తీవ్రమైన అస్వస్థతకి గురవగా, భర్త కోలుకుంటే శివుడికి గుడి కట్టిస్తాననీ శిఖరాన్ని చూసేవరకూ ఉపవాసం చేస్తాననీ రాణి మొక్కుకుందట.
కోరుకున్నట్లే వ్యాధి తగ్గింది. దాంతో నిర్మాణాన్ని తక్షణం ప్రారంభించాలనుకున్నారట. కానీ శిఖర నిర్మాణానికి చాలా ఏళ్లు పడుతుందని నిపుణులు చెప్పారట. అప్పుడు పైథాన్‌ నగరం నుంచి వచ్చిన కోకస అనే వాస్తుశిల్పి, పర్వతం పైనుంచి కిందకి చెక్కుతూ కొద్ది రోజుల్లోనే శిఖరాన్ని నిర్మించాడనీ దాంతో రాణి ఉపవాస దీక్షను విరమించిందనీ చెబుతారు. ఆపై ఆలయాన్ని దశలవారీగా కట్టినట్లు తెలుస్తోంది. ఈ కథలో నిజానిజాల మాట ఎలా ఉన్నా ఆలయాన్ని పై నుంచి కిందకి చెక్కుకుంటూ కట్టారనేది మాత్రం అందరి విశ్వాసం. ఈ దేవాలయం కైలాస పర్వతాన్ని తలపించేలా ఉంటుందనీ చెబుతారు పరిశీలకులు. అందుకే శైవభక్తులు ఆ ప్రదేశాన్ని శివుడి నివాస స్థలంగా భావించి అక్కడ ధ్యానం చేసుకుంటుంటారు. ‘దారినిమ్ము ప్రభూ’ అంటూ కొండల్నీ సముద్రాల్నీ భూమాతనీ పూజించే వైదిక సంప్రదాయాన్ని అనుసరించే ఇక్కడ మహాయజ్ఞాన్ని నిర్వహించి, రాతిని తొలిచారనీ అందుకే వేదమంత్రాలను వల్లిస్తుంటే అవి అక్కడ ప్రతిధ్వనించే తీరు మరెక్కడా వినిపించదనీ అంటారు.

గుహాలయం!

ఎల్లోరాలోని 34 గుహాలయాల్లో దాదాపుగా మధ్యలో ఉంటుందీ ఆలయం. అక్కడ ఉన్న గుహలన్నీ కూడా తొలిచినవే. కానీ ఎప్పుడనేది కచ్చితంగా తెలియదు. బహుశా 5 నుంచి 10వ శతాబ్దం మధ్యలో అయి ఉంటుందని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు.
కైలాస ఆలయానికి చుట్టూ ఉండే గోడ 276 అడుగుల పొడవూ 154 అడుగుల వెడల్పూ 100 అడుగుల ఎత్తూ ఉంటుంది. హిందూ సంప్రదాయంలో భాగమైన ఏనుగులు అక్కడి ఆలయం లోపలా పై భాగంలోనూ కనిపిస్తాయి. ఆలయం మధ్యలోని గర్భగుడిలో శివుడు కొలువై ఉంటాడు. మిగిలిన గుడులకు భిన్నంగా ఈ ఆలయ శిఖరం చిన్నది. మధ్యలో ఉన్న మంటపం నుంచి నంది వాహనం వరకూ వంతెనలాంటి నిర్మాణం ఉంటుంది. నందికి రెండువైపులా ధ్వజ స్తంభాలు 45 అడుగుల ఎత్తులో ఉంటాయి. ప్రాంగణంలో గర్భగుడితోపాటు గంగా, యమునా, సరస్వతుల కోసం నిర్మించిన మందిరాలూ ఉన్నాయి. గోడలమీద రామాయణ, మహాభారత గాథలు, శివపార్వతులు, వరాహమూర్తి, మహిషాసుర వధ... ఇలా అన్నింటినీ చెక్కిన వైనం చూపరుల్ని చిత్తరువుల్ని చేస్తుంది. రావణాసురుడు కైలాస పర్వతాన్ని పెకిలిస్తున్నట్లుగా చెక్కిన శిల్పం భారతీయ శిల్పకళలోనే అద్భుతమని చెబుతారు. ఈ శిల్పం కారణం గానే ఇది కైలాస దేవాలయంగా పేరొంది ఉండొచ్చు అనీ అంటారు. మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని కూల్చడానికి మూడేళ్లపాటు వెయ్యిమందితో శతథా ప్రయత్నించాడు. వాళ్లు ఆలయగోడలకి గాట్లు పెట్టడం తప్ప గర్భగుడిలోకి అడుగు పెట్టలేకపోయారట. పైగా ఈ ఆలయంలో అత్యాధునిక సౌకర్యాలూ ఉన్నాయి. నీటిని నిల్వచేయడం, మురుగునీటి వ్యవస్థ, రహస్యమార్గాలు, బాల్కనీలూ, మెట్లూ... ఇలా ఎన్నో అద్భుతాలను రాయిని తొలిచి చెక్కడం గొప్ప విశేషం.

ఎలా చెక్కారు?

ఏ ఆలయాన్ని అయినా నేలమీద నుంచే కడతారు. కానీ కొండపై నుంచి కిందికి తొలుస్తూ కట్టిన ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే. ‘యూ’ ఆకారంలో కనిపించే ఈ ఆలయాన్ని ఎటునుంచి చెక్కుకొచ్చారనేది నేటికీ తేలలేదు. ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న విఘ్నేశ్వర శిల్పాన్ని బట్టి అక్కడినుంచే ప్రారంభించారని ఊహిస్తున్నారు.

భౌమాస్త్రమా?!

ప్రాచీన ఆలయాన్నింటిలోకీ పెద్దదైన ఈ ఏకరాతి ఆలయ నిర్మాణంకోసం 4 లక్షల టన్నుల రాతిని తొలిచినట్లూ 18 సంవత్సరాల్లో కట్టినట్లూ తెలుస్తోంది. కానీ 18 ఏళ్లలో విరామం లేకుండా తవ్వినా లక్ష టన్నుల రాయిని తొలగించడం కూడా సాధ్యం కాదనీ ఈ మొత్తం నిర్మాణాన్ని 7వేల మంది రాత్రీ పగలూ కట్టినా కనీసం 150 సంవత్సరాలు పడుతుందనేది కొందరు ఆర్కియాలజిస్టుల అంచనా. ఎంత గొప్ప సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించినా 18 ఏళ్లలో కట్టడం అసాధ్యం అనీ అంటున్నారు. పైగా చుట్టుపక్కల ఎక్కడా- ఇంత పెద్ద గుహని తొలిస్తే కుప్పలుతెప్పలుగా వచ్చే రాళ్ల ముక్కలూ పొడీ పోగుపడ్డ ఆనవాళ్లూ లేవు. అలాగని ఈ గుహ సహజంగా ఏర్పడినదీ కాదు. దీన్ని బట్టి వేదాలలో పేర్కొన్న భౌమాస్త్రం అనే ఓ శక్తిమంతమైన పరికరాన్ని ప్రయోగించి ఉంటారనీ, అది- రాతిని తొలిచేటప్పుడే వచ్చిన ధూళిని వచ్చినట్లు గాలిలో కలిపేస్తుంటుందనీ ఖగోళశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మొత్తంగా ఊహలే తప్ప ఎవరికీ దీన్ని నిర్మాణ రహస్యం అంతుబట్టడం లేదు. ఒకవేళ చక్రవర్తులే కట్టించి ఉంటే, కనీసం ఎక్కడైనా దీనికి సంబంధించిన నమూనా కనిపించేది. అదీ దొరకలేదు. అందుకే ఆ సర్వేశ్వరుడే ఇలాతలంమీద తనకో ఆవాసం కోసం ఈ ఆలయాన్ని నిర్మించి ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడని విశ్వసించేవాళ్లూ కోకొల్లలు. ఎందుకంటే కొన్నిచోట్ల మనిషి దూరలేని సందులూ ఉన్నాయి. అలాగని రసాయనాల్ని వాడారనీ చెప్పలేం. అంటే లిల్లీపుట్స్‌ లాంటి సూక్ష్మ మనుషులెవరైనా దీనికి సాయం చేసి ఉండొచ్చనీ కొందరు అంటున్నారు. ఈ ఊహలన్నీ పక్కనపెడితే క్రీ.పూ. రెండో శతాబ్దం నుంచి క్రీ.శ. ఏడో శతాబ్దం మధ్యలో చేతి పనిముట్లతోనే నిర్మించారనీ రోజుకి 16 గంటల చొప్పున పనిచేసి ఉంటారనేది మరో అంచనా. తొలిచే సమయంలో వెలుతురు కోసం- అద్దాలమీద పడిన సూర్యకాంతి ప్రతిబింబించేలా అద్దాలను అమర్చి ఉండొచ్చని ఒక వాదన. కానీ ఆలయం లోపలి భాగాల్లో ఎన్ని అద్దాలను అమర్చినా సూర్యకాంతి పడే అవకాశం లేదు. మహామునులు జ్ఞాననేత్రంతో చూసి చెబుతుంటే, చీకటిలోనే శిల్పులు చెక్కి ఉండొచ్చు అనేవాళ్లూ ఉన్నారు. ఈ ఆలయ రూపశిల్పి ఎవరైనాగానీ అతనికి వేద విజ్ఞానం, వాస్తు నిర్మాణంలో అద్భుతమైన ప్రతిభాపాటవాలు, వేలమంది శిల్పులతో పనిచేయించగల నేర్పరితనం ఉండి ఉండాలి.

సొరంగ రహస్యం!

ఈ ఆలయంలోని మరో విశేషం సొరంగాలు. ఇవి నలభై అడుగుల లోతు వరకూ ఉంటాయని చెబుతారు. కెవాలియర్‌ లూయీ అనే వ్యక్తి ఈ సొరంగంలోకి వెళ్లాడనీ, పెద్ద లోహరాతి వేదికలు బ్యాటరీల సాయంతో చార్జింగ్‌ అవుతున్నాయనీ, వాటిమీద ఏడుగురు వ్యక్తులు కూర్చుని ఉన్నారనీ, మధ్యలోని వ్యక్తి రూపం అస్పష్టంగా ఉందనీ కానీ ఆయన మాట్లాడుతున్నాడనీ చెప్పే కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక, ఆలయం లోని శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు. ఈ సొరంగ నగరంలోకి వెళ్తాయనే ఊహిస్తున్నారు. ప్రాంగణంలోని నేలకు ఉన్న ఆ రంధ్రాల్ని గాలీ వెలుతురు కోసం ఏర్పాటు చేసినవి కావచ్చని ఊహిస్తున్నారు. వాటిల్లో పిల్లలు పడిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని మూసి వేయించింది. అయితే అక్కడ విలువైన నిధులు ఉండొచ్చు. లేదంటే ఆలయం కింద అంత పెద్ద సొరంగాలు ఎందుకు తవ్వినట్లు... అనేవాళ్లు ఉన్నారు. లేదా అవన్నీ ప్రాచీన నగరాలా...గుండ్రంగా ఉన్న ఈ రంధ్రాల్లోకి చిన్న మనుషులే పడతారు. ఆలయంమీది శిల్పాల్లోని రూపాలను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. అన్నది మరికొందరి ఊహాగానం. ఏది ఏమైనా ఎన్నో అంతుబట్టని రహస్యాలకు నిలయమైన ఎల్లోరాలోని కైలాస దేవాలయం చూసి తీరాల్సిన అద్భుతం!

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న