వేడి వేడిగా.. వడ్డించండి! - Sunday Magazine
close

వేడి వేడిగా.. వడ్డించండి!

ఇంటికి ఎవరైనా అనుకోకుండా వచ్చినప్పుడు ఏం చేయాలా అని కంగారుపడకుండా ఇలాంటివి వండి చూడండి. చపాతీల్లోకే కాదు, పులావ్‌ లాంటివాటికీ మంచి కాంబినేషన్‌. చేయడమూ సులువే.


ఆలూ కర్రీ

కావలసినవి: ఉడికించి, పొట్టు తీసిన చిన్న బంగాళాదుంపలు: రెండు కప్పులు, నూనె: నాలుగు టేబుల్‌స్పూన్లు, టొమాటో గుజ్జు: ఒకటిన్నర కప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, పెరుగు: కొద్దిగా, కొత్తిమీర: కట్ట. మసాలాకోసం: ఎండుమిర్చి: ఎనిమిది, దనియాలు: రెండు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: టేబుల్‌స్పూను, లవంగాలు: నాలుగు, గసగసాలు: టేబుల్‌స్పూను, సోంపు: టేబుల్‌స్పూను, దాల్చినచెక్క: చిన్నముక్క, మిరియాలు: పావుచెంచా, కొబ్బరితురుము: రెండు టేబుల్‌స్పూన్లు.

తయారీ విధానం: మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలను మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి బంగాళాదుంపలు, ఉప్పు వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేసి అల్లంవెల్లుల్లి ముద్ద వేసి చేసిపెట్టుకున్న మసాలా, తగినంత ఉప్పు, టొమాటో గుజ్జు వేసి కలపాలి. అయిదు నిమిషాలయ్యాక మరికొంచెం ఉప్పు, బంగాళాదుంపలు, పెరుగు వేసి బాగా కలిపి కొత్తిమీర చల్లి దింపేయాలి.


వెజిటబుల్‌ ఫ్రై

కావలసినవి
బంగాళాదుంప: ఒకటి, క్యారెట్‌: ఒకటి, బీన్స్‌: అయిదు, వంకాయలు: రెండు, బెండకాయలు: అయిదు, నూనె: అరకప్పు, వెన్న: చెంచా, జీలకర్ర: అరచెంచా, బిర్యానీఆకు: ఒకటి, కసూరీమేథీ: అరచెంచా, ఉల్లిపాయ: ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా, కారం: చెంచా, పసుపు: పావుచెంచా, ఉప్పు: తగినంత, జీలకర్రపొడి: అరచెంచా, దనియాలపొడి: అరచెంచా, గరంమసాలా: పావుచెంచా, టొమాటోగుజ్జు: అరకప్పు, కొత్తిమీర: కట్ట.

తయారీ విధానం
స్టౌమీద కడాయి పెట్టి ముప్పావువంతు నూనె వేసి కూరగాయ ముక్కలను ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. అందులోనే మిగిలిన నూనె, వెన్న వేసి జీలకర్ర, బిర్యానీఆకు, కసూరీమేథీ వేసి తరువాత ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేయించుకోవాలి. రెండు నిమిషాలయ్యాక కారం, పసుపు, జీలకర్రపొడి, దనియాలపొడి, గరంమసాలా, తగినంత ఉప్పు, టొమాటోగుజ్జు వేసి బాగా కలపాలి. ఇది చిక్కగా అయ్యాక వేయించుకున్న కూరగాయముక్కలను వేసి కొద్దిగా నీళ్లు చల్లి బాగా కలిపి అయిదు నిమిషాలయ్యాక కొత్తిమీర వేసి దింపేయాలి.


చికెన్‌ వేపుడు

కావలసినవి
ఎముకల్లేని చికెన్‌: అరకేజీ, అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు టేబుల్‌స్పూన్లు, కారం: రెండు చెంచాలు, పసుపు: కొద్దిగా, జీలకర్రపొడి: చెంచా, గరంమసాలా: చెంచా, కసూరీమేథీ: అరచెంచా, కొత్తిమీర: కట్ట, పెరుగు: పావుకప్పు, నెయ్యి: పావుకప్పు, ఉప్పు: తగినంత.

తయారీ విధానం
స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, జీలకర్రపొడి, గరంమసాలా, కసూరీమేథీ, కారం, తగినంత ఉప్పు, చికెన్‌ముక్కలు వేసి బాగా కలపాలి. మధ్యమధ్య నీళ్లు చల్లుతూ ఉంటే చికెన్‌ముక్కలు ఉడుకుతాయి. అప్పుడు పెరుగు, కొత్తిమీర వేసి బాగా కలిపి వేపుడు కూరలా అయ్యేవరకూ వేయించుకుని తీసుకోవాలి.  


పనీర్‌ మసాలా

కావలసినవి
పనీర్‌ముక్కలు: కప్పు, గడ్డపెరుగు: అరకప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు, కారం: చెంచా, పసుపు: చెంచా, దనియాలపొడి: అరచెంచా, జీలకర్రపొడి: అరచెంచా, గరంమసాలా: చెంచా, కసూరీమేథీ: రెండు చెంచాలు, నూనె: అరకప్పు, ఉప్పు: తగినంత, వెన్న: రెండు చెంచాలు, జీలకర్ర: రెండు చెంచాలు, ఉల్లిపాయలు: రెండు, క్యాప్సికం: ఒకటి, టొమాటో ముద్ద: కప్పు, కొత్తిమీర: కట్ట. 

తయారీ విధానం
ఓ గిన్నెలో పెరుగు, చెంచా అల్లంవెల్లుల్లి ముద్ద, సగం పసుపు, జీలకర్రపొడి, దనియాలపొడి, కొద్దిగా ఉప్పు, గరంమసాలా, కసూరీమేథీ, చెంచా నూనె వేసి బాగా కలపాలి. అందులో పనీర్‌ముక్కలు వేసి మరోసారి కలపాలి. తరువాత స్టౌమీద కడాయి పెట్టి నూనె వేస్తూ పనీర్‌ముక్కల్ని ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. అదే కడాయిలో మిగిలిన నూనె, వెన్న వేసి జీలకర్ర వేయించి ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలు, మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్ద వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలయ్యాక మిగిలిన పసుపు, కారం, తగినంత ఉప్పు, టొమాటో ముద్ద, కొత్తిమీర వేసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. ఈ మిశ్రమం దగ్గరకొచ్చాక పనీర్‌ముక్కలు వేసి బాగా కలిపి దింపేయాలి.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న