కోకాకోలా సరస్సులో ఈత కొడతారా... - Sunday Magazine
close

కోకాకోలా సరస్సులో ఈత కొడతారా...

అందరూ కోకాకోలాని తాగుతారు. కానీ బ్రెజిల్‌లోని రియో గ్రాండ్‌ డెల్‌ నార్టె ప్రాంతానికి వెళ్లినవాళ్లు మాత్రం కోకాకోలా సరస్సులో ఈతకొడతారు. ‘అదెలా...’ అని ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ... ఈ సరస్సులోని నీళ్లు అచ్చం కోకాకోలా డ్రింకులానే ఉంటాయట మరి. అందుకే, ‘లాగొవా డా అరారక్వరా’ అనే ఈ సరస్సును అందరూ కోకాకోలా లేక్‌ అని పిలుస్తారు. అయోడిన్‌, ఐరన్‌ స్థాయులు ఎక్కువగా ఉండడంతో ఇక్కడి నీటికి ఆ రంగు వచ్చిందట. ఈ వింతను చూసేందుకూ కోకాకోలా నీటిలో జలకాలాటలు ఆడేందుకూ ఎందరో పర్యటకులు ఈ చోటుకి వస్తుంటారట.


ఊరంతటికీ ఒకే ఒక్కడు..!

ఊరి గురించైనా మాట్లాడేటప్పుడు ‘ఎన్నిళ్లు ఉంటాయి... ఎంతమంది జనాభా...’ అని అడుగుతారు. అలా తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా మీనాక్షీపురం గ్రామం గురించి చెప్పాల్సొస్తే ‘ఆ ఊరిలో వందల ఇళ్లుంటాయి. కానీ జనాభా మాత్రం ఒకే ఒక్క మనిషి. అతడే డెబ్భై ఏళ్ల కందసామి నాయకర్‌’ అని చెప్పాలి. 2001 జనాభా లెక్కల ప్రకారం ఆ ఊరి జనాభా సుమారు 1300. తర్వాత నుంచే ఒక్కొక్కరుగా అందరూ ఊరొదిలి వెళ్లిపోయారు. దీనికి ఒక కారణం అక్కడి నీటి సమస్య అయితే, మరొకటి ప్రజారవాణా లేకపోవడం. ఆ ప్రాంతంలో వర్షాలు లేక పంటలు సరిగా పండవు. భూగర్భజలాలూ లేక తాగునీటిక్కూడా అయిదు కి.మీ దూరం వెళ్లి తెచ్చుకోవాలట. ఇక, ప్రయాణాలు చెయ్యాలంటే మైళ్ల దూరం నడిచి వెళ్లి పక్కఊరి బస్టాప్‌కి చేరుకోవాలి. ఈ సమస్యలతోనే అందరూ వలస వెళ్లిపోయారు. వారి ఇళ్లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. కానీ కందసామి మాత్రం తన ఊపిరి ఆగిపోయేవరకూ పుట్టిన గడ్డమీదే ఉంటానని ఒంటరిగా ఉండిపోయాడట. ఏడాదికోసారి స్థానిక ఆలయంలో పూజలు చేసేందుకు మాత్రం గ్రామస్థులు వచ్చి ఒక రోజు ఉండి వెళ్లిపోతారు. నీటి సమస్య ఊరినే లేకుండా చేసిందన్నమాట.


పాముకాదు, వానపామే!

ఫొటోలోని అమ్మాయి చేతిలో ఉన్నదాన్ని చూస్తే ఏదో పెద్ద పాము అనిపిస్తోంది కదూ... కానీ అది పాము కాదు వానపాము. అవును మీరు చదివింది ముమ్మాటికీ నిజమే. మట్టిని గుల్ల చేసి మొక్కలు ఏపుగా పెరిగేందుకు ఉపయోగపడే ఆ వానపాములే ఇవి. భారీ సైజులో ఉండే ఇవి ఆస్ట్రేలియాలోని సౌత్‌ జిప్స్‌లాండ్‌ దగ్గర ఉన్న బాస్‌ నదీ పరివాహక ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయట. అక్కడ రైలు మార్గం వేసేందుకు తవ్వుతున్న సమయంలో మొదటిసారి ఈ పొడవాటి జీవాలను చూసిన కూలీలు పాములు అనుకున్నారట. వాటిని పరిశీలించిన శాస్త్రవేత్తలు అవి భారీగా పెరిగిన వానపాములే అని తేల్చారు. పదేళ్లకు పైగా బతికే ఇవి రెండు మీటర్ల వరకూ పొడవు పెరుగుతాయి. పెద్దగా ఉండడం వల్ల ఈ జిప్స్‌లాండ్‌ ఎర్రలు బురదనేలల్లో అయిదడుగుల లోతులో కదులుతున్నా బయటకు టబ్బులో నుంచి నీరు పోతున్నట్లు శబ్దం వినిపిస్తుందట.


నారీ నారీ నడుమ కొరిక్‌...

ఇండోనేషియాలోని సెంట్రల్‌ లొంబక్‌కి చెందిన 20ఏళ్ల కొరిక్‌ అక్బర్‌కి ఈమధ్య పెళ్లి కుదిరిందట. ఆ విషయాన్ని అమ్మాయీ అబ్బాయీ సోషల్‌ మీడియాలో స్నేహితులతో పంచుకోవడంతో చాలామంది శుభాకాంక్షలూ తెలిపారు. ఇక, పెళ్లిరోజు రానే వచ్చేసింది. వధూవరులిద్దరూ పెళ్లి మండపంలో కూర్చున్నారు. ఇంతలో ఓ అమ్మాయి హడావుడిగా అక్కడికి వచ్చింది. ఆమె కొరిక్‌ మాజీ ప్రియురాలు యనిత. నాలుగేళ్ల కిందట ప్రేమించుకున్న ఆ ఇద్దరూ కొన్ని కారణాల వల్ల విడిపోయారట. దాంతో ‘కొతిమహ్‌’ అనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు కొరిక్‌. ఈ విషయం సోషల్‌ మీడియా గ్రూపు ద్వారా తెలుసుకున్న యనిత వచ్చి ‘దయచేసి నన్నూ పెళ్లి చేసుకో’ అని బతిమాలడం మొదలెట్టిందట. అది చూసిన మరో పెళ్లి కూతురైతే ఏం చేసేదో చెప్పనక్కర్లేదు. కానీ కొతిమహ్‌ మాత్రం అందరూ అవాక్కయ్యేలా పెళ్లికొడుకు తనతో పాటు, ఈ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుందట. అసలమ్మాయికే సమస్య లేనప్పుడు మాదేం పోయిందని పెద్దలూ అంగీకారం తెలిపారు. దాంతో కొరిక్‌ ఇద్దరినీ పెళ్లాడాడు. మరో చిత్రం ఏంటంటే అతడికి ఇప్పటివరకూ ఉద్యోగం కూడా లేదట.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న