రాఖీ వేళ... మిఠాయిల మేళా! - Sunday Magazine
close

రాఖీ వేళ... మిఠాయిల మేళా!

తమ్ముడు లేదా అన్నకు రాఖీ కట్టాక... వాళ్ల నోటిని తీపి చేయడం మామూలే. ఈసారి వాళ్లకు ఏం మిఠాయి పెట్టాలాని ఆలోచిస్తుంటే... వీటిని స్వయంగా చేసి రుచి చూపిస్తే సరి.


మీఠా చనాదాల్‌ సమోసా

కావలసినవి

మైదా: రెండు కప్పులు, సెనగపప్పు: అరకప్పు, బెల్లం తరుగు: అరకప్పు, జీడిపప్పు పలుకులు: రెండు టేబుల్‌స్పూన్లు, బాదంపలుకులు: పది, కిస్‌మిస్‌: కొన్ని, యాలకులపొడి: అర చెంచా, నెయ్యి: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: ముందుగా మైదాలో నీళ్లు పోస్తూ చపాతీపిండిలా చేసుకుని కొద్దిగా నెయ్యివేసి మరోసారి కలిపి మూత పెట్టేయాలి. అదేవిధంగా సెనగపప్పును నాలుగు గంటలు నానబెట్టుకుని తరువాత అరకప్పు నీళ్లతో ఒక కూత వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. పప్పు వేడి పూర్తిగా చల్లారాక ఓసారి గ్రైండ్‌ చేసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి బెల్లం తరుగు వేసి కొద్దిగా నీళ్లుపోయాలి. బెల్లం కరిగి పాకంలా అవుతున్నప్పుడు సెనగపప్పు మిశ్రమం వేసి బాగా కలిపి ముద్దలా అవుతున్నప్పుడు జీడిపప్పు, కిస్‌మిస్‌ పలుకులు, యాలకులపొడి వేసుకుని స్టౌ కట్టేయాలి. ఇప్పుడు కొద్దిగా మైదా పిండిని తీసుకుని చపాతీలా వత్తి మధ్యకు చాకుతో కోసుకోవాలి.

ఒక భాగాన్ని తీసుకుని త్రికోణాకారంలో చేసుకుని ఒకటిన్నర చెంచా సెనగపప్పు మిశ్రమాన్ని పెట్టి అంచుల్ని తడి చేత్తో మూసేయాలి. ఇలా అన్నింటినీ చేసుకుని నెయ్యిలో వేసి ఎర్రగా వేయించుకుని పైన బాదం పలుకులు అలంకరించాలి.


కరాచీ కార్న్‌ఫ్లోర్‌ హల్వా

కావలసినవి: మొక్కజొన్నపిండి: అరకప్పు, నీళ్లు: రెండు కప్పులు, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు, జీడిపప్పు పలుకులు: పావుకప్పు, యాలకులపొడి: అరచెంచా, ఫుడ్‌కలర్‌: కొద్దిగా, చక్కెర: ఒకటిన్నర కప్పు.

తయారీ విధానం: ఓ గిన్నెలో మొక్కజొన్నపిండి తీసుకుని అందులో కప్పు నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలిపి ఫుడ్‌ కలర్‌ వేయాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి అరచెంచా నెయ్యివేసి జీడిపప్పు వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో చక్కెర, కప్పు నీళ్లు పోయాలి. చక్కెర కరిగి లేతపాకం పడుతున్నప్పుడు మొక్కజొన్న మిశ్రమం వేసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. మధ్యమధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి దగ్గరకు అవుతుంది. అప్పుడు మిగిలిన నెయ్యి, యాలకులపొడి, జీడిపప్పు పలుకులు వేసి బాగా కలిపి రెండు నిమిషాలయ్యాక నెయ్యిరాసిన ప్లేటులో పరిచి ముక్కల్లా కోయాలి.


కొబ్బరి పేడా

కావలసినవి

కొబ్బరి తురుము: ఒకటింబావు కప్పు, నెయ్యి: టేబుల్‌స్పూను, పాలపొడి: పావుకప్పు, కండెన్స్‌డ్‌ మిల్క్‌: అరకప్పు, యాలకులపొడి: చెంచా, జామ్‌: పావుకప్పు

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి కప్పు కొబ్బరి తురుమును వేయించుకుని ఓ ప్లేటులోకి తీసుకోవాలి. అదే బాణలిలో నెయ్యి వేసి కండెన్స్‌డ్‌ మిల్క్‌ పోయాలి. నిమిషమయ్యాక పాలపొడి, వేయించిన కొబ్బరి తురుము, యాలకులపొడి వేసి బాగా కలిపి దింపేయాలి. వేడి చల్లారాక చేతికి నెయ్యి రాసుకుని చిన్నచిన్న బిళ్లల్లా చేసుకుని పైన జామ్‌, మిగిలిన కొబ్బరిపొడి అలంకరించాలి.  


నువ్వుల బర్పీ

కావలసినవి

సెనగపిండి: కప్పు, నువ్వులు: ముప్పావుకప్పు, నెయ్యి: అరకప్పు, కోవా: కప్పు, చక్కెర పొడి: ఒకటిన్నర కప్పు, బాదంపలుకులు: అరచెంచా, యాలకులపొడి: చెంచా.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి నువ్వుల్ని దోరగా వేయించుకుని ఆ తరువాత పొడి చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద మళ్లీ కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక సెనగపిండి వేసి వేయించి అయిదు నిమిషాలయ్యాక కోవా, చక్కెరపొడి, నువ్వులపొడి వేసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. ఈ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు యాలకులపొడి, బాదంపలుకులు వేసి మరోసారి కలిపి స్టౌని కట్టేసి నెయ్యిరాసిన ప్లేటులో పరిచి... వేడి కొద్దిగా చల్లారాక ముక్కల్లా కోయాలి.


సూజీ గులాబ్‌ జామూన్‌

కావలసినవి

బొంబాయిరవ్వ: కప్పు, నెయ్యి: వేయించేందుకు సరిపడా, పాలు: మూడుకప్పులు, పాలపొడి: రెండు టేబుల్‌స్పూన్లు, చక్కెర: రెండు టేబుల్‌స్పూన్లు. పాకంకోసం: చక్కెర: ఒకటిన్నర కప్పు, నీళ్లు: ఒకటిన్నర కప్పు, యాలకులపొడి: చెంచా.

తయారీ విధానం: ముందుగా ఓ గిన్నెలో చక్కెర, నీళ్లు తీసుకుని స్టౌమీద పెట్టాలి. చక్కెర కరిగి తీగంపాకం వచ్చాక యాలకులపొడి వేసి దింపేయాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి పాలు పోయాలి. అవి మరుగుతున్నప్పుడు పాలపొడి, చక్కెర వేయాలి. అయిదు నిమిషాలయ్యాక బొంబాయిరవ్వను కూడా వేసి మధ్యమధ్య కలుపుతూ ఉండి... మిశ్రమం చిక్కగా అయ్యాక దింపేయాలి. ఇప్పుడు చేతులకు నూనె రాసుకుని ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి వేయించేందుకు సరిపడా నెయ్యి వేయాలి. అది వేడెక్కాక ఈ ఉండల్ని వేసి ఎర్రగా వేయించుకుని తరువాత పాకంలో వేస్తే సరి.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న