పండక్కి.. స్వీటూ, హాటూ! - Sunday Magazine
close

పండక్కి.. స్వీటూ, హాటూ!

దసరా సమయంలో రోజువారీ చేసే నైవేద్యాలు ఒకెత్తయితే... ఇంటికొచ్చే అతిథులకూ  బంధువులకూ పెట్టేందుకు కాస్త స్వీటూహాటూ కూడా తప్పనిసరే. అలా చేసుకునే పిండి వంటల్లో ఈసారి వీటిని చేరిస్తే సరి. తక్కువ సమయంలో చేసుకోవచ్చు. రుచికీ తిరుగుండదు.


సగ్గుబియ్యం లడ్డు

కావలసినవి సగ్గుబియ్యం: కప్పు, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు, జీడిపప్పు పలుకులు: రెండు టేబుల్‌స్పూన్లు, చక్కెర: ఒకటింబావు కప్పు, ఆరెంజ్‌ఫుడ్‌ కలర్‌: చిటికెడు, బొంబాయిరవ్వ: రెండు టేబుల్‌స్పూన్లు.

తయారీ విధానం: అరగంట ముందు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుని ఆ తరువాత నీటిని పూర్తిగా వంపేయాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు పలుకుల్ని వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం, రవ్వ వేసి తడిపోయే వరకూ వేయించుకుని చక్కెర వేయాలి. చక్కెర కరిగాక ఆరెంజ్‌ఫుడ్‌ కలర్‌, జీడిపప్పు పలుకులు, మిగిలిన నెయ్యి వేసి మధ్యమధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి ఈ మిశ్రమం దగ్గరకు
అవుతుంది. అప్పుడు దింపేసి... వేడి కొద్దిగా చల్లారాక లడ్డూల్లా చుట్టుకుంటే సరి.


మైదా మేథీ బిస్కెట్లు


కావలసినవి: మైదా: కప్పు, బొంబాయిరవ్వ: పావుకప్పు, వాము: అరచెంచా, కసూరీమేథీ: చెంచా, మిరియాలపొడి: అరచెంచా, నెయ్యి: మూడు టేబుల్‌స్పూన్లు, నూనె: వేయించేందుకు సరిపడా, ఉప్పు: అరచెంచా.

తయారీ విధానం: ఓ గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత నీళ్లు పోస్తూ చపాతీపిండిలా చేసుకోవాలి. అయిదు నిమిషాలయ్యాక చాలా కొద్దిగా పిండిని తీసుకుని మందంగా చిన్నపూరీ ఆకారంలో వచ్చేలా చేసుకుని ఫోర్కుతో అక్కడక్కడా గాట్లు పెట్టుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండినీ చేసుకుని రెండుమూడు చొప్పున కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


కోవా బర్ఫీ

కావలసినవి: కోవా: అరకప్పు, మైదా: అరకప్పు, బేకింగ్‌పౌడర్‌: అరచెంచా, యాలకులపొడి: పావుచెంచా, నూనె: వేయించేందుకు సరిపడా, చక్కెర: కప్పు, నెయ్యి: రెండు చెంచాలు, సోంపు: అరచెంచా.  

తయారీ విధానం: ఓ గిన్నెలో చక్కెర తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని  బాగా కలపాలి. తరువాత నీళ్లు చల్లుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని కాస్త మందంగా వత్తుకుని ఆ తరువాత బిళ్లల్లా కోసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద గిన్నె పెట్టి, చక్కెర వేసి పావుకప్పు నీళ్లు పోయాలి. చక్కెర కరిగి లేతపాకం వస్తున్నప్పుడు దింపేయాలి. వేయించుకున్న కోవా బిళ్లల్ని ఇందులో వేసి వాటికి పాకం పట్టేవరకూ ఉంచి తరువాత తీసేయాలి.


అటుకులు-రవ్వ మురుకులు


 

కావలసినవి: అటుకులు: రెండు కప్పులు (పొడిచేసుకోవాలి), రవ్వ: కప్పు, నెయ్యి: టేబుల్‌స్పూను, నీళ్లు: రెండు కప్పులు, పసుపు: పావుచెంచా, కారం: చెంచా, ఉప్పు: తగినంత, జీలకర్ర: చెంచా, నువ్వులు: రెండు చెంచాలు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి నీళ్లు పోయాలి. అవి మరుగుతున్నప్పుడు రవ్వ వేసి కలపాలి. రవ్వ ఉడుకుతున్నప్పుడు నెయ్యి వేసి స్టౌని కట్టేయాలి. ఇప్పుడు నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలో వేసుకోవాలి. అందులో రవ్వ మిశ్రమం కూడా వేసి బాగా కలిపి గోరువెచ్చని నీళ్లు పోస్తూ మురుకుల పిండిలా చేసుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టానికి నూనె రాసి అందులో ఈ మిశ్రమాన్ని ఉంచి... వేడి నూనెలో మురుకుల్లా వత్తుకుని ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండినీ చేసుకోవాలి.


పనీర్‌ జిలేబీ


కావలసినవి: తాజా పనీర్‌: కప్పు, మొక్కజొన్నపిండి: పెద్ద చెంచా, మైదా: పెద్ద చెంచా, బేకింగ్‌పౌడర్‌: అరచెంచా, పాలు: మూడు టేబుల్‌స్పూన్లు, యాలకులపొడి: చెంచా, గులాబీ ఎసెన్స్‌: చెంచా, కుంకుమపువ్వు రేకలు: కొద్దిగా, ఆరెంజ్‌ఫుడ్‌ కలర్‌: చిటికెడు, చక్కెర: కప్పు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: ముందుగా చక్కెర, అరకప్పు నీళ్లు ఓ గిన్నెలో వేసి స్టౌమీద పెట్టాలి. చక్కెర కరిగి తీగంపాకంలా వస్తున్నప్పుడు సగం గులాబీఎసెన్స్‌, కుంకుమపువ్వు రేకలు, అర చెంచా నీటిలో కలిపిన ఆరెంజ్‌ఫుడ్‌ కలర్‌ వేసి  కలిపి దింపేయాలి. ఇప్పుడు ఓ గిన్నెలో పనీర్‌ వేసుకుని పొడిపొడిగా చేసుకుని ఇందులో చక్కెర పాకం, నూనె, పాలు తప్ప మిగిలిన పదార్థాలు వేసుకుని బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి పాలు పోస్తూ చిక్కని దోశ పిండిలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కోన్‌లా చుట్టుకున్న ప్లాస్టిక్‌ కవరులో వేసుకుని కాగుతున్న నూనెలో జిలేబీల్లా వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. వీటిని చక్కెరపాకంలో వేసి పాకం పట్టిందనుకున్నాక తీసేయాలి.

Advertisement

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న