ఇడ్లీ.. జిలేబీ.. సమోసా.. ఏవీ మనవి కావట! - Sunday Magazine
close

ఇడ్లీ.. జిలేబీ.. సమోసా.. ఏవీ మనవి కావట!

పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌తో పలకరించే ఇడ్లీ... విరామంలో సేదతీర్చే టీ... తియ్యతియ్యని గులాబ్‌ జామూన్‌... నోరూరించే సమోసా...  మన ఆహారంలో భాగమైపోయిన ఈ పదార్థాలన్నీ పుట్టింది మనదేశంలో కాదంటే నమ్ముతారా? ఆశ్చర్యంగా అనిపించే ఆ వివరాలేంటో ఓ  లుక్కేయండి మరి!

గులాబ్‌ జామూన్‌.. ఇంట్లో జరుపుకునే చిన్న పండుగ నుంచి పెళ్లిభోజనాల వరకూ స్వీట్లలో ఇది ఉండాల్సిందే. మనకు అంతలా దగ్గరైన ఈ మిఠాయి నిజానికి ‘లుక్మత్‌ అల్‌ కాదీ’ అనే ఇరాన్‌ వంటకం. అప్పట్లో కోవా ఉండల్ని తేనె, రోజ్‌వాటర్‌లలో నానబెట్టి దానిపైన చక్కెర చల్లి దీన్ని తయారుచేసేవాళ్లట. మొఘల్‌ రాజుల కాలంలో ఈ స్వీట్‌ మన దేశానికి పరిచయమైంది. ఈ మిఠాయికి గోల్‌(పువ్వు), అబ్‌ (నీళ్లు) అనే పర్షియన్‌ పదాల నుంచి గులాబ్‌ జామూన్‌ అనే పేరొచ్చింది. బంగారు రంగులో చూడగానే నోరూరించే జిలేబీ కూడా ఇరాన్‌, పశ్చిమ ఆసియా దేశాల నుంచే భారతదేశంలోకి వచ్చిందట.


సమోసా.. అందర్నీ అలరించే స్నాక్స్‌ జాబితాలో ఇది కచ్చితంగా ఉంటుందనే చెప్పొచ్చు. బోలెడన్ని రుచుల్లో దొరికే ఈ ఫేమస్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ పుట్టింది మన దగ్గర కాదండోయ్‌. మొదటిసారిగా 11వ శతాబ్దంలో పర్షియన్‌ చరిత్రకారుడు ‘అబుల్‌ ఫజల్‌ బెహాకీ’ తన రచనల్లో సమోసా పదాన్ని ఉపయోగించారట. 13వ శతాబ్దంలో ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఇరాన్‌ వ్యాపారస్తులు తొలిసారిగా మన దేశానికి సమోసాను పరిచయం చేశారు. మొదట్లో మాంసం, నెయ్యి, ఉల్లిపాయలతో తయారయ్యే సమోసా కాలక్రమంలో మారుతూ వచ్చింది. ప్రాంతాన్ని బట్టి ఇప్పుడు రకరకాల వెరైటీల్లో దొరుకుతోంది. పర్షియన్‌ భాషలో దీన్ని ‘సంబోసా’ అని పిలిచేవారు. అదే సమోసాగా మారిపోయిందన్నమాట.ఇడ్లీ.. సాధారణంగా దీన్ని దక్షిణాది వంటకమనే అనుకుంటాం. కానీ ఇది ఇండోనేషియా నుంచి మన దేశానికి వచ్చిందట. ఒకప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించిన హిందూ రాజులు ఆవిరి మీద ఉడికించే వంటకాలను చేయించుకునేవారట. ఇందులో భాగంగానే ఇడ్లీలు తయారు చేయడం మొదలుపెట్టారట. క్రీస్తు శకం 800-1200 మధ్యకాలంలో ఇడ్లీ ఇండియాలో అడుగుపెట్టిందని చెబుతారు... కేటీ అచ్చయ్య అనే ప్రముఖ ఆహార చరిత్రకారుడు.టీ.. పొద్దుపొద్దున్నే గరం గరం చాయ్‌ తాగనిదే చాలామందికి రోజు మొదలవదంటే ఆశ్చర్యం లేదు. పనిలోనూ హుషారు కోసం టీ గుటకలు వేసేవాళ్లూ ఎంతోమంది ఉంటారు. మన పానీయాల్లో అంతలా ఒదిగిపోయిన ఈ టీ పుట్టింది మాత్రం చైనాలో. టీ  పుట్టుక గురించి చాలా కథలే ఉన్నాయి. క్రీస్తుపూర్వం 2737లో షెన్‌ నుంగ్‌ అనే చైనా చక్రవర్తి కోసం సేవకులు ఓ చెట్టు కింద నీళ్లు మరిగిస్తున్నారట. అప్పుడే గాల్లో ఎగిరి వచ్చిన కొన్ని ఆకులు ఆ పాత్రలో పడ్డాయి. తర్వాత షెన్‌ నుంగ్‌ ఆ  నీళ్లు తాగగానే ఆయనకు ఆ రుచి బాగా నచ్చడంతో పాటు హుషారూ వచ్చిందట. ఆరోజు చక్రవర్తి తాగినవి తేయాకు మరిగిన నీళ్లు. తర్వాత ఆ పద్ధతి చైనాలో అన్ని ప్రాంతాలకూ వ్యాపించింది. యూరప్‌లో 16వ శతాబ్దంలో మొదట తేయాకు గురించి తెలిసింది. ఆ తర్వాత బ్రిటిష్‌ వాళ్ల ద్వారా మన దేశంలోకి టీ ప్రవేశించింది.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న