పశువుల హాస్టల్‌.. పల్లెని మార్చేసింది! - Sunday Magazine
close

పశువుల హాస్టల్‌.. పల్లెని మార్చేసింది!

కర్నూలు జిల్లా తడకనపల్లె... వెనకబాటుతనం, వలసలూ, అపరిశుభ్రత ఉండే మిగతా  గ్రామాల్లాంటిది కాదీ పల్లె! స్వయం సహాయక బృందాల శ్రమశక్తితో ఊరు నుంచి కరవుని తరిమికొట్టిన పల్లె. హాస్టల్‌లో పాడిపశువుల్ని పెంచుతూ తెలుగు రాష్ట్రాల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోన్న పల్లె! అసలు ఇదంతా ఎలా సాధ్యమైందంటే..

ఒకప్పుడు అన్ని గ్రామాల్లానే ఉండేది తడకనపల్లె పరిస్థితి. మగవాళ్లు ఉపాధి కోసం వలస పోతే, మహిళలు ఊళ్లోనే ఉంటూ పాడిపంటల్ని చూసుకునేవారు. కానీ వరస కరవులతో పంటలు పండేవి కాదు. ఊళ్లో కొన్ని కుటుంబాలు కోవా తయారుచేస్తుండటంతో పాలకు మంచి గిరాకీ ఉండేది. ఆ సమయంలో స్వయం సహాయక బృందాల్లోని మహిళలు తమకు వచ్చిన రుణాలతో మేలు జాతి గేదెల్ని కొనితెచ్చి వాటిని పోషిస్తూ ఉపాధి పొందేవారు. అయితే, ఇంటికి దగ్గర్లో పశువుల్ని కట్టడంవల్ల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండేవి. వీటితోపాటు లక్షల రూపాయలు పెట్టి కొన్న గేదెలకు అనారోగ్యం కలిగితే వైద్యానికి ఇబ్బంది అయ్యేది. కొన్నిసార్లు మేత ఉండేది కాదు. ఇన్నింటి మధ్యనా కష్టపడి నెట్టుకు వచ్చేవారు.

గుజరాత్‌లో పశువుల హాస్టల్‌ని స్వయం సహాయక బృందాలు నడుపుతున్నట్టే రాష్ట్రంలోనూ అలాంటిది ప్రారంభించాలనుకుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. అప్పటికే పశుపోషణ ద్వారా తడకనపల్లె మహిళలు ముందడుగు వేయడం చూసి 2016లో ఈ గ్రామాన్ని ఎంపికచేశారు. ప్రభుత్వమే గ్రామ శివారులో పదెకరాల స్థలం ఇందుకు కేటాయించింది. పర్వత ప్రాంతం కావడంతో చదును చేయడానికే రూ.23 లక్షలు ఖర్చయింది. పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో ఎకరా స్థలంలో నాలుగు భారీ షెడ్లను ఏర్పాటు చేశారు. దీనికోసం ఉపాధిహామీ పథకం ద్వారా రూ.49 లక్షలూ, ఎస్‌డీపీ నిధులు రూ.1.34కోట్లు మంజూరుచేశారు. మిగతా తొమ్మిది ఎకరాల్లో పశు గ్రాసం పెంపకానికి నీటి సౌకర్యం కల్పించారు. 2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ హాస్టల్‌(క్షీరసాగర సదనం)ను ప్రారంభించారు.

మహిళా విజయం...

ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో వసతి గృహం ఏర్పాటుచేస్తే దాన్ని విజయపథంలో నడిపించింది మాత్రం గ్రామ డ్వాక్రా గ్రూపులే. ప్రారంభంలో కేవలం ఏడుగురు మహిళలు 40 గేదెలతో వసతి గృహంలో పాల ఉత్పత్తిని ప్రారంభించగా... ప్రస్తుతం వివిధ బృందాలకు చెందిన 35 మంది మహిళలు దాదాపు 200 పశువులను ఇక్కడ ఉంచి పెంచుతున్నారు. ఈ గ్రామంతోపాటు చుట్టుపక్కల పల్లెల పరిధిలో 62 డ్వాక్రా గ్రూపులున్నాయి. అందులో సుమారు 30 గ్రూపులకు చెందిన మహిళలు పశువులను కొనుగోలు చేసి ఇక్కడ ఉంచుతున్నారు. పాడిని పెంచాలనుకునే రైతులూ ఇక్కడ ఉంచే వెసులుబాటు ఉంది. ఈ సౌకర్యాన్నీ రైతులు వినియోగించుకుంటున్నారు. ప్రతిరోజూ ఇక్కడ దాదాపు వెయ్యి లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నారు. వాటిని లీటరు రూ.50 చొప్పున అమ్ముతారు. ఎంతమంది సభ్యులు చేరుతున్నా ఎలాంటి వివాదాలూ  లేకుండా పశువుల హాస్టల్‌ను నడుపుతుండటంతో రాష్ట్రంలోని మిగతా సంఘాలకు నమూనాగా ప్రభుత్వం తడకనపల్లెను చూపించడంతోపాటు తరచూ ప్రోత్సాహకాలూ అందిస్తూ వస్తోంది. గడ్డి కోత యంత్రం, అజొల్లా పెంపకం యూనిట్లు, దాణా లాంటివి రాయితీమీద అందిస్తోంది. పశువైద్యుడిని నియమించింది. విద్యుత్‌ బిల్లు, వాచ్‌మేన్‌ ఖర్చుకు కొంత మొత్తం చెల్లిస్తూ మిగతా పనుల్ని సొంతంగా నిర్వహించుకుంటున్నారు రైతులు. హాస్టల్‌ నిర్వాహక కమిటీ సభ్యురాలుగా ప్రారంభం నుంచి రైతుల్నీ, అధికారుల్నీ సమన్వయపర్చుకుంటూ వచ్చేవారు గ్రామానికి చెందిన మహిళ జుబేదాబీ.

ఇంటింటా కోవా తయారీ!

ఫ్యాన్లు, దోమ తెరల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో పశువులు ఉండటం, పోషకాలు అందడంవల్ల పాల దిగుబడీ పెరుగుతోంది. దాంతో పాల అమ్మకంతోనే సరిపెట్టుకోకుండా, కోవా తయారుచేస్తూ అదనపు ఆదాయాన్నీ సంపాదిస్తున్నారు గ్రామస్థులు. ప్రస్తుతం దాదాపు 30 కుటుంబాలు పాల కోవా తయారు చేస్తున్నాయి. వీరిలో పశుపోషణ చేసే మహిళల కుటుంబాలే ఎక్కువ. అదనంగా చుట్టుపక్కల పల్లెలనుంచీ పాలను సేకరిస్తారు. రోజూ దాదాపు వెయ్యి లీటర్ల పాలతో కోవా తయారుచేస్తూ కిలో కోవా రూ.200 చొప్పున అమ్ముతారు. ‘నాబార్డు ఆధ్వర్యంలో వివిధ డ్వాక్రా గ్రూపుల సభ్యులు కలాకండ్‌, దూద్‌పేడ, పన్నీర్‌, కోవా కజ్జికాయల్లాంటి పదార్థాల తయారీలో శిక్షణ తీసుకున్నారు. త్వరలో వీటి తయారీనీ ప్రారంభించనున్నాము. అని చెబుతారు జుబేదాబీ.

- యడ్లపాటి బసవ సురేంద్ర, ఈనాడు డిజిటల్‌, కర్నూలు

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న