close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కాలాని అలా సాధించాను..!

కాలాని అలా సాధించాను..!

అరవైల్లో ఉన్న రజినీకాంత్‌కి యాభై ఏళ్ల వయసున్న కథానాయిక పాత్ర ఆమెది! మనవలూ, మనవరాళ్లతోపాటూ ఆ పెద్దాయన్నీ బుజ్జగించీ, అదిలించీ.. అవసరమైతే విదిలించీకొట్టే నాయిక. ఆయన చిననాటి ప్రియురాల్ని చూసి అసూయపడే మామూలు ఇల్లాలు. కలహాలెన్నున్నా ఆయన ‘స్వర్ణా.. ఐ లవ్‌ యూ!’ అనగానే ముఖంలో వేల మతాబులు వెలిగించుకునే అమాయకురాలు.. ఇన్ని షేడ్స్‌ ఉన్న పాత్రని అవలీలగా పోషించి ఆహా అనిపించింది ఈశ్వరీ రావు. ‘కాలా’ సినిమా హిట్టా కాదా అనే విషయంలో విభిన్న అభిప్రాయాలున్నా తన నటనపై మాత్రం వేనోళ్లా అభినందనలు అందుకుంటున్న ఈ ‘బాపూ బొమ్మ’ని పలకరిస్తే..

సినిమాలతో ఏమాత్రం సంబంధం లేని కుటుంబం మాది. పుట్టింది తణుకైనా పెరిగిందంతా రాజమండ్రిలోని నాన్నమ్మ వాళ్లింట్లో. వ్యాపారరీత్యా మా అమ్మానాన్నా చెన్నైలో ఉంటే నేను అప్పుడప్పుడూ వెళ్లి వాళ్లని చూసి వస్తుండేదాన్ని. అప్పుడక్కడి ఇరుగింటి పొరుగింటమ్మలు ‘మీ అమ్మాయి నవ్వు బావుంది. రంగు తక్కువైనా కళగల ముఖం. మంచి హీరోయిన్‌ కావొచ్చు..’ అనేవారు. అమ్మ ఆ మాటల్ని సీరియస్‌గానే తీసుకుంది! నాకు పదహారేళ్లు రాగానే చకచకా ఫొటో ఆల్బం చేయించింది. అమ్మా నేనూ కలిసి టి.రాజేందర్‌, భారతిరాజా, బాలచందర్‌.. ఇలా చాలా మంది దర్శకుల వద్దకు వెళ్లి ఆల్బంలు ఇచ్చొచ్చాం. తొలిసారి భారతిరాజా సహాయకుడు టీకే బోస్‌ తన చిత్రానికి కథానాయికగా తీసుకున్నారు. నా పేరుని జననీ అని మార్చారు. ఆ సినిమా పెద్ద మ్యూజికల్‌ హిట్టయ్యింది. ఆ తర్వాత తెలుగులో నిర్మాత ప్రభాకర్‌రెడ్డి నిర్మిస్తున్న ‘ఇంటింటి దీపావళి’ చిత్రంలో నటించే అవకాశమొచ్చింది. సీనియర్‌ దర్శకుడు లక్ష్మీదీపక్‌ రూపొందించిన చిత్రం అది. ఇందులోనేమో వైజయంతి పేరుతో పరిచయమయ్యా! ఆ తర్వాత జగపతిబాబు హీరోగా మోహన్‌గాంధీగారు తీసిన ‘జగన్నాటకం’, జయసుధగారి సొంత సినిమా ‘కలికాలం’, సాగర్‌ దర్శకత్వంలో ‘స్టువర్టుపురం దొంగలు’ ఇలా చాలా సినిమాలే చేశాను. తమిళంలో విజయ్‌ తొలి చిత్రంలో ఇద్దరు హీరోయిన్‌లలో నేనూ ఒకదానిగా చేశాను.

నిజానికి ఈ సినిమాలన్నీ చేసేటప్పుడు నాకు పెద్దగా అవగాహన లేదు. తిరిగి చూస్తే ఏదో చేసినట్టే అనిపించాయికానీ మనసుకి పెద్దగా తృప్తినివ్వలేదు.

‘బాపుబొమ్మ’లో గీతని!
మా అమ్మకు సినిమాలంటే మహా పిచ్చి. ఎక్కువగా హిందీ సినిమాలే నాకు చూపించేవారు. వాటి చలవతో నా అభిరుచి కాస్త సత్యజిత్‌రే సినిమాలవైపు మళ్లింది. ఎప్పటికైనా మంచి ఆర్టిస్టిక్‌ సినిమాల్లో నటించాలనే ఆలోచన పెరిగింది. బాపు, బాలుమహేంద్ర, బాలచందర్‌, మణిరత్నం, కె.విశ్వనాథ్‌.. వీళ్లందరితో నటించాలని ఓ పెద్ద జాబితా తయారుచేసుకున్నాను. ‘గ్లామర్‌ పాత్రలు అందరూ చేసేవే. కానీ ఆర్టిస్టిక్‌ సినిమాలు చేస్తేనే ప్రేక్షకుల మనసులో కలకాలం గుర్తుండిపోతామ’ని నిర్ణయించుకున్నా. అప్పుడే రాజేంద్రప్రసాద్‌గారు బాపూగారికి పరిచయం చేయడంతో ‘రాంబంటు’లో కథానాయికగా మారా. కాకపోతే ఆ సినిమా కోసం నా పేరుని కావేరి అని పెట్టుకున్నా! ఆ చిత్రంలో నటిస్తున్నంత కాలం ‘నేను బాపూ సినిమా హీరోయిన్‌ని!’ అని గర్వపడేదాన్ని. అప్పట్లో అందరూ నన్ను బాపూబొమ్మ అని కూడా పిలిచేవారు. నిజం చెప్పాలంటే.. నేను బాపూ బొమ్మని కాదు ఆయన గీసిన చిన్న గీతని అంతే! ఆయన ఓ విశ్వవిద్యాలయం. అందులో చదివేటప్పటికన్నా... చదివి బయటకొచ్చాకే నేను నేర్చుకున్నవేమిటో తెలిసింది. ముఖంలో భావాల్ని పలికించడం కావొచ్చు, డైలాగ్‌ డెలివరీలో కావొచ్చు.. ఆయన నేర్పిన పాఠాలు ఇప్పటికీ నాకు తోడుగా వస్తూనే ఉన్నాయి.

ఎక్కడో వెలితి..!
‘రాంబంటు’ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. కానీ అప్పటికి తెలుగు పరిశ్రమ చెన్నైని వీడి హైదరాబాద్‌ వచ్చేస్తోంది. మేం చెన్నైలో సొంతిల్లు తీసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఇదే అదనుగా కొందరు వ్యక్తులు నాకొస్తున్న అవకాశాలని అడ్డుకున్నారు. ఈశ్వరీరావును కథానాయికగా ఎంచుకుందామని దర్శక, నిర్మాతలు చెప్పినా మధ్యలో ఉన్న వారు ‘ఆవిడ ఎందుకండీ.. సవాలక్ష కండీషన్లు పెడతారు. పైగా చెన్నై నుంచి రావాలి. అందుకయ్యే ఖర్చెక్కువ!’ అని చెప్పి మరొక హీరోయిన్‌ని రికమండ్‌ చేసేవారు. దాంతో కొన్ని మంచి సినిమాలు వచ్చినట్టే వచ్చి చేజారాయి. మరోవైపు తమిళంలో అవకాశాలు ఎక్కువగా రావడంతో నేనూ తెలుగులో పెద్దగా ప్రయత్నం చేయలేదు. బాపూగారి తర్వాత, నా జాబితాలో ఉన్న బాలుమహేంద్రగారి సినిమా అవకాశం వచ్చింది. ‘రామన్‌ అబ్దుల్లా’ అనే సినిమాలో హీరోయిన్‌గా చేశాను. నా అసలు పేరు ‘ఈశ్వరీ రావు’ అని వచ్చిన తొలి సినిమా అదే! ఆ తర్వాత మణిరత్నం ‘అమృత’ సినిమాలోనూ కీలకపాత్ర పోషించా. ఈలోపు సీరియల్స్‌లో హీరోయిన్‌గానూ అవకాశాలు వచ్చాయి. సన్‌టీవీలో కస్తూరి అనే సీరియల్‌ ఐదేళ్లపాటు సాగింది.. నన్ను అక్కడి ప్రతి ఇంటికీ దగ్గర చేసింది. బుల్లితెరలో బాగా పేరు రావడం చూసి మళ్లీ సినిమా అవకాశాలు తలుపుతట్టాయి. ఊరికే ఫ్రేములో నిలబడే పాత్రలు కాకుండా ముఖ్యమైన పాత్రలొస్తేనే చేయాలనుకున్నా. కానీ దాదాపు పదేళ్ల తర్వాత బోయపాటి శీను ఫోన్‌ చేసి ‘భద్ర’లో నటించమని అడిగారు. కాదనలేకపోయా. ఈ రీఎంట్రీ జోరులోనే వరసగా ‘ప్రేమమ్‌’, ‘బ్రహ్మోత్సవం’, ‘అఆ’, ‘నేనులోకల్‌’ సినిమాలు చేశాను.

‘అమ్మగానా.. బాగోదేమో’
ఈ సమయంలోనే రంజిత్‌ ఓసారి ఫోన్‌ చేశారు. ‘రజినీకాంత్‌ సినిమాలో ఓ కీలకమైన పాత్ర పోషించాలి.. నటిస్తారా?’ అని అడిగారు. సరేనని చెప్పా. మరుసటిరోజు ఇంటికి వచ్చి ఫొటోలు తీసుకెళ్లారు. అయితే సినిమాలో నాదే పాత్రో మాత్రం చెప్పలేదు. తర్వాత 15 రోజుల పాటు రంజిత్‌ నుంచి ఫోను లేదు. మళ్లీ వచ్చి ఫొటోలు తీసుకున్నారు. ఇక నేను ఆగలేక.. ‘ఏ పాత్రకు రంజిత్‌గారూ..’ అని అడిగా! ‘చెబుతాను లెండి’ అన్నారు. ‘అంటే.. మరీ రజినీకాంత్‌కు తల్లి పాత్ర అయితే బాగోదుకదా..!’ అన్నా. నవ్వేశారాయన. కొన్నిరోజుల తర్వాత ఫోన్‌ చేసి.. ‘రజినీసార్‌ కూడా ఒప్పుకున్నారు. మీరు కాలా చిత్రంలో నటిస్తున్నారు’ అని అడిగారు. ‘ఇంతకీ పాత్రేంటి?’ అని అడిగా. ‘రజనీసార్‌కు జోడీగా చేస్తున్నార’ని చెప్పారు. ఆనందంతో ఆ రోజు తినడం కూడా మానేశా!

తెలుగులోనే మాట్లాడారు..
అసలు ఈ అవకాశానికి కారణం... బాలుమహేంద్రగారే! ఎందుకంటే రంజిత్‌ ‘కాలా’ సినిమా కోసం ఒకప్పుడు బాలుమహేంద్రగారి సినిమాల్లో హీరోయిన్‌గా చేసినవాళ్ల కోసమే వెతుకుతున్నారట. అప్పుడే వాళ్లకి నా ‘రామన్‌ అబ్దుల్లా’ ఫొటో కనిపించింది. అలా నన్ను ఎంపిక చేసుకున్నారు. రజినీకాంత్‌కి చూపిస్తే ‘ఈ అమ్మాయి సరిగ్గా నప్పుతుంది. ప్రయత్నించండి..’ అన్నారట. అసలు చిత్రీకరణకంటే ముందు రజినీకాంత్‌గారితో వీడియో షూట్‌లు చేశారు. అప్పుడే రజినీకాంత్‌గారిని తొలిసారి చూసింది! నేను స్టూడియోలోకి అడుగుపెడుతుండగానే ద్వారం దగ్గరే కూర్చుని ఉన్నారు. నన్ను చూడగానే పైకిలేచి ‘నమస్కారం..! నటించడానికి మంచి అవకాశం ఉన్న పాత్ర ఇది. పూర్తిగా సద్వినియోగం చేసుకోండి!’ అని తెలుగులోనే అన్నారు. ఎంత పెద్ద స్టారండీ ఆయన! అలాంటివారు నాతో అంత మర్యాదగా నేను తెలుగమ్మాయినని తెలుసుకునిమరీ నా మాతృభాషలో మాట్లాడటం చూసి విస్తుపోయాను. షూటింగ్‌ మొదలయ్యాక చాలా బెరుగ్గా అనిపించింది. రజినీకాంత్‌గారు జనం రద్దీ చూస్తే ఇబ్బంది పడతారు. కానీ ఈ సినిమాలో ప్రతి ఫ్రేములోనూ చుట్టూ వందలాది జనం మూగి ఉంటారు. వాళ్ల మధ్యే మేమిద్దరం నటించాలి! రజినీకాంత్‌ అప్‌సెట్‌కాకుండా.. షాట్‌లు వీలున్నంత తొందరగా ముగించాలని దర్శకుడు రంజిత్‌ ఎంతో ప్రయాసపడేవారు. అందుకే ఆయనతో చేసే ప్రతి సీనూ సింగిల్‌టేకులో పూర్తికావాలని నియమం పెట్టారు. అదే నాకు పెద్ద సవాలు!

‘నాకూ భయమే...’
సమస్యేమిటంటే.. నేను అంతకాలం చెన్నైలో ఉంటున్నా, తమిళం మాట్లాడగలిగినా, అందులో తెలుగు వాసనే ఎక్కువ. ‘కాలా’ సినిమాకి ఊరికే తమిళం మాట్లాడటం కాకుండా.. తిరునెల్వేలి యాస పలికించాలి. తమిళనాడులో పుట్టిపెరిగినవాళ్లే దాన్ని సహజంగా మాట్లాడటం కష్టం. అలాంటిది నాకెలా! ప్రతిరోజూ సెట్‌కి వెళ్లి పేజీలకి పేజీలు కంఠస్థం చేసేదాన్ని. మాటల్లో ఎక్కడా తెలుగుయాస రాకుండా జాగ్రత్తపడేదాన్ని. ఇంత సాధన చేసినా రజినీకాంత్‌గారు రాగానే భయపడిపోయేదాన్ని. ఆ విషయం చెబితే ‘నాకూ భయమేనమ్మా.. ఫర్వాలేదు రండి నటిద్దాం!’ అనేవారు. నవ్వించేవారు. తెలుగులోనే మాట్లాడేవారు. ఆ భరోసాతో ఆయనతో చేసిన ప్రతి సీనూ సింగిల్‌ టేక్‌లోనే ముగించాను. సినిమా పూర్తయ్యాక... రజినీకాంత్‌గారే ఫోన్‌ చేశారు. ‘సినిమాలో మీరు చాలాబాగా చేశారు. మంచి మార్కులు కొట్టేశారండి’ అంటూ అభినందనల్లో ముంచేశారు. ఏదో మర్యాదకి అభినందిస్తున్నారని అనుకున్నా... కానీ సినిమా విడుదలయ్యాక వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన రెండో రోజే జయసుధగారి నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. ‘ఈ మధ్యకాలంలో లేడీ ఆర్టిస్ట్‌కి చప్పట్లు వచ్చిన సినిమా ఇదే.. నిజంగా చాలా బాగా
నటించావు. నీకు ఇలాంటి అవకాశాలు మరిన్ని వస్తాయ’ని అన్నారు.

ఇంట్లో చెప్పనేలేదు..

మా ఆయన ఎల్‌.రాజా తమిళంలో చాలా సినిమాలకి దర్శకత్వం వహించారు. నన్నెక్కడో చూసి, నచ్చి, నా దగ్గరకొచ్చి పెళ్లి విషయం ప్రస్తావించారు. నాకూ నచ్చారాయన. ఇంట్లోవాళ్లని ఒప్పించే పెళ్లిచేసుకున్నాం. మాకిద్దరు పిల్లలు. పాప నివేదిత ఆరోతరగతీ, బాబు రిషభ్‌ రాజ్‌ నాలుగో తరగతీ చదువుతున్నారు. అన్నట్టు నేను ‘కాలా’ సినిమాలో రజినీకాంత్‌కి జోడీగా నటిస్తున్న విషయం మొదట్లో ఎవ్వరికీ చెప్పలేదు. రంజిత్‌ ఫోన్‌ చేయడం, తొలి, మలి ఫోటోషూట్‌లు ఈ విషయాలేవీ ఎవరితోనూ పంచుకోలేదు. అందరితోనూ చెప్పి తీరా నేను హీరోయిన్‌ కాకపోతే వాళ్లూ, నేనూ నిరాశలో కూరుకుపోతామన్నది నా భయం! ‘కాలా’ షూటింగ్‌కి వెళ్లడం మొదలుపెట్టిన రెండుమూడురోజుల తర్వాతే ‘హమ్మయ్య! ఇక చెప్పొచ్చు’ అనే నమ్మకం కుదిరింది. ఓ రోజు షూటింగ్‌కి వెళ్లి పిల్లలకి ఫోన్‌ చేసి విషయం చెప్పాను. ఆ రోజు ఇంటికొచ్చాక ఎంత సెలబ్రేట్‌ చేసుకున్నామో!

- తలారి ఉదయ్‌కుమార్‌, న్యూస్‌టుడే, చెన్నై

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు