నీటిశుద్ధికి హైడ్రోజెల్‌ మాత్ర
close

Published : 13/10/2021 01:02 IST

నీటిశుద్ధికి హైడ్రోజెల్‌ మాత్ర

ఇది హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ను ఉత్పత్తి చేయటం ద్వారా కర్బన రేణువులను ప్రేరేపితం చేస్తూ.. బ్యాక్టీరియాలోని కీలక కణ భాగాలపై దాడిచేస్తుంది. ఇలా బ్యాక్టీరియా జీవక్రియలను అస్తవ్యస్తం చేసి, చివరికి నిర్వీర్యం చేసేస్తుంది.

నీరు ప్రాణాధారం. అది పరిశుభ్రంగా ఉండటం ఇంకా ముఖ్యం. కానీ ప్రపంచంలో మూడింట ఒకవంతు మందికి స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండటం లేదు. వచ్చే నాలుగేళ్లలో సుమారు సగం మంది నీటి కొరత గల ప్రాంతాల్లోనే జీవించే అవకాశముందని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. దీనికి పరిష్కారం కనుగొంటే లక్షలాది మందిని కాపాడుకోవచ్చు. జీవితాలూ మెరుగవుతాయి. అందుకే స్వచ్ఛమైన నీరు కోసం ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆస్టిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాక్‌ శాస్త్రవేత్తలు రూపొందించిన హైడ్రోజెల్‌ మాత్ర కొత్త ఆశలు చిగురింప జేసింది. ఇది కలుషిత నీటిని వేగంగా శుద్ధి చేయగలదు మరి. ఒక మాత్రతో ఒక లీటరు నది నీటిని క్రిమి రహితం చేయొచ్చు. తాగటానికి అనువైనదిగా మారుతుంది. అదీ గంట కన్నా తక్కువ వ్యవధిలోనే. ప్రస్తుతం నీటిని శుభ్రపరచటానికి ఉపయోగిస్తున్న ప్రధానమైన విధానం కాచి చల్లార్చటం. కానీ దీనికి ఇంధనం అవసరం. సమయమూ ఎక్కువ పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో నీటిని కాచి చల్లార్చటానికి తగిన వసతులు కూడా ఉండవు. హైడ్రోజెల్‌ మాత్రతో ఇలాంటి ఇబ్బందులను అధిగమించొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇది హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ను ఉత్పత్తి చేయటం ద్వారా దాదాపు నూటికి నూరు శాతం కచ్చితత్వంతో బ్యాక్టీరియాను నిర్వీర్యం చేస్తుంది. కర్బన రేణువులను ప్రేరేపితం చేస్తూ.. బ్యాక్టీరియాలోని కీలక కణ భాగాలపై దాడిచేస్తుంది. ఇలా బ్యాక్టీరియా జీవక్రియలను అస్తవ్యస్తం చేసి, చివరికి నిర్వీర్యం చేసేస్తుంది. దీనికి ఎలాంటి ఇంధనమూ అవసరం లేదు. హానికారక అవశేషాలేవీ ఏర్పడవు. ఈ హైడ్రోజెల్‌ మాత్ర నీటి శుద్ధికే కాదు. సౌర వడపోత ప్రక్రియ సామర్థ్యాన్ని మెరుగు పరచుకోవటానికీ వాడుకోవచ్చు. సౌర వడపోత ప్రక్రియలో ఎండ సాయంతో నీటి ఆవిరిని సృష్టించి, హానికారక కాలుష్యాలను వేరుచేస్తుంటారు. అయితే ఈ ప్రక్రియలో రాన్రానూ పరికరాల మీద సూక్ష్మక్రిములు వృద్ధి చెందుతుంటాయి. దీంతో పరికరాల పనితీరు మందగిస్తుంది. హైడ్రోజెల్‌ మాత్రలతో దీన్ని నివారించుకోవచ్చు. సూర్యరశ్మితో నీటిని శుద్ధిచేయటంపై పనిచేస్తున్న క్రమంలోనే అనూహ్యంగా ఈ హైడ్రోజెల్స్‌ను గుర్తించటం విశేషం. వైరస్‌ల వంటి ఇతరత్రా సూక్ష్మక్రిములను నిర్మూలించే విధంగానూ వీటిని తయారుచేయాలని భావిస్తున్నారు. ఈ మాత్రల తయారీకి అవసరమైన పదార్థాలు చవకైనవి. తయారీ ప్రక్రియ సరళమైంది. మాత్రలను రకరకాల సైజుల్లోనూ రూపొందించొచ్చు. అందువల్ల వీటిని పెద్దఎత్తున తయారు చేయటంపై పరిశోధకులు దృష్టి సారించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న