Instagram New Features: ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి బ్రేక్ కావాలా నాయనా! 
close

Published : 12/10/2021 01:52 IST

Instagram New Features: ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి బ్రేక్ కావాలా నాయనా! 

ఇంటర్నెట్‌డెస్క్‌: సామాజిక మాధ్యమాలకు ఈతరం యువత బానిసలవుతున్నారనేది పెద్దల మాట. సోషల్ మీడియా కంటెంట్‌తో ఎంతో నేర్చుకుంటున్నామని మరోవైపు యువత అంటోంది. కత్తికి రెండువైపులా పదునే అన్నట్లుగా సామాజిక మాధ్యమాలతో మంచీచెడూ రెండు ఉన్నాయి. ఇటీవలి కాలంలో యువత వీటిని చెడుకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారనేది నిపుణులు చెబుతున్నమాట. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ప్రమాదకరమైన కంటెట్‌కి యువత ఆకర్షితులు కాకుండా ఉండేందుకు ఫోటో షేరింగ్ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ‘టేక్‌ ఏ బ్రేక్‌’ పేరుతో కొత్త ఫీచర్‌ని పరిచయం చేయనుంది. టేక్‌ ఏ బ్రేక్ ఫీచర్ సాయంతో యువత తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల నుంచి కొంత కాలంపాటు విరామం తీసుకుని.. తిరిగి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇదే సమయంలో వారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత సమయం గడుపుతున్నారు? ఎలాంటి అంశాలను ఎక్కువగా చూస్తున్నారు? అనేది విశ్లేషించుకొని తిరిగి అర్థవంతంగా ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించుకోగలరని భావిస్తున్నట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. 

‘‘యువత ఒకే రకమైన వీడియోలను పదే పదే చూస్తూ వాటికి బానిసలుగా మారుతున్నట్లు గుర్తించాం. అది వారికి ఎంత మాత్రం మంచిది కాదు. మేం వారిని ఇతర వీడియోలు కూడా చూసేలా చేయాలనుకుంటున్నాం. అందుకోసం కొత్త ఫీచర్‌ని పరిచయం చేయబోతున్నాం. అలానే యువత ఇన్‌స్టాగ్రాం నుంచి కొంత విరామం తీసుకునేందుకు వీలుగా ఈ కొత్త ఫీచర్‌ వారికి సాయపడుతుంది’’ అని ఫేస్‌బుక్‌ అంతర్జాతీయ వ్యవహారాల వైస్‌ ప్రెసిడెంట్ నిక్‌ క్లెగ్‌ తెలిపారు. ఇటీవల ఫేస్‌బుక్ మాజీ ఉద్యోగి ఒకరు ఫేస్‌బుక్‌కి చెందిన సామాజిక మాధ్యమాలు యువతను ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆరోపించిన నేపథ్యంలో ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతోపాటు ఇన్‌స్టాగ్రాం త్వరలో 13 సంవత్సరాల్లోపు పిల్లల కోసం ఇన్‌స్టాగ్రాం కిడ్స్‌ని కూడా పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. అయితే దీనిపై అంతర్జాతీయంగా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కొద్ది రోజులు వాయిదా వేసినట్లు సమాచారం.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న