నీ ఆశలన్నీ.. నా శ్వాసలోనే

మా ఇద్దరిదీ ఒకే కాలనీ. మాట కలిసింది మాత్రం కాలేజీలో. నాకు ఆ కాలేజీ ఏమాత్రం నచ్చేది కాదు. ‘లైట్‌ తీస్కోవే.. మనం చూడాల్సింది గోడలు, సౌకర్యాలు కాదు.. పుస్తకాల్ని. ...

Updated : 19 Oct 2022 15:32 IST

మా ఇద్దరిదీ ఒకే కాలనీ. మాట కలిసింది మాత్రం కాలేజీలో. నాకు ఆ కాలేజీ ఏమాత్రం నచ్చేది కాదు. ‘లైట్‌ తీస్కోవే.. మనం చూడాల్సింది గోడలు, సౌకర్యాలు కాదు.. పుస్తకాల్ని. బాగా చదివితే మనల్ని ఆపేదెవరు? అనేది తను. ఎప్పుడూ అంతే. ప్రతికూల పరిస్థితుల్లోనూ పాజిటివ్‌ కోణం వెతికేది.
ఇద్దరిదీ ఈసీఈనే అయినా సెక్షన్లు వేరు. కాలేజీ బస్సే మా మీటింగ్‌ పాయింట్‌. క్లాసులకి బంక్‌ కొట్టి సినిమాకెళ్లే బ్యాచులు.. ప్రేమలో విఫలమైనా జీవితాన్ని ప్రేమిస్తూ ముందుకెళ్లేవాళ్లు.. కష్టపడి చదివి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ జాబ్‌ కొట్టినవాళ్లు.. అన్ని విషయాలూ మాట్లాడుకునేవాళ్లం. టీనేజీ అంటే ఎంజాయ్‌ చేసే వయసు అనేదాన్ని నేను. తను.. పరిధికి మించి ఆలోచించేది. పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ చదువుకునేవాళ్లని చూపించేది. ఆప్తుల్ని కోల్పోయి కన్నీళ్లు దిగమింగుతూ పరీక్షలు రాసే విద్యార్థుల వెతలు వినిపించేది.  

 

 

 

బీటెక్‌ ఫైనలియర్‌కొచ్చాం. కెరీర్‌ ఎంచుకోవాల్సిన సందర్భం. నైన్‌ టూ ఫైవ్‌ జాబ్‌ అంటే నాకు బోర్‌. ‘చదివిన చదువులోనే రాణించాలని ఏముంది? నీ మనసుకి నచ్చింది శ్రద్ధ పెట్టి చెయ్‌. సక్సెస్‌ వెంటనే రాకపోయినా సంతృప్తి దక్కుతుంది. పేరూ దానంతటదే వస్తుంది’ అని ధైర్యం చెప్పింది. అమ్మానాన్నల్నీ ఒప్పించింది.
కాలేజీ ముగిసింది. అయినా మా స్నేహంలో గాఢత తగ్గలేదు. ఒకరోజు తనకు పెళ్లి కుదిరిందనే తీపి కబురు చెప్పింది. గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నాం. పెళ్లిలో హడావుడి అంతా నాదే. ఇకపై తన జీవితంలో కొత్త వెలుగులు వస్తాయని భావించా. కానీ జరిగింది వేరు.
మాటల యంత్రం మూగనోము పట్టేది. నాతో ఏదో దాచాలని ప్రయత్నించేది. భార్య పాత్రలోకి మారిపోయింది కదా.. పెద్దరికం చూపిస్తుందేమో అనుకున్నా. అయితే అది తెచ్చి పెట్టుకున్న పెద్దరికం కాదు.. గుండెల మాటున మోస్తున్న భారమని కొన్నాళ్లకే అర్థమైంది. ఉండబట్టలేక ఓరోజు అడిగేశా. ‘అదేం లేదే. కాపురం అన్నాక చిన్నచిన్న గొడవలుంటాయి కదా. పైగా ఒంట్లో నలతగా ఉంటోంది. నా గురించి నువ్వేం వర్రీ కావొద్దు’ అంది. కానీ తనేం బాగా లేదని తెలుస్తూనే ఉంది. రోజులు గడుస్తున్నా అదే తీరు. నా పాత ఫ్రెండ్‌ని ఎలా తిరిగి తీసుకురావాలో ఆలోచిస్తూనే ఉన్నా. కానీ.. ఆ అవసరం లేకుండా పోయింది. ఆరోజు నిద్ర లేస్తూనే నా ప్రాణసఖి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయిందనే పాడు వార్త విన్నా. ఇది అబద్ధం అయితే బాగుండు అని ఎంత ఏడ్చినా ఏం లాభం? పాడెపై నిశ్చలంగా ఉంది తను. నాకు కన్నీళ్లు ఆగడం లేదు. ‘నేను బాధలో ఉన్నప్పుడు నువ్వు ఓదార్పు అయ్యావ్‌. నాకు కన్నీళ్లొస్తే తుడిచే చేతులయ్యావ్‌. కానీ ఏవో కష్టాలున్నాయని నువ్విలా శాశ్వతంగా వెళ్లిపోవడం ఏం బాగా లేదే’ అని నిలదీయాలనిపించింది. కానీ.. అప్పటికే తను చితి మంటల్లో కాలిపోతోంది. మా సంతోషాల్నీ, మనశ్శాంతినీ కాల్చేస్తూ. మౌనం, చావు సమస్యకి పరిష్కారం కాదని తెలుసుకోలేకపోవడమే మాకు శాపం. తను లేదు. అయినా నాకు పరిచయం అవుతున్న ప్రతి ఒక్కరిలో తననే వెతుక్కుంటున్నా. తన ప్రేమని గుర్తు చేసుకుంటూనే ఉంటా.

- హారిక ఆద్యా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని