Updated : 27/10/2021 06:42 IST

Ap News: కాకినాడ ఎమ్మెల్యేకు ఎయిడెడ్‌ సెగ

ద్వారంపూడిని నిలదీసిన విద్యార్థుల తల్లిదండ్రులు

స్కూలు మూసేస్తే ఆందోళన తప్పదని హెచ్చరిక

కాకినాడ జగన్నాథపురం ప్రాంతంలోని సెయింట్‌ యాన్స్‌ ఎయిడెడ్‌ బాలికల ఉన్నత పాఠశాల

విలీనాన్ని నిరసిస్తూ నగర ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డిని చుట్టుముట్టిన తల్లిదండ్రులు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఎయిడెడ్‌ పాఠశాల మూసేయొద్దని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కాకినాడ నగర వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిని చుట్టుముట్టి నిరసన తెలిపారు. నగరంలోని జగన్నాథపురం ప్రాంతంలోని సెయింట్‌ ఆన్స్‌ ఎయిడెడ్‌ బాలికల ఉన్నత పాఠశాల విలీనాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. పాఠశాల ఉపాధ్యాయులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో ప్రైవేటు ఉపాధ్యాయులతో పాఠశాల నిర్వహించక తప్పదని.. అందుకు ఫీజు చెల్లించాల్సి వస్తుందని యాజమాన్యం చెప్పడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమైంది. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల అంగీకారం కోసం సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టడంతో తల్లిదండ్రులు మంగళవారం ఆ పాఠశాలకు భారీగా చేరుకున్నారు.

ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం

ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి పాఠశాలకు సమీపంలో వైద్యశిబిరం ప్రారంభానికి వస్తున్నారని తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని తమ పిల్లల భవిష్యత్తు ఏం కావాలని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఫీజు కట్టాలని పాఠశాల యాజమాన్యం చెబుతోందని.. కూలిపనులు చేసుకుని బతికే తాము అధిక ఫీజులు ఎలా చెల్లించగలమని వాపోయారు. ఇక్కడ చదువుతున్న రెండు వేల మంది పిల్లల భవిష్యత్తుకు హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే వాహనం చుట్టూ జనం చేరి కదలనివ్వలేదు. వారు ఎంతకూ శాంతించక పోవడంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తంచేశారు. సమస్యపై ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎలాంటి ఫీజులూ కట్టొద్దని, ముఖ్యమంత్రి దృష్టికి సమస్య తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచే డీఈవో అబ్రహంతో ఫోనులో మాట్లాడారు. యాజమాన్యంతో ప్రజాప్రతినిధులు మాట్లాడతారనీ, పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూస్తామని భరోసా ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. తర్వాత ఉప మేయర్లు, కార్పొరేటర్లు, విద్యాశాఖ అధికారులు తల్లిదండ్రులు, యాజమాన్యంతో కలిసి చŸర్చించారు. ఈనెల 28న కోర్టులో తీర్పు వస్తుందనీ, దానికి అనుగుణంగా నిర్ణయం ఉంటుందని, అప్పటి వరకూ ఆగాలని సూచించారు.

మా స్కూలు తీసుకోవద్దు...

‘మా స్కూలును, టీచర్లను తీసుకోవద్దు.. దండం పెడుతున్నాం  మీరిచ్చే రూ.15 వేలు తీసుకోండి’ అని పలువురు విద్యార్థులు ఆవేదన చెందారు.


మర్యాద నిలబెట్టుకోవాలి..

‘జగనన్నయ్య, మామయ్య అని ఇంత గౌరవంగా పిల్లలతో పిలిపించుకుంటున్నారంటే ఆ మర్యాద నిలబెట్టుకోవాలి. రూ.వేలలో ఫీజులంటే తల్లిదండ్రులు ఎలా కడతారు. మేం భోజనాలు పెట్టమని అడగట్లేదు. ఈ స్కూల్లోనే చదివిస్తాం. ఫీజులు కట్టం. మాకు అమ్మఒడి వద్దు. మా పిల్లలకు ఇచ్చిన డబ్బు సిస్టర్లకు, టీచర్లకు ఫీజుల కింద ఇచ్చేయమనండి’

  - మల్లాడి ఆదిలక్ష్మి, విద్యార్థిని తల్లి


ముఖ్యమంత్రే చూసుకోవాలి

నేను ఇదే స్కూల్లో చదివా. మా పాపను ఇక్కడే చదివిస్తున్నా. ఈ స్కూల్లో ఉన్న భద్రత మా పిల్లలకు ఇంకెక్కడా దొరకదు. ఇదే స్కూలును ప్రభుత్వ పాఠశాలగా ప్రకటించి అన్నీ అందించాలి. జగన్‌ని అన్న అని అనుకుంటున్నామంటే మా పిల్లలను ఆయనే చూసుకోవాలి. మా పిల్లలను మంచిగా చదివించుకోవాలంటే ముఖ్యమంత్రి మాకు ఈ సహాయం చేయాలి.

- పల్లవి, విద్యార్థిని తల్లి


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని