Updated : 18/11/2021 05:21 IST

Call center: పాఠశాలల్లో సమస్యలపై  ప్రత్యేక కాల్‌సెంటర్‌

అందరికీ కనిపించేలా బడుల్లో ఫోన్‌ నంబరు ప్రదర్శన

రోజూ విద్యార్థులకు 3 ఆంగ్ల పదాలు నేర్పించాలి

సీఎం జగన్‌ ఆదేశం

ఈనాడు, అమరావతి: పాఠశాలల్లోని సదుపాయాలపై సమస్యలు చెప్పేందుకు కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఫోన్‌ నంబరును ప్రతి బడిలో అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. ఈ కాల్‌సెంటర్‌ను పర్యవేక్షించే వారి సమాచారంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం విద్యా రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, నూతన విద్యా విధానం అమలుపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ..‘‘ ఆంగ్ల భాష, వ్యాకరణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పిల్లలకు ఇది వరకే ఇచ్చిన నిఘంటువులను వినియోగించుకోవాలి. రోజూ కనీసం మూడు ఆంగ్ల పదాలను విద్యార్థులకు నేర్పించాలి. ఆ పదాలు వినియోగించడాన్నీ నేర్పాలి. ఇంటర్నెట్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా వివిధ అంశాలు నేర్చుకోవడం, వాటిని ఇతరులకు నేర్పించడం లాంటి భావనను పిల్లల్లో అభివృద్ధి చేయాలి’’ అని సూచించారు.

ఎయిడెడ్‌ స్వచ్ఛందమే

ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తిగా స్వచ్ఛందం. వివిధ కారణాలతో నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ప్రభుత్వం ఒక అవకాశం మాత్రమే కల్పించింది. ఇష్టం ఉన్న వారు స్వచ్ఛందంగా ప్రభుత్వంలో విలీనం చేయొచ్చు. లేదంటే యథాప్రకారం నిర్వహించుకోవచ్చు. విలీనం చేస్తే వారి పేర్లు కొనసాగిస్తాం. ప్రభుత్వంలో విలీనానికి.. ముందు అంగీకరించిన వారు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నిర్వహించుకుంటామంటే నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చు. విద్యార్థులకు మంచి సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ఈ ప్రక్రియలో ఎక్కడా బలవంతం లేదు.ఈ విషయంలో అపోహలకు గురికావొద్దు. రాజకీయాలు తగవు’’అని ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. 

అధికారులు ఏమన్నారంటే..

మూడేళ్లల్లో మూడు దశలుగా నూతన విద్యావిధానం అమలు పూర్తి చేయనున్నట్లు అధికారులు సీఎంకు వెల్లడించారు. దీంట్లో భాగంగా 25,396 ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నామని తెలిపారు. తొలిదశలో భాగంగా ఈ విద్యా సంవత్సరం 2,663 బడులను విలీనం చేశామని చెప్పారు. నూతన విధానంలో 2,05,071మంది విద్యార్థులు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనమయ్యారని, మొత్తంగా ఈ ప్రక్రియలో 9.5లక్షల మంది విద్యార్థులకు ఈ ఏడాది నూతన విద్యా విధానం అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. ఈ ఏడాది 1,092 పాఠశాలలకు సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు వచ్చిందని, ఈ విద్యార్థులు 2024-25నాటికి సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు రాస్తారని తెలిపారు. అంతర్జాతీయంగా 24వేల పాఠశాలలకే సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు ఉండగా.. రాష్ట్రంలో ఒక్క ఏడాదికే 1,092 బడులకు సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు ఇవ్వడం రికార్డని తెలిపారు. ఈ సమీక్షలో మంత్రి ఆదిమూలపు సురేష్‌, ముఖ్య కార్యదర్శులు బుడితి రాజశేఖర్‌, ఏఆర్‌ అనురాధ పాల్గొన్నారు.


ఉపాధ్యాయులకు నాణ్యమైన శిక్షణ ఇవ్వాలి

‘‘రానున్న విద్యా సంవత్సరంలో నూతన విద్యా విధానం అమలు చేసేందుకు అదనపు తరగతి గదుల నిర్మాణంపై దృష్టిపెట్టాలి. దీనికి సంబంధించి వెంటనే పనులు ప్రారంభించాలి. ప్రక్రియ పూర్తయ్యేనాటికి అవసరమైన ఉపాధ్యాయుల సంఖ్యను గుర్తించాలి. ఉపాధ్యాయులకు నాణ్యమైన శిక్షణ అందించాలి. ఇంట్లోని మరుగుదొడ్డి పరిశుభ్రంగా ఉండాలని ఎలా అనుకుంటామో పాఠశాలల్లోని మరుగుదొడ్లు కూడా అలాగే ఉండాలి. పాఠశాలల్లో మరుగుదొడ్ల స్థితిగతులపై తనిఖీలు చేయాలి. పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు కుటుంబ పెద్దలాంటి వారు. నాణ్యమైన బోధన, భోజనం, ఇతర సదుపాయాలపై తనిఖీలు చేసి, అవి సవ్యంగా ఉండేలా చూడాలి. మధ్యాహ్న భోజనంపై పిల్లలు, తల్లుల నుంచి అధికారులు అభిప్రాయాలు తీసుకోవాలి. కలెక్టర్లు, జేసీలు, అధికారులు మధ్యాహ్న భోజనం అమలు పర్యవేక్షించాలి. స్వయంగా వారు భోజనం చేసి నాణ్యత పరిశీలించాలి’’ అని సీఎం సూచించారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని