Manish Malhotra: మనీష్‌ మల్హోత్రా ఎంఎం స్టైల్స్‌లో రిలయన్స్ పెట్టుబడులు!

ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రాకు చెందిన ఎంఎం స్టైల్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 40 శాతం వాటాల్ని కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ బ్రాండ్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌బీఎల్‌) అంగీకరించింది....

Published : 16 Oct 2021 20:53 IST

దిల్లీ: ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రాకు చెందిన ఎంఎం స్టైల్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 40 శాతం వాటాల్ని కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ బ్రాండ్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌బీఎల్‌) అంగీకరించింది. దీంతో ఇప్పటి వరకు పాశ్చాత్య వస్త్ర బ్రాండ్‌లను విక్రయిస్తూ వచ్చిన ఆర్‌బీఎల్‌ ఇకపై విలాసవంతమైన సంప్రదాయ దుస్తులనూ వినియోగదారులకు చేరువ చేయనుంది. అలాగే, వినూత్న, వైవిధ్యభరితమైన మల్హోత్రా మార్క్‌ సంప్రదాయ వస్త్రాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తామని ఆర్‌బీఎల్‌ తెలిపింది. అలాగే వివాహాలు, వేడుకలకు సంబంధించిన వస్త్రాలకు పెట్టింది పేరుగా ఉన్న ఈ బ్రాండ్‌ను ఇతర కేటగిరీల్లోకి విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఎంఎం స్టైల్స్‌ బ్రాండ్‌కు మల్హోత్రానే ఎండీ, క్రియేటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. 

అనేక బ్లాక్‌బస్టర్ బాలీవుడ్‌ సినిమాలకు మల్హోత్రా కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేశారు. మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఆయన బాలీవుడ్‌లో దిగ్గజ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ఎదిగారు. ఈ క్రమంలోనే ఎంఎం స్టైల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలోకి వస్తున్న తొలి బయటి పెట్టుబడి ఇదే కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా మొత్తం నాలుగు స్టోర్లు.. రెండు షాప్‌-ఇన్‌-షాప్‌లు ఉన్నాయి. మరోవైపు ఈ రంగంలో 14 ఏళ్ల అనుభవం ఉన్న రిలయన్స్‌ బ్రాండ్స్‌ ఇప్పటి వరకు అంతర్జాతీయ బ్రాండ్లనే విక్రయిస్తూ వచ్చింది. తొలిసారి భారతీయ సంప్రదాయ వస్త్రాలను వినియోగదారులకు చేరువ చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని