గరిష్ఠ స్థాయుల్లో నిరోధం!

సానుకూల త్రైమాసిక ఫలితాల మద్దతుతో వరుసగా మూడో వారం మార్కెట్లు లాభపడ్డాయి. ఒమిక్రాన్‌ కేసులు భారీగా పెరుగుతున్నా, దేశీయ ఆర్థిక గణాంకాలు నిరాశపరిచినా మదుపర్లు పట్టించుకోలేదు. గత డిసెంబరులో

Published : 17 Jan 2022 01:52 IST

సమీక్ష: సానుకూల త్రైమాసిక ఫలితాల మద్దతుతో వరుసగా మూడో వారం మార్కెట్లు లాభపడ్డాయి. ఒమిక్రాన్‌ కేసులు భారీగా పెరుగుతున్నా, దేశీయ ఆర్థిక గణాంకాలు నిరాశపరిచినా మదుపర్లు పట్టించుకోలేదు. గత డిసెంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.59 శాతానికి పెరగ్గా.. టోకు ద్రవ్యోల్బణం 13.56 శాతానికి తగ్గింది. నవంబరు పారిశ్రామికోత్పత్తి 1.4 శాతానికి నెమ్మదించింది. షేరు/రంగం ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించాయి. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తతలతో ముడిచమురు సరఫరా భయాలు పెరిగాయి. దీంతో బ్యారెల్‌ ముడిచమురు ధర 5.6 శాతం పెరిగి 86.3 డాలర్లకు చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి పెద్దగా మార్పులు లేకుండా 74.15 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా చూస్తే.. ద్రవ్యోల్బణం స్థిరపడితే వడ్డీ రేట్ల పెంపునకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌ స్పష్టం చేశారు. అమెరికా వినియోగదారు ద్రవ్యోల్బణం నాలుగు దశాబ్దాల గరిష్ఠమైన 7 శాతానికి చేరింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లను కలవరపెట్టాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 2.5 శాతం లాభంతో 61,223 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 2.5 శాతం పెరిగి 18,255 పాయింట్ల దగ్గర స్థిరపడింది. విద్యుత్‌, యంత్ర పరికరాలు, స్థిరాస్తి షేర్లు రాణించాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ, ఆరోగ్య సంరక్షణ, మన్నికైన వినిమయ వస్తువుల స్క్రిప్‌లు డీలాపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.4003 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.3,629 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. జనవరిలో ఇప్పటివరకు విదేశీ పోర్టుఫోలియో మదుపర్లు నికరంగా రూ.3117 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 3:2గా నమోదు కావడం..

మార్కెట్‌లో కొనుగోళ్లను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: వరుసగా మూడో వారం రాణించిన సెన్సెక్స్‌.. ప్రస్తుతం జీవనకాల గరిష్ఠమైన 62,245 పాయింట్ల దరిదాపుల్లో ట్రేడవుతోంది. అయితే గరిష్ఠ స్థాయుల్లో సూచీకి నిరోధం ఎదురుకావొచ్చు. 60300- 60700 పాయింట్ల శ్రేణిలో సెన్సెక్స్‌కు తక్షణ మద్దతు లభించే అవకాశం ఉంది. ఈ స్థాయిని కోల్పోతే స్వల్ప నుంచి సమీపకాలంలో మార్కెట్ల స్థిరీకరణ లేదా దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది.

ప్రభావిత అంశాలు: కంపెనీల త్రైమాసిక ఫలితాల నుంచి దేశీయ సూచీలు సంకేతాలు తీసుకోవచ్చు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు, అంతర్జాతీయ, దేశీయ ద్రవ్యోల్బణ ధోరణుల నేపథ్యంలో కొంత ఒడుదొడుకులకు అవకాశం లేకపోలేదు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సమావేశాల్లో ప్రధాన మంత్రి మోదీ నేడు చేసే ప్రసంగంపై మదుపర్లు దృష్టిపెట్టొచ్చు. ఈ వారం అల్ట్రాటెక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఆటో, టాటా కమ్యూనికేషన్స్‌, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బయోకాన్‌, హావెల్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, పీవీఆర్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ త్రైమాసిక ఫలితాలు వెలువరించనున్నాయి. పారిశ్రామికోత్పత్తి నెమ్మదించడం, అధిక రిటైల్‌ ద్రవ్యోల్బణం, ముడిచమురు ధరలు దూసుకెళ్లడంతో అధిక స్థాయుల్లో లాభాల స్వీకరణకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే.. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌, చైనా, ఇండోనేషియా, టర్కీ ద్రవ్య పరపతి సమావేశాలు జరగనున్నాయి. డిసెంబరు త్రైమాసికానికి చైనా జీడీపీ, యూరో ఏరియా ఎకనామిక్‌ సెంటిమెంట్‌ గణాంకాలు ప్రకటించనున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐల పెట్టుబడులు, ముడిచమురు ధరలు నుంచి కూడా మన మార్కెట్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. నెలవారీ చమురు విపణి నివేదికను ఒపెక్‌ విడుదల చేయనుంది. ముడిచమురు ధరలు మరింత పెరిగితే మార్కెట్‌ జోరుకు అడ్డుకట్ట పడొచ్చు.

తక్షణ మద్దతు స్థాయులు: 60,689, 59,987, 59,000
తక్షణ నిరోధ స్థాయులు: 61,622, 62,245, 63,400
మార్కెట్‌కు గరిష్ఠ స్థాయుల్లో నిరోధం ఎదురుకావొచ్చు.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని