GST: 28% శాతం మున్ముందూ తప్పదు.. జీఎస్‌టీ పరిధిలోకి ‘చమురు’.. వేచి చూడాల్సిందే!

GST Rate: జీఎస్‌టీలో అత్యధిక స్లాబ్‌ రేటు అయిన 28 శాతం మున్ముందూ కొనసాగుతుందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ అన్నారు.

Updated : 04 Jul 2022 18:32 IST

రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ వ్యాఖ్యలు

దిల్లీ: జీఎస్‌టీలో అత్యధిక స్లాబ్‌ రేటు అయిన 28 శాతం మున్ముందూ కొనసాగుతుందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ అన్నారు. విలాస వస్తువులు, హానికర వస్తువులపై విధిస్తున్న ఈ పన్ను కొనసాగించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతోందని చెప్పారు. మిగిలిన మూడు స్లాబులను (5, 12, 18) కుదించాలన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయన్నారు. అదే సమయంలో చమురు ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి రావాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదన్నారు. ఈ మేరకు పరిశ్రమ వర్గాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

జీఎస్‌టీ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రేట్ల హేతుబద్ధీకరణకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోందని తరుణ్‌ బజాజ్‌ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్రాలు వెనకడుగు వేస్తున్నాయని చెప్పారు. వీటి ద్వారానే వాటికి ఆదాయం ఎక్కువ వస్తోందని కాబట్టి జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు సుముఖంగా లేవన్నారు. అలా జరగాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందేనని చెప్పారు. 28 శాతం రేటు మున్ముందూ కొనసాగిస్తామని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఆదాయ అంతరం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీన్ని కొనసాగించక తప్పదన్నారు. మిగిలిన మూడు స్లాబులను మాత్రం రెండుకు తగ్గించొచ్చని, దాన్ని ఒకటికి తగ్గించడం సాధ్యమవుతుందా లేదా చూడాలన్నారు. అయితే ఇది కష్టంతో కూడుకున్న వ్యవహారం అన్నారు.

జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన కొత్తలో సగటు ట్యాక్స్‌ రేటు 14.4 శాతం ఉండగా.. అది ఇప్పుడు 11.6 శాతం ఉందని ఆర్‌బీఐ నివేదిక ఒకటి వెల్లడించింది. సగటు రేటు 15.5 శాతం ఉండాలని సుబ్రమణియన్‌ కమిటీ జీఎస్‌టీ అమలుకు ముందే నివేదించింది. అయితే, ప్రస్తుతం 11.6 శాతంగా ఉన్న సగటు రేటు బహుశా 11.8 శాతానికో, 11.9 శాతానికో పెరుగుతుందే తప్ప 15 శాతానికి ఎప్పుడు చేరుతుందని ప్రశ్నించారు. శాసనకర్తలెవరూ దాని గురించి ఆలోచన చేయడం లేదన్నారు. సగటు రేటు 15 శాతానికి చేరాలంటే కొన్ని వస్తువులపై పన్ను రేటును పెంచాల్సిన అవసరం ఉందని తరుణ్‌ బజాజ్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని