Insurance: ఈ ఇన్సూరెన్స్‌లన్నీ ఉంటే.. మీరు సేఫ్‌గా ఉన్నట్లే!

ఏమైనా జ‌రిగితే ఆర్ధిక ప‌రిస్థితులు త‌ల‌క్రిందుల‌వుతాయ‌ని భ‌యంతో బీమాను క‌లిగి ఉండ‌టాన్ని అత్యంత అవ‌స‌రంగా భావిస్తున్నారు.

Published : 17 Jan 2022 17:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్య‌క్తిగ‌తంగా బీమా పాల‌సీని క‌లిగి ఉండ‌టం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరమనే చెప్పాలి! బీమా అనేది ఆరోగ్యం, జీవితానికి మాత్ర‌మే ప‌రిమితం కాదు. ఏదైనా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో స‌రైన ర‌క్ష‌ణ పొందాలంటే, వారి అవ‌స‌రాల‌ను బ‌ట్టి లైఫ్‌, హెల్త్ ప్లాన్‌ల‌తో పాటు మ‌రికొన్ని బీమా పాల‌సీల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితులు వ‌చ్చినా క‌వ‌ర్ చేయ‌డానికి, వారి అవ‌స‌రాల‌ను బట్టి జీవిత‌, ఆరోగ్య ప్లాన్‌ల‌తో పాటు మ‌రికొన్ని బీమా పాల‌సీల‌ను ఎంచుకోవాలి. కొన్ని పాల‌సీలు చాలా చౌక‌గా వ‌స్తుంటాయి. మోటార్ వాహ‌నం క‌లిగి ఉంటే దీనికి బీమాను తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. క్రెడిట్ కార్డులు ఆప‌రేట్ చేసేవారు కూడా వ్య‌క్తిగ‌త సైబ‌ర్ ఇన్సూరెన్స్ క‌వ‌ర్‌ను తీసుకోవాలి. చాలా మంది, ముఖ్యంగా ఈ కొవిడ్ ప‌రిస్థితుల త‌ర్వాత ఏమైనా జ‌రిగితే ఆర్థిక ప‌రిస్థితులు త‌ల‌కిందుల‌వుతాయ‌ని భ‌యంతో బీమాను క‌లిగి ఉండ‌టాన్ని అత్యంత అవ‌స‌రంగా భావిస్తున్నారు. అయితే, మీ పోర్ట్‌ఫోలియోలో త‌ప్ప‌నిస‌రిగా 6 కీల‌క బీమా పాల‌సీలు ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం..!


 ట‌ర్మ్ ఇన్సూరెన్స్

సంపాదించే వ్య‌క్తిపై ఆధార‌ప‌డే వారు ఉన్నంత‌కాలం ఈ పాల‌సీ త‌ప్ప‌నిస‌రి. వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు హామీ ఉండేలా టర్మ్‌ బీమా తీసుకోవాలి. 60 ఏళ్ళు వచ్చే వరకు పాలసీ గడువు ఉండాలి. పాలసీలో వివరాలన్నీ పొందుపర్చాలి. దీంతో భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ ఇబ్బందులూ తలెత్తవు. టర్మ్ పాలసీలో తక్కువ ప్రీమియంతో అధిక బీమా హామీ పొందే సౌలభ్యం ఉంటుంది. బీమా హామీతో పాటు పెట్టుబడి కలిపి ఉండే ఎండోమెంట్, మనీ బ్యాక్, చైల్డ్ ప్లాన్స్‌, హోల్ లైఫ్, యూలిప్స్ వంటి పాలసీల నుంచి దూరంగా ఉండడం మంచిది.


ఆరోగ్య బీమా

ఇంట్లో ప్ర‌తి ఒక్క‌రికీ క‌నీస మొత్తంతో ఓ ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. కుటుంబం మొత్తానికి ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీ కూడా ఉంటే ఇంకా మేలు. ఈ పాల‌సీల‌కు టాప్-అప్ క‌వ‌ర్‌ని క‌లిపితే, పెరుగుతున్న వైద్య ఖ‌ర్చుల‌ను త‌ట్టుకోవ‌చ్చు. బేస్ పాలసీ కనీసం రూ.5-10 లక్షలకు తీసుకుని రూ.2-3 లక్షలకు టాప్-అప్ లేదా సూపర్ టాప్-అప్ తీసుకోవడం ఉత్తమం.


వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా

‘ప్ర‌ధాన మంత్రి సురక్షా బీమా’ను ఎప్పుడూ మ‌రచిపోవ‌ద్దు. పాల‌సీదారుడు ప్రమాదవశాత్తూ మ‌ర‌ణిస్తే కుటుంబానికి ఆర్ధిక భరోసాను కల్పిస్తుంది. చాలా త‌క్కువ ఖ‌ర్చుతోనే ఈ పాల‌సీ ల‌భిస్తుంది. ప్ర‌ధాన‌మంత్రి సురక్షా బీమా యోజ‌న రూ.2 ల‌క్ష‌ల ప్ర‌మాద ఇన్సూరెన్స్ పాల‌సీ అంద‌జేస్తోంది. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతా ఉన్న వారంద‌రూ ఈ పాల‌సీని తీసుకోవ‌చ్చు. దీని సంవ‌త్స‌ర చందా కేవ‌లం రూ.12 మాత్ర‌మే. దీనికి బ్యాంకులకు స్వ‌యంగా వెళ్లి క‌ట్ట‌న‌క్క‌ర లేదు. ఈ చందా కూడా సేవింగ్స్ ఖాతా నుండే బ్యాంకులు క‌ట్ చేసుకుంటాయి. వ్య‌క్తులు వారి జీవ‌న శైలిని బ‌ట్టి వ్య‌క్తిగ‌త ప్ర‌మాద పాల‌సీని క‌లిగి ఉండ‌టం చాలా మంచిది.

కొన్ని బ్యాంకుల‌లో సేవింగ్స్ ఖాతా తెరిచిన వెంట‌నే అందులో ఉన్న బ్యాల‌న్స్‌తోనే ఇన్సూరెన్స్ క‌వ‌ర్‌ని బ్యాంకులు ఆఫ‌ర్ చేస్తున్నాయి. అటువంటి బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతా తెర‌వ‌డం మంచిది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారుల‌కు రూ.500 ఖ‌ర్చుతో రూ.10 ల‌క్ష‌ల ప‌ర్స‌న‌ల్ గ్రూప్ ప్ర‌మాద బీమా క‌వ‌ర్‌ని అంద‌జేస్తోంది.


గృహ బీమా

అగ్ని ప్రమాదం, దొంగతనం సహా ఇతర విపత్తుల నుంచి ర‌క్ష‌ణ కోసం ఇంటికి, లోప‌ల సామగ్రికి కూడా బీమా క‌వ‌ర్ ఉంటుంది. కొత్త ప్రామాణిక గృహ ర‌క్షా పాల‌సీల్లో కొన్ని మంచి స‌ర‌ళీకృత ఫీచ‌ర్లు ఉన్నాయ‌ని నిపుణులు సూచిస్తున్నారు.


సైబ‌ర్ ఇన్సూరెన్స్

డిజిటల్‌ పేమెంట్స్‌కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్‌ ఇన్సూరెన్స్‌ ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ మోసాల నుంచి రక్షణ కోసం కనీస హామీతో వ్య‌క్తిగ‌త సైబ‌ర్ ఇన్సూరెన్స్ క‌వ‌ర్‌ను ఎంచుకోండి.


మోటార్ ఇన్సూరెన్స్

2 వీల‌ర్ లేదా 4 వీల‌ర్ ఉందంటే.. త‌ప్ప‌నిస‌రిగా థ‌ర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌తో పాటు, స‌రిగ్గా క‌వ‌ర్ చేయ‌డానికి స‌మ‌గ్ర‌మైన మోటార్ ఇన్సూరెన్స్ క‌వ‌ర్‌ను పొందాల‌ని నిపుణులు అంటున్నారు. అలాగే ప్ర‌తి సంవ‌త్స‌రం త‌ప్ప‌నిస‌రిగా థ‌ర్ట్‌-పార్టీ బీమాను తప్పనిసరిగా పునరుద్ధరించేలా చూసుకోండి. కొత్త నియమాల ప్రకారం షోరూంలో కొన్న కొత్త వాహనాలకు 3 ఏళ్ళ థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి. ఆ తరవాత కూడా సమగ్ర బీమా తీసుకోవడం వల్ల మీ వాహనానికి రక్షణ ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని