Stock Market: హమ్మయ్య.. ఎట్టకేలకు లాభాలు!

సోమవారం భారీ నష్టాలతో మదుపర్లను బెంబేలెత్తించిన మార్కెట్లు ఈరోజు కాస్త చల్లబడ్డాయి. రెండు ప్రధాన సూచీలు చివరకు లాభాల్లో స్థిరపడ్డాయి.....

Updated : 25 Jan 2022 16:02 IST

ముంబయి: సోమవారం భారీ నష్టాలతో మదుపర్లను బెంబేలెత్తించిన మార్కెట్లు ఈరోజు కాస్త చల్లబడ్డాయి. ఉదయం నుంచి ఊగిసలాట మధ్య చలించిన సూచీలకు ఎట్టకేలకు చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు దొరికింది. దీంతో రెండు ప్రధాన సూచీలు చివరకు లాభాల్లో స్థిరపడ్డాయి.

సూచీల పయనం సాగిందిలా..

ఉదయం సెన్సెక్స్‌ 57,158.63 పాయింట్ల వద్ద భారీ నష్టాలతో ప్రారంభమైంది. కాసేపటికే 1000 పాయింట్లకు పైగా పడి ఇంట్రాడే కనిష్ఠాన్ని చవిచూసింది. అక్కడి నుంచి దాదాపు చివరి గంట వరకు మద్దతు, నిరోధాల మధ్య కొట్టుమిట్టాడింది. చివరకు 366.64 పాయింట్లు లాభపడి 57,858.15 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 57,966.93 - 56,409.63 మధ్య కదలాడింది. నిఫ్టీ 17,001.55 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. రోజులో 17,298.85 - 16,836.80 మధ్య కదలాడింది. చివరకు 128.85 పాయింట్ల లాభంతో 17,277.95 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.76 వద్ద నిలిచింది.

కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు...

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు, ద్రవ్యోల్బణ భయాలు, రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు మధ్య భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలకు దేశీయంగానూ ఎలాంటి మద్దతు లభించలేదు. అమెరికా మార్కెట్లు సోమవారం భారీ ఊగిసలాటలో చలించడంతో ఆసియా మార్కెట్లు నేడు ప్రతికూలంగా ట్రేడయ్యాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న దేశీయ సూచీలు అదే బాటలో పయనించాయి. అయితే, కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో నిన్నటి తరహాలో భారీ పతనాన్ని మాత్రం చవిచూడలేదు. సూచీలు పడిన ప్రతిసారీ కొనుగోళ్లు మద్దతు దొరకడంతో నష్టాలు కొంత మేర కట్టడి అయ్యాయి. పైగా ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్ వంటి దిగ్గజ షేర్లకు కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు వెల్లువెత్తడం సూచీలను లాభాల్లోకి లాగింది. బీఎస్‌ఈ బ్యాంకింగ్‌ సూచీ ఈరోజు రాణించింది. ఈ పరిణామాలే సూచీలకు చివర్లో కలిసొచ్చాయి.

మరిన్ని విశేషాలు...

* లక్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు ఈరోజు 20 శాతం పడి లోయర్‌ సర్క్యూట్‌ని తాకాయి. కంపెనీలో అంతర్గత లొసుగులను పేర్కొంటూ లక్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన 14 సంస్థల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సెబీ నిషేధం విధించింది.

* మారుతీ సుజుకీ షేర్లు ఈరోజు 4 శాతం మేర లాభపడ్డాయి. మూడో త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన నికర లాభాలు భారీగా పడ్డప్పటికీ.. వాహన రంగం ఎదుర్కొంటున్న ఒడుదొడుకుల్లో కంపెనీ ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండడంతో కంపెనీ షేరు లాభపడింది. 

* రిలయన్స్‌ షేర్లు ఈరోజు ఓ దశలో 3 శాతం వరకు పడ్డాయి. దీంతో గత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో ఈ షేరు 7 శాతానికి పైగా పడినట్లైంది. చివరకు 0.33 శాతం నష్టంతో రూ.2,370 వద్ద ముగిసింది. 

* యాక్సిస్‌ బ్యాంకు షేర్లు ఈరోజు 6 శాతానికి పైగా లాభపడ్డాయి. అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించడమే అందుకు కారణం. బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం సుమారు 3 రెట్లు పెరిగి రూ.3,973 కోట్లకు చేరింది.

* జీవనకాల గరిష్ఠం నుంచి ఇటీవల దాదాపు 20 శాతానికి పైగా పడిన జొమాటో షేర్లు నేటి ట్రేడింగ్‌ సెషన్‌లో 9.96 శాతం పుంజుకున్నాయి. చివరకు ఈ కంపెనీ షేరు ధర రూ.100.50 వద్ద ముగిసింది.

* బిట్‌కాయిన్‌ విలువ గత 24 గంటల్లో 7 శాతం పుంజుకుంది. మంగళవారం మధ్యాహ్నం 3:42 గంటల సమయంలో దీని విలువ 36,564.67 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని