Stock Market: 5 నిమిషాల్లో రూ.4లక్షల కోట్లు ఫట్‌.. మార్కెట్లలో ‘ఫెడ్‌’ రెడ్‌..!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ మార్చి నెలలో వడ్డీ రేట్లను పెంచే అవకాశమున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ సంకేతాలివ్వడంతో ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి.

Updated : 27 Jan 2022 11:11 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ మార్చి నెలలో వడ్డీ రేట్లను పెంచే అవకాశమున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ సంకేతాలివ్వడంతో ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి. దేశీయ మార్కెట్లపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. దీంతో ట్రేడింగ్ ఆరంభం నుంచే సూచీల పతనం మొదలైంది. ఫలితంగా మార్కెట్‌ ప్రారంభమైన తొలి ఐదు నిమిషాల్లోనే దాదాపు రూ.4లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. 

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో నేటి ట్రేడింగ్‌ను సూచీలు భారీ నష్టాలతో మొదలుపెట్టాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ ఏకంగా 1100 పాయింట్లకు పైగా పతనమైంది. దీంతో మార్కెట్ ఆరంభమైన 5 నిమిషాల వ్యవధిలోనే బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.3.8లక్షల కోట్లకు పైగా తగ్గింది. ప్రస్తుతం 10.50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 998 పాయింట్లు దిగజారి 56,859 వద్ద, నిఫ్టీ 292 పాయింట్లు పతనమై 16,985 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలు 27 షేర్లు, నిఫ్టీ 50 సూచీలో 47 షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. 

మార్కెట్‌ పతనానికి ప్రధాన కారణాలివే..

అమెరికా వడ్డీ రేట్ల ప్రభావం..

ప్రపంచమంతా ఎదురుచూస్తున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ నిర్ణయాలు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత వెలువడ్డాయి. అగ్రరాజ్యంలో ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పటికీ ఉద్యోగ విపణి బలంగానే ఉందని, అందువల్ల వడ్డీ రేట్ల పెంపునకే మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలిచ్చింది. ఈ ఏడాది మార్చిలో రేట్ల పెంపు 0.25శాతం ఉండొచ్చని సూచనప్రాయంగా వెల్లడించింది. దీంతో గురువారం ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి. ఫలితంగా దేశీయ సూచీలు కూడా భారీగా నష్టపోతున్నాయి.

చమురు ధరల మంట..

అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత వేడెక్కుతున్నాయి. అంతర్జాతీయ విపణిలో బ్యారెల్‌ ధర నిన్న 90 డాలర్లు దాటింది. మరికొద్ది రోజుల్లో 100 డాలర్లను చేరే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. దీంతో దేశీయంగానూ ఇంధన ధరలు పెరిగే అవకాశాలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

బడ్జెట్‌పై అప్రమత్తత..

మరికొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలోనే మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. దీర్ఘకాల మూలధన లాభాలపై పన్నును మరింత పెంచే అవకాశాలున్నట్లు కొద్ది రోజులుగా వస్తోన్న వార్తలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం ఈక్విటీ పెట్టుబడులకు ఈ పన్ను 10శాతంగా ఉంది.

రష్యా - ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు..

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం ముదురుతోంది. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో లక్షకు పైగా బలగాలను రష్యా మోహరించడం వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది. దీంతో అక్కడ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. 

త్రైమాసిక ఫలితాలు..

డిసెంబరు త్రైమాసికానికిగానూ కంపెనీలు ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి. అయితే వీటిల్లో చాలా వరకు మదుపర్ల అంచనాలను అందుకోలేకపోయాయి. ఇది కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని