Suicide: బంధాల.. బలవన్మరణం!

ముగ్గురు యువతులు...దగ్గరి బంధువులు.. ఒకట్రెండు ఏళ్ల వయసు తేడా ఉన్నా ఒకేచోట పెరిగారు. కలిసి ఆడుకున్నారు..కలిసే చదువుకున్నారు. రెండు నెలల క్రితం ....

Updated : 29 Oct 2021 11:50 IST

ప్రాణ స్నేహితులైన ముగ్గురు యువతుల ఆత్మహత్య
వారిలో ఇద్దరికి రెండు నెలల క్రితమే వివాహంకాగా, ఒకరు ఇంటర్‌ విద్యార్థిని

మృతులు వందన, గంగజల, మల్లిక

జగిత్యాల, న్యూస్‌టుడే: ముగ్గురు యువతులు...దగ్గరి బంధువులు.. ఒకట్రెండు ఏళ్ల వయసు తేడా ఉన్నా ఒకేచోట పెరిగారు. కలిసి ఆడుకున్నారు..కలిసే చదువుకున్నారు. రెండు నెలల క్రితం వరకూ అంతా సవ్యంగానే సాగింది. ఇటీవలే వారిలో ఇద్దరికి వివాహాలు జరగడంతో పరిస్థితి మారింది. ఒకరికొకరి మధ్య దూరం పెరిగింది. చివరికి చెరువుకు చేరిన ఆ స్నేహ బంధం శాశ్వతంగా ముగిసిపోయింది. జగిత్యాల జిల్లా కేంద్రం ఈ విషాదానికి వేదికైంది. జగిత్యాల పట్టణం ఉప్పరిపేటకు చెందిన ఎక్కలదేవి గంగజల(19), ఎక్కలదేవి వందన(16), గాంధీనగర్‌కు చెందిన ఎక్కలదేవి మల్లిక(19) సమీప బంధువులు. చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు కూడా. వారిలో గంగజల, మల్లికలు ఇంటర్‌ పూర్తిచేశారు. వందన ప్రస్తుతం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. వారిలో గంగజలకు ఆగస్టు 23న జగిత్యాల మండలం నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన అత్తెన రాజుతో వివాహమైంది. మల్లిక వివాహం అదే నెల 26న కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మయ్యపల్లి గ్రామానికి చెందిన అదరవేని రాజుతో జరిగింది.

వారం క్రితమే పుట్టింటికొచ్చారు..
పెళ్లయిన ఇద్దరు యువతులు వారం క్రితమే పుట్టింటికి వచ్చారు. ఏం జరిగిందో ఏమో! బుధవారం 2.30 గంటల ప్రాతంలో ముగ్గురూ వేర్వేరు కారణాలు చెప్పి ఇళ్లలోంచి వెళ్లారు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం ఉదయం 11 గంటలకు ధర్మసముద్రం రిజర్వాయర్‌లో మృతదేహాలు బయటపడ్డాయి. వారు బలవన్మరణానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు, పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ‘అనారోగ్యం కారణంగానే తమ కుమార్తెలు బలవన్మరణానికి పాల్పడ్డారని’ వివాహితులైన యువతుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె వారిద్దరితో కలిసి ఆత్మహత్య చేసుకుందని వందన తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని, పరిశీలిస్తున్నారు. తల్లిదండ్రుల వాదన అలా ఉండగా..వివాహం కారణంగా ఒకరికొకరం దూరమయ్యామనే బాధతోనే వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని సన్నిహితులు భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని