Crime News: లక్కీసరై.. కట్రిసరై.. వార్సిలీగంజ్‌.. సైబర్‌ నేరస్థుల అడ్డాలివి

కనీసం పదోతరగతి అయినా చదవని యువకులు.. కాయకష్టానికి విముఖత చూపే నిరక్షరాస్యులు.. చేతుల్లో చిన్నపాటి స్మార్ట్‌ఫోన్లు.. నలుగురైదుగురు కలిసి చాయ్‌ దుకాణం చెంత

Updated : 13 Aug 2022 08:23 IST

కార్లు, కంపెనీల ఫ్రాంఛైజీల పేరిట రూ.లక్షల్లో గుంజుడు

ప్రధానంగా మెట్రో నగరాలపై నజర్‌

కట్టడికి హైదరాబాద్‌ పోలీసుల ప్రత్యేక కార్యాచరణ

ఈనాడు, హైదరాబాద్‌: కనీసం పదోతరగతి అయినా చదవని యువకులు.. కాయకష్టానికి విముఖత చూపే నిరక్షరాస్యులు.. చేతుల్లో చిన్నపాటి స్మార్ట్‌ఫోన్లు.. నలుగురైదుగురు కలిసి చాయ్‌ దుకాణం చెంత ముచ్చట్లు. బిహార్‌ రాష్ట్రం జహ్నాబాద్‌, శేగోపూర్‌, గయ జిల్లాల్లోని లక్కీసరై, కట్రిసరై, పాంచీ, వార్సిలీగంజ్‌ గ్రామాల్లో కనిపించే దృశ్యాలు. అమాయకుల్లా కనిపించే ఈ యువకులకు ఈ-వ్యాలెట్ల ద్వారా నగదు బదిలీచేయడం చాయ్‌ తాగినంత సులభం.. నాలుగు జిల్లాల పరిధిలోని ఈ గ్రామాల్లో నివసిస్తున్న యువకులంతా కలిపి 100కు పైగా ముఠాలుగా ఏర్పడ్డారు. రెండు మూడేళ్లుగా దేశంలోని మెట్రోనగరాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. ఒక్కొక్కరి నెలవారీ సంపాదన రూ.5లక్షలకు పైమాటే. రూ.కోట్లలో నగదు కొల్లగొడుతున్న వీరిని పట్టుకునేందుకు వెళ్తున్న పోలీస్‌ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ ముఠాలను జైల్లో పెట్టేందుకు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

ఆన్‌లైన్‌ కొనుగోలుదారులే లక్ష్యం
లక్కీసరై, కట్రిసరై.. వార్సిలీగంజ్‌.. పాంచీ గ్రామాల్లోని సైబర్‌ నేరస్థుల ముఠాలు ఆన్‌లైన్‌ మోసాల తీరును క్షుణ్నంగా ఆకళింపు చేసుకున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, స్నాప్‌డీల్‌ ఇలా ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ల నుంచి కొనుగోలు చేసినవారి వివరాలను ముంబయి, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లోని ఆయా ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల డెలివరీ పాయింట్ల ద్వారా సేకరిస్తున్నారు. అనంతరం కొనుగోలుదారుల జాబితాను పరిశీలించి రోజుకు 100-200 మందికి ఫోన్లు చేస్తున్నారు. తాము ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ కంపెనీల నుంచి మాట్లాడుతున్నామంటూ చెప్తున్నారు. లక్కీడ్రాలో కార్లు వచ్చాయని ఆశజూపుతున్నారు. కారు లేదా డబ్బు ఇస్తామంటూ చెబుతున్నారు. డబ్బు కావాలని కోరుకోగానే.. మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ముఠాలోని కొందరు సభ్యులు హల్దీరామ్‌, రామ్‌దేవ్‌ బాబా ఉత్పత్తుల ఫ్రాంఛైజీలు ఇప్పిస్తామంటూ సెల్‌ఫోన్లకు సందేశాలు పంపుతున్నారు. స్పందించిన వారి నుంచి రుసుము పేరుతో రూ.లక్షలు గుంజుతున్నారు.

మచ్చుకు కొన్ని..
* జూబ్లీహిల్స్‌లో నివాసముంటున్న ఒక మహిళకు లాటరీ వచ్చిందంటూ లక్కీసరైలో ఉంటున్న సైబర్‌ నేరస్థులు ఫోన్‌చేశారు. రూ.25లక్షలు పంపుతామంటూ ఆమెకు వివరించారు. వేర్వేరు రుసుముల పేరుతో దశలవారీగా ఆమె నుంచి రూ.39లక్షలు నగదు బదిలీ చేయించుకున్నారు. దగా గుర్తించిన  చివరకు మహిళ పోలీసులను ఆశ్రయించారు.

* హైదరాబాద్‌ పాతనగరంలోని ఓ వ్యాపారికి సైబర్‌ నేరస్థులు ఫోన్‌ చేసి రాందేవ్‌ బాబా ఫ్రాంఛైజీ ఇస్తాం.. బయానాగా రూ.5లక్షలు పంపాలంటూ ఇటీవలే ఫోన్‌ చేశారు. ఫ్రాంఛైజీ ఇస్తున్నట్టు వాట్సప్‌లో పత్రాన్నీ పంపించడంతో ఆయన నమ్మి రూ.5లక్షల నగదు వారి ఖాతాల్లోకి వేశాడు. ఫ్రాంఛైజీ కోసం ఫోన్‌ చేయగా.. స్విచ్చాఫ్‌ అని వచ్చింది.

సొంతూరి దృష్టిలో అమాయకులు!
బాధితులు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ఆధారంగా పోలీసులు వారి గ్రామాలకు వెళ్తున్నారు. అది ముందుగానే అంచనా కట్టి నేరస్థులు స్థానిక సర్పంచులకు విషయాన్ని వివరిస్తున్నారు. తాము ఎలాంటి నేరాలు చేయకపోయినా.. పోలీసులు సిమ్‌కార్డుల ఆధారంగా వస్తున్నారని, పోలీసులను ప్రతిఘటించాలని కోరుతున్నారు. దీంతో గ్రామస్థులు పోలీసుల రాకను అడ్డుకుంటున్నారు. ఇటీవలే ఓ ముఠాను అరెస్ట్‌ చేసేందుకు హైదరాబాద్‌ నుంచి వెళ్లిన ఓ పోలీస్‌ అధికారిని చుట్టుముట్టి సెల్‌ఫోన్‌ని లాక్కున్నారు. మరో పోలీస్‌ అధికారికి అది తెలిసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. అప్పుడు సెల్‌ఫోన్‌ తిరిగిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని