Crime News: పెళ్లి చేయాలంటూ గొడవపడ్డాడు.. తండ్రి, బాబాయ్‌లను కొట్టి చంపాడు

మతిస్థిమితం సరిగా లేని యువకుడు..పెళ్లి విషయంలో కుటుంబ సభ్యులతో గొడవపడి తండ్రి, బాబాయ్‌లను పారతో కొట్టి చంపిన ఉదంతమిది. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండల

Updated : 13 Aug 2022 09:02 IST

మతిస్థిమితం లేని యువకుడి ఘాతుకం

నిజామాబాద్‌ జిల్లాలో ఘటన

మోపాల్‌, న్యూస్‌టుడే: మతిస్థిమితం సరిగా లేని యువకుడు..పెళ్లి విషయంలో కుటుంబ సభ్యులతో గొడవపడి తండ్రి, బాబాయ్‌లను పారతో కొట్టి చంపిన ఉదంతమిది. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండల కేంద్రంలో జరిగిందీ దారుణం. ఎస్సై మహేశ్‌ కథనం ప్రకారం.. మోపాల్‌ మండల కేంద్రానికి చెందిన కర్రల పెద్ద అబ్బయ్య(64)కు ముగ్గురు కుమారులు. ఇద్దరు ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారు. రెండో కుమారుడు సతీశ్‌(28) ఉపాధి నిమిత్తం ఎనిమిదేళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లాడు. ఏడాదిపాటు పనిచేసిన తర్వాత కుంగుబాటు కారణంగా మానసిక సమస్యలు తలెత్తినట్టు తెలుసుకున్న కుటుంబ సభ్యులు సతీష్‌ను స్వగ్రామానికి రప్పించారు. తనకు పెళ్లి చేయాలంటూ కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడుతున్నాడు. రెండు రోజుల క్రితం ‘తానే ఓ అమ్మాయిని చూసుకొని పెళ్లి కుదుర్చుకున్నానని, అమ్మాయి తరఫు  వారు ఈ నెల 14న ఇంటికి వస్తారని’ తండ్రితో చెప్పాడు.

శుక్రవారం ఉదయం 6 గంటలకు పెద్ద అబ్బయ్య వాకిలి శుభ్రం చేస్తుండగా, అక్కడికి వచ్చిన సతీశ్‌ పెళ్లి విషయమై ఆయనతో గొడవపడ్డాడు. ఒక దశలో పారతో దాడికి యత్నించాడు. అక్కడే ఉన్న పెద్ద అబ్బయ్య తమ్ముడు నడిపి సాయిలు(54) అడ్డుకోబోగా, ఆయనపైనా దాడిచేశాడు. పారతో తలపై కొట్టడంతో ఇద్దరూ స్పృహ కోల్పోయి కింద పడిపోయినా వదల్లేదు. మరణించేవరకూ కొడుతూనే ఉన్నాడు. చనిపోయినట్టు నిర్ధారించుకున్న తర్వాత అక్కణ్నుంచి పారిపోయాడు. అతని బారి నుంచి తల్లి లక్ష్మి, వదిన(నిందితుడి అన్న భార్య) త్రుటిలో తప్పించుకున్నారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. దాడి చేసేందుకు ప్రయత్నిస్తుండగా తల్లి బయటకు పరుగులు తీసిందని, వదిన ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకుందని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని