శామీర్‌పేటలో బాలుడి అదృశ్యం విషాదాంతం

మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలో ఈ నెల 15న అదృశ్యమైన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మృతదేహాన్ని శామీర్‌పేట అవుటర్‌ రింగ్‌రోడ్డు పక్కన

Updated : 27 Oct 2020 06:28 IST

శామీర్‌పేట: మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలో బాలుడు అథియాన్‌ (5) అదృశ్య ఘటన విషాదాంతమైంది. షేర్‌చాట్‌ వీడియో కోసం తన గదికి తీసుకెళ్లిన నిందితుడు ఆ తర్వాత బాలుడిని హత్య చేశాడు.  పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. శామీర్‌పేటకు చెందిన సయ్యద్‌ ఉసేన్‌, గౌజ్‌బీ మూడో కుమారుడు అథియాన్‌ స్థానిక ప్రైవేటు పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. ఈనెల 15న మధ్యాహ్న భోజనం అనంతరం ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో బాలుడి కోసం గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలుడి కోసం గాలింపు చేపట్టారు. 

ఈ క్రమంలో ఈనెల 23న బాలుడి తల్లిదండ్రులు అద్దెకు ఉంటున్న ఇంటి యజమానికి ఫోన్‌ వచ్చింది. అథియాన్‌కు కిడ్నాప్‌ చేశానని.. రూ.15లక్షలు ఇస్తే అప్పగిస్తామని నిందితుడు బెదిరించాడు. యజమాని ఆ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతికత సాయంతో నిందితుడిని బిహార్‌ వాసి సుధాంశ్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడు అదే ఇంట్లో పైఅంతస్తులో అద్దెకు ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

సుధాంశ్‌ తరచూ బాలుడు అథియాన్‌ను తన గదికి తీసుకెళ్లి షేర్‌చాట్‌ కోసం ఉపయోగించుకునేవాడు. అప్పటికే బాలుడితో రెండు వీడియోలు తీసిన సుధాంశ్‌.. మరో జంపింగ్‌ వీడియో తీసే క్రమంలో అథియాన్‌ కిందపడటంతో తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. విషయం తల్లిదండ్రులకు తెలిస్తే తనపై దాడి చేస్తారనే భయంతో.. ఎవరికీ తెలియకుండా బాలుడిని చంపాలని నిందితుడు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అథియాన్‌ను చంపి మృతదేహాన్ని ప్లాస్టర్‌తో ప్యాక్‌ చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఓ బ్యాగులో తీసుకెళ్లి శామీర్‌పేట అవుటర్‌ రింగ్‌రోడ్డు వద్ద పడేశాడు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని