logo
Published : 03/12/2021 04:58 IST

సంక్షిప్త వార్తలు

గూడూరు మార్గంలో పలు రైళ్ల రద్దు

రైల్వేస్టేషన్‌(విజయవాడ), న్యూస్‌టుడే : విజయవాడ-గూడూరు మార్గంలో నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల దృష్ట్యా పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

* రైలు నంబరు 17237-17238 చెన్నై-బిట్రగుంట-చెన్నై(ఈ నెల 13 నుంచి 24 వరకు)

* నంబరు 12711-12712 విజయవాడ-చెన్నై-విజయవాడ(7వ తేదీ)

* నంబరు 07261-07262 గూడూరు-విజయవాడ-గూడూరు(6 నుంచి 24వరకు గూడూరు-కావలి మధ్య రద్దు)

* రైలు నంబరు 12 హావ్‌డా-చెన్నైసెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 5వ తేదీ నుంచి 23 వరకు మధ్యాహ్నం 3.30కి బదులు 6.15కి హావ్‌డాలో బయలుదేరుతుంది.


జనవరి 21న ఐఆర్‌సీటీసీ గుజరాత్‌ యాత్ర

రైల్వేస్టేషన్‌(విజయవాడ) : తీర్థయాత్రలు సందర్శించే యాత్రికుల సౌకర్యార్థం విజయవాడ మీదగా ఐఆర్‌సీటీసీ సంస్థ ప్రత్యేక తీర్థయాత్ర పర్యాటక రైలును నడపనుంది. మొత్తం 10 రాత్రులు, 11 పగటి వేళలతో ప్యాకేజీ ఉంటుంది. జనవరి 21న విజయవాడలో బయలుదేరే ఈ రైలు 31న తిరుగు ప్రయాణమవుతుంది. ఏలూరు, రాజమండ్రి, తుని, విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతుంది. సోమనాథ్‌, ద్వారకా, నాగేశ్వర్‌, బెట్ ద్వారకా, అహ్మదాబాద్‌ తదితర ప్రదేశాలను సందర్శించడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీˆ సౌకర్యం అందుబాటులో ఉంది. ఉదయం టీ, అల్పాహారం, భోజనం, తదితర సౌకర్యాలు కల్పిస్తారు. టికెట్టు ధర ఒకొక్కరికీ సీˆ్లపర్‌ తరగతిలో రూ.10,400, థర్డ్‌ ఏసీలో రూ.17,330. టికెట్ల బుకింగ్‌ ఇతర వివరాలకు ఫోన్‌ నంబర్లు 8287932312, 9701360675 నంబర్లలో సంప్రదించవచ్చు.


5న కవి సమ్మేళనం

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే : ఎక్స్‌రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నెలనెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా ‘పొగచూరుతున్న భవితవ్యం’ అంశంపై ఈనెల 5న జూమ్‌ యాప్‌ ద్వారా కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి బోడి ఆంజనేయరాజు గురువారం తెలిపారు. కందికొండ రవికిరణ్‌ పర్యవేక్షించనున్నారు. ఈ కవి సమ్మేళనంలో యువతకు ప్రాధాన్యం ఉంటుందని, ఇతర వివరాలకు 94912 98990, 94410 42669 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.


‘పంటకు మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలి’

విజయవాడ(అలంకార్‌కూడలి): రైతులు పండించిన పంటకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలని ఏపీ రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్‌ చేశారు. గురువారం నగరంలోని ఎంబీ విజ్ఞాన కేంద్రం నుంచి రైతు సంఘాల నాయకులతో ఆయన ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా స్వామినాథన్‌ కమిటీ సిఫారుసుల మేరకు పంటల ఉత్పత్తి వ్యయానికి అదనంగా 50శాతం కలిపి రైతులకు మద్దతు ధరగా చెల్లించాలని కోరారు. భూపేంద్ర సింగ్‌ హుడా కమిటీ సిఫారుసుల మేరకు ఎకరానికి రూ.10వేలు, పెట్టుబడి రాయితీ ఇవ్వాలని, విద్యుత్తు బిల్లు 2020ను ఉపసంహరించుకుని, పాత విధానం ప్రకారం రైతుల పంపు సెట్లకు ఉచితంగా విద్యుత్తు సరఫరా అందజేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.


ఫార్మసీ పరీక్షలకు నోటిఫికేషన్‌

మచిలీపట్నం, న్యూస్‌టుడే : కృష్ణా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలో బీఫార్మసీ, ఎంఫార్మసీ కోర్సుల రెండో సెమిస్టర్‌ పరీక్షల నోటిఫికేషన్‌ విడుదల చేసినట్టు పరీక్షల నియంత్రణాధికారి డా.రామశేఖరరెడ్డి తెలిపారు. ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజును ఈనెల 13 రకూ చెల్లించవచ్చన్నారు. లా ఎల్‌ఎల్‌బీ మొదటి, బీఏ ఎల్‌ఎల్‌బీ మొదటి, ఐదవ సెమిస్టర్‌ ఫలితాలను గురువారం విడుదల చేసినట్టు రామశేఖరరెడ్డి తెలిపారు.


ఆర్జీయూకేటీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ పూర్తి  

నూజివీడు, న్యూస్‌టుడే : ఆర్జీయూకేటీ(రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం) పరిధిలోని 2021-22 విద్యా సంవత్సర ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు సంబంధించి నూజివీడు, ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లకు సాధారణ కౌన్సెలింగ్‌ గురువారం సాయంత్రంతో ముగిసింది. 4,400 సీట్లకు గాను 4,143 సీట్లు భర్తీ అయ్యాయని ప్రవేశాల కన్వీనర్‌ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు తెలిపారు. దివ్యాంగులు, ఎన్‌సీసీ, క్రీడ, సైనిక సంతతి వంటి ప్రత్యేక విభాగాలకు చెందిన 257 సీట్లకు సంబంధించి కౌన్సెలింగ్‌ ఈ నెల రెండో వారంలో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక విభాగాల కౌన్సెలింగ్‌ అనంతరం అదేవారంలో ప్రవేశాలు ఉంటాయని వివరించారు. సాధారణ కౌన్సెలింగ్‌ సజావుగా సాగడానికి సహకరించిన ఉపాధ్యాయులు, విద్యార్థి వాలంటీర్లు, ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ఆచార్య జీవీఆర్‌ శ్రీనివాసరావులను ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కె.సి.రెడ్డి, ఉపకులపతి ఆచార్య హేమచంద్రారెడ్డి అభినందించారు.


స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు

మిర్చియార్డు, న్యూస్‌టుడే: 341, బాడిగ మిర్చి రకాలకు డిమాండ్‌ పలుకుతుంది. ఈ రెండు రకాల ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. మొత్తంమీద అన్ని రకాల మిర్చి ధరలు కొంత మేరకు పెరిగాయి. రైతులు గురువారం 33,717 మిర్చి బస్తాలను యార్డుకు తరలించారు. ఈ-నామ్‌ ద్వారా 32,938 బస్తాలు విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 9,281 బస్తాలు నిల్వ ఉన్నాయి. 341 రకం మిర్చి ధర తేజ రకం కంటే ఎక్కువగా ఉంది. 341 రకం మిర్చికి ధర రూ.7,200 నుంచి రూ.15,700 లభించింది. కామన్‌ వెరైటీ 334, నెంబర్‌ 5, 273, 4884 రకాల మిర్చి సగటు ధర రూ.7,000 నుంచి రూ.15,200 ఉండగా, స్పెషల్‌ వెరైటీ తేజ రకం మిర్చి ధర రూ.7,200 నుంచి రూ.14,700, బాడిగ రూ.7,000 నుంచి రూ.17,500 ధర లభించింది. నాణ్యత ఉన్న కొన్ని లాట్లు బాడిగ రకానికి రూ.18,000 ధర పలికింది. తాలు మిర్చి ధర రూ.4,000 నుంచి రూ.8,000 ఉంది.


ఉద్యోగుల సర్దుబాటుపై కసరత్తు ప్రారంభం

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఈనెల 4న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పీహెచ్‌సీల్లో పని చేస్తున్న ఉద్యోగుల పూర్తి వివరాలు నిర్ణీత నమూనాలో తీసుకురావాలని సంబంధిత ఉద్యోగులకు ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం గతనెల 17న జారీ చేసిన జీవో 143 ప్రకారం ప్రతి పీహెచ్‌సీలో 12 మంది ఉద్యోగులు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. అంతకంటే ఎక్కువ ఉంటే ఇతర ఆరోగ్య కేంద్రాలకు సర్దుబాటు చేయాలని సూచించారు. అప్పటికీ అధికంగా ఉంటే.. ఆ వివరాలు తమ కార్యాలయానికి తెలియజేయాలని కోరారు. ఈ ప్రక్రియ మొత్తం 10 రోజుల్లో పూర్తి కావాలని ఆదేశించారు. దీంతో శనివారం సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం.


11న హిందూ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: గుంటూరు హిందూ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘ ఆత్మీయ సమావేశం ఈనెల 11న ఉదయం 8.30 గంటలకు గుంటూరు మార్కెట్‌ కూడలిలోని కళాశాల ఏకాదండయ్య పంతులు హాలులో జరుగుతుందని సంఘం అధ్యక్షుడు మాకేటి సోమశేఖరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల విద్యార్థులకు ప్రతిభ ప్రాతిపదికన బహుమతులు అందజేస్తారు.


పొగ తాగితే జరిమానా

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: రైల్వే స్టేషన్‌, రైళ్లలో పొగ తాగితే   జరిమానా విధించనున్నట్లు డివిజనల్‌ రైల్వే అధికారి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సిగరెట్‌ ముట్టించి పారేసే అగ్గిపుల్లతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా సిగరెట్‌ తాగి పారేసినప్పుడు నిప్పు అంటుకుని పలు వస్తువులు కాలిపోయాయన్నారు. అందువల్ల రైల్వే తనిఖీ సిబ్బంది, రైల్వే రక్షక దళం సభ్యులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.


నవోదయ ప్రవేశానికి  15 వరకు గడువు

చిలకలూరిపేట గ్రామీణ:  మద్దిరాల జవహర్‌ నవోదయ విద్యాలయలో ఆరో తరగతి ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువును 15 వరకు పొడిగించినట్లు విద్యాలయ ప్రిన్సిపల్‌ నల్లూరి నరసింహారావు గురువారం తెలిపారు.  డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.నవదయ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు.


12న జడ్పీ సర్వసభ్య సమావేశం

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాపరిషత్తు సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 12న నిర్వహించేందుకు జడ్పీ ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోడ్‌ ముగియడంతో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు సీఈవో చైతన్య దస్త్రాన్ని ఛైర్‌పర్సన్‌కు పంపారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగతుండడంతో ఎంపీలు పాల్గొనడానికి వీలుగా ఆదివారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించేందుకు క్రిస్టినా గురువారం దస్త్రంపై సంతకం చేసి ఆమోదించారు. ప్రస్తుత పాలకవర్గానికి ఇదే తొలి సర్వసభ్య సమావేశం. దీంతో జడ్పీటీసీ సభ్యులు వారి మండలాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం లభించనుంది.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని