logo
Published : 03/12/2021 04:58 IST

క్రైం వార్తలు

వీఎంబీకేపై దాడి... ముగ్గురిపై కేసు నమోదు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: కొండూరు గ్రామంలో పక్కా గృహాలకు ఓటీఎస్‌ విషయమై ఏర్పడ్డ వివాదంలో వీఎంబీకేపై దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేశామని ఎస్సై రామకృష్ణ గురువారం తెలిపారు. సచివాలయ ఉద్యోగులతో కలిసి వీఎంబీకే సువర్ణ ఓటీఎస్‌ కింద సొమ్ములు చెల్లించాలని కోరగా గ్రామానికి చెందిన బెల్లంకొండ బుచ్చెమ్మ, తిరుతమ్మ, దాస్‌ ఆమెపై దాడి చేశారని చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. నిందితులు బుధవారం రాత్రి ఆస్పత్రిలో చేరి వీఎంబీకే తమపై దాడి చేసిందని చెబుతున్నారని, పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.


ఆటో కింద పడి చిన్నారి దుర్మరణం

చందర్లపాడు, న్యూస్‌టుడే: తుర్లపాడులో వేల్పుల శివాజీ, సుశీల దంపతుల పద్దెనిమిది నెలల కుమార్తె రిషిత ఆటో కింద పడి గురువారం మృతి చెందినట్లు ఏఎస్సై కృష్ణారావు తెలిపారు. ఉల్లిపాయలు విక్రయించే ఆటో రోడ్డుపై వెళ్తుండగా కొనుగోలు చేయడానికి సమీపంలోని కుటుంబాలు పిలవడంతో వాహనచోదకుడు వెనుక ఉన్న పాపను గమనించకుండా నడపడంతో టైరు కింద పడిందన్నారు. తీవ్రంగా గాయపడిన రిషితను చికిత్స నిమిత్తం నందిగామ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. చిన్నారి తండ్రి శివాజీ ఆటో డ్రైవరుగా పని చేస్తుండగా, తల్లి సుశీల కూలి పనులకు వెళ్తుంది. వీరికి పాప, బాబు సంతానం. నిమిషం క్రితం వరకు తమ కళ్ల ముందు ఆడుతూ తిరిగిన పాప విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు భోరున విలపించారు.


కైకలూరులో భారీగా గంజాయి పట్టివేత

కైకలూరు, న్యూస్‌టుడే: కైకలూరు నియోజకవర్గం పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దీనిపై స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో సీఐ వైవీఎల్‌ నాయుడు వివరాలు వెల్లడించారు. గంజాయి రవాణాపై అందిన సమాచారంతో టౌన్‌ ఎస్సైలు ఎం.షణ్ముఖసాయి, కెఎల్‌ఎస్‌ గాయత్రి, రెవెన్యూ సిబ్బందితో కలిసి కైకలూరు ఆర్టీసీ బస్టాండు, మాగంటి సినీ థియేటర్‌ వద్ద తనిఖీలు నిర్వహించి కైకలూరుకు చెందిన పరిటాల రామసుబ్బారావు, పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలానికి చెందిన వీరమల్లు చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు. వీరి నుంచి 2.4కిలోల బరువున్న 80 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించగా విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన చింతపల్లి నుంచి కొనుగోలు చేసినట్లు తేలిందన్నారు. కలిదిండి ఎస్సై మణికుమార్‌, రెవెన్యూ సిబ్బందితో కలిదిండి ప్రధాన కూడలిలో గంజాయి విక్రయిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన కోవ్డా శ్రీనును అదుపులోకి తీసుకుని అతని వద్ద 20 గంజాయి పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ రూ.70వేల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు మల్లి, నాగబాబుకు సీఐ నాయుడు నగదు పురస్కారం అందజేశారు.


చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని గురువారం సీసీఎస్‌, మిల్స్‌కాలనీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.2.50 లక్షల విలువైన బంగారు, వెండి నగలు, చరవాణిని  స్వాధీనం చేసుకున్నారు. కమిషనరేట్‌లో గురువారం పోలీసు కమిషనర్‌ తరుణ్‌జోషి వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన గుబ్బలకుమార్‌ అలియాస్‌ ప్రేమ్‌కుమార్‌ అలియాస్‌ గౌతం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఫతేనగర్‌లో నివాసముంటున్నాడు. జల్సాలకు అలవాటు పడిన గుబ్బలకుమార్‌ హైదరాబాద్‌, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారు, వెండి నగలను అపహరించాడు. గతంలో జైలుశిక్ష అనుభవించి బయటకు వచ్చినప్పటికీ చోరీలు చేయడం మానుకోలేదు. అక్టోబర్‌లో సంగారెడ్డి జైలు నుంచి బయటకు వచ్చాడు. నవంబర్‌లో వరంగల్‌లోని పుప్పలగుట్టలో ఓ ఇంటి తాళం పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, రూ.15 వేల నగదు చోరీ చేశాడు. పోలీసులు గురువారం వరంగల్‌లోని చింతల్‌ వంతెన సమీపంలో నిందితుడిని అరెస్టు చేశారు.


ఉండవల్లిలో సినిమా థియేటర్‌కు సీలు

తాడేపల్లి, న్యూస్‌టుడే: నగరంలోని ఉండవల్లి కూడలిలో గురువారం ఉదయం ఓ సినిమా థియేటర్‌కు రెవెన్యూ అధికారులు సీలు వేశారు. అనుమతి లేకుండా సినీ నటులు బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం బెనిఫిట్‌ షో వేసినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్‌ దృష్టికి వెళ్లడంతో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆయన రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తహసీల్దారు శ్రీనివాసులురెడ్డి తమ సిబ్బందితో థియేటర్‌ వద్దకు విచారణ జరిపి జేసీకి నివేదిక అందజేశారు. నిబంధనల అతిక్రమణ రుజువు కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్‌ శ్రీనివాసులురెడ్డి థియేటర్‌కు సీలు వేశారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని