logo
Updated : 03/12/2021 05:38 IST

అటు రూ.11.50 ఇటు రూ.72 లక్షలు

ఖమ్మం-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి భూసేకరణలో ధరల తీరు

ఈనాడు, అమరావతి 

ఆ రెండు స్థలాల మధ్య రోడ్డు మాత్రమే అడ్డం. కేవలం 20 అడుగుల దూరం కూడా ఉండదు. కానీ ఒక వైపు ఎకరా రూ.11.50లక్షలు ప్రభుత్వ (రిజిస్ట్రేషన్‌) ధర. మరోవైపు మాత్రం ఎకరా రూ.72 లక్షలు రిజిస్ట్రేషన్‌ ధర. ఇదే కాదు.. ఇంకొంత దూరంలో ఎకరా రూ.1.05కోట్లు ఉంది. ఈ భూములను జాతీయ రహదారుల సంస్థ సేకరిస్తోంది. ఖమ్మం-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి కోసం అలైన్‌మెంట్‌ చేశారు. గత ఆగస్టులో నోటిఫికేషన్‌ ఇచ్చారు. భూసేకరణలో ప్రభుత్వ ధరకు కొంత పరిహారం కలిపి ఎకరా ధర నిర్ణయిస్తారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం రెండున్నరెట్లు పరిహారం అందుతుంది. అంటే ఎకరా రూ.11.50లక్షలు ఉన్నవారికి రూ.28.75లక్షల వరకు పరిహారం అందే అవకాశం ఉంది. ఎకరా రూ.72లక్షలు ఉన్నవారికి రూ.1.80కోట్లు పరిహారంగా పొందనున్నారు. ఇదే చర్చనీయాంశమైంది. ఈ సమస్య విజయవాడ గ్రామీణ మండలం పైడూరుపాడు, జక్కంపూడి మధ్య తలెత్తుతోంది. గతంలో జక్కంపూడిలో జెట్‌సిటీకి సేకరించిన భూములకు ఎకరాకు రూ.కోటి వరకు ధర పలికింది. ఈ ధరే అమలులో ఉంది. 

ఇదీ పరిస్థితి.. 

గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి కృష్ణా జిల్లాలో 93.8198 హెక్టార్ల భూమి సేకరించనున్నారు. విజయవాడ గ్రామీణం, జి.కొండూరు మండలాల నుంచి భూమిని సేకరించనున్నారు. దీన్ని విజయవాడ బైపాస్‌ రహదారికి కలుపుతారు. జిల్లాలో ఈ రహదారి 280.311 కి.మీ. వద్ద ప్రారంభం అవుతుంది. జక్కంపూడి వద్ద బైపాస్‌కు కలిసే ప్రాంతం 306.618 కి.మీ వద్ద ముగుస్తుంది. దీనికి ఇంకా నెంబరు కేటాయించలేదని జాతీయ రహదారుల సంస్థ అధికారులు చెప్పారు. ఖమ్మం నుంచి విజయవాడకు 90 కిలోమీటర్లు వస్తుంది. బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం, మీదుగా చెరువుమాధవరం, జి.కొండూరు మీదుగా రాయనపాడుకు చేరుకుంటుంది. 

చెరువు మాధవరంలో 21 మంది, దుగ్గిరాలపాడులో ముగ్గురు, గడ్డమణుగులో 17 మంది, గంగినేనిపాలెంలో 20 మంది, కొండూరులో 6, మునగపాడు 16, పెట్రంపాడు 14, పినపాక 12, సున్నంపాడు 01 సర్వే నెంబర్లలో భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ అయింది. విజయవాడ గ్రామీణం పరిధిలో జక్కంపూడిలో 67 మందికి చెందిన సర్వేనెంబర్లలో,  పైడూరుపాడు గ్రామంలో 24, రాయనపాడు గ్రామంలో 7 సర్వే నెంబర్ల పరిధిలో భూసేకరణ జరుగనుంది. జక్కంపూడిని ప్రామాణికంగా తీసుకుని పరిహారం అందించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ఇంకా అవార్డు నిర్ణయించలేదని  సంయుక్త కలెక్టర్‌ కె.మాధవీలత చెప్పారు. 


తక్కువకు ఇవ్వబోం..!  

వేముల సీతారామయ్య, సర్పంచి, పైడూరుపాడు

పక్కనే ఉన్న భూమి ఎకరం రూ.72లక్షలు పలుకుతుంది. మాది రూ.11.50లక్షలేనట. అందుకే భూసేకరణకు ఒప్పుకోం. అదేవిధంగా జక్కంపూడి పైడూరుపాడు, రాయనపాడు నుంచి కొండూరు వరకు సర్వీసు రహదారులు కావాలని అడుగుతున్నాం. మాగ్రామం పరిధిలో అండర్‌పాస్‌లు ఇవ్వాలని, పొలాలకు ట్రాక్టర్లు వెళ్లేందుకు మార్గం ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం.


 

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని