logo
Updated : 03/12/2021 05:57 IST

దాటాలంటే దడే..!

న్యూస్‌టుడే, విజయవాడ సిటీ  

ఎనికేపాడు: కారుకు అడుగు భాగం తగలకుండా ఈ వేగ నిరోధకం దాటించడం సవాలే..

ప్రమాదాలు జరగకుండా వాహనదారుల వేగాన్ని నియంత్రించాలనే లక్ష్యంతో రోడ్లపై వేగ నిరోధకాలు (స్పీడు బ్రేకర్లు) ఏర్పాటు చేస్తారు. అయితే సంబంధిత అధికారుల అనుమతులు తీసుకోకుండా, నిబంధనలు అనుసరించకుండా వాటిని ఏర్పాటు చేయడం వల్ల మేలు కన్నా ఎక్కువగా కీడు చేస్తున్నాయి. ఎక్కువ ఎత్తు, వెడల్పులో ఉండడం, రాత్రి వేళ కనిపించక వాహనదారులు ప్రమాదాలు భారిన పడుతున్నారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు.  

నిబంధనల మేరకు నగరపాలక సంస్థ, పీఆర్‌, ఆర్‌అండ్‌బీ ఇంజినీరింగ్‌ విభాగాల వారు మాత్రమే వేగ నిరోధకాలు ఏర్పాటు చేయాలి. ఎనికేపాడు, ప్రసాదంపాడు ప్రాంతంలో ‘న్యూస్‌టుడే’ బృందం పరిశీలించింది. అర కి.మీ దూరంలో ఉన్నటువంటి ప్రసాదంపాడు గ్రామంలో వికాస్‌ పాఠశాల (ట్రాన్స్‌ఫార్మర్‌) రోడ్డులో ఎనిమిది, సాంకేతిక విద్యా మండలి రోడ్డులో ఐదు వేశారు. కొమ్మా వెంకట సుబ్బారావు వీధిలో 20 అడుగుల దూరంలోనే రెండు వేశారు. ఎనికేపాడు నుంచి తాడిగడప వెళ్లే వంద అడుగుల రోడ్డులో రెండు వేగనిరోధకాలు అత్యంత ఎత్తులో ప్రమాదకరంగా ఉన్నాయి  

ద్విచక్ర వాహనదారుల అవస్థలు ఇలా...

* ప్రసాదంపాడు వికాస్‌ పాఠశాల (ట్రాన్స్‌ఫార్మర్‌) రోడ్డులో ఎనిమిది వేగ నిరోధకాలు వేశారు. అర కి.మీ దూరం ఉన్న రహదారిలోనే ఇన్ని వేయడం వల్ల రాకపోకలకు అసౌకర్యం కలుగుతోంది. ఇక్కడ స్పీడ్‌బ్రేకర్‌ ఎత్తు 16, వెడల్పు 37 సెంటీమీటర్లతో నిర్మించారు.

ప్రసాదంపాడు: వేగనిరోధకం ఎక్కలేక...

ఎక్కువ ఎత్తు, వెడల్పు ఉండడం వల్ల అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెనుక వైపు కూర్చున్న మహిళలు, చిన్నారులు, వృద్ధులు పడిపోతున్నారు.

సమస్యాత్మక ప్రాంతాలు...
నగరంలోని అశోక్‌నగర్‌, న్యూఆర్టీసీకాలనీ, పంటకాలువ రోడ్డు, పీఅండ్‌టీకాలనీ, అయ్యప్పనగర్‌, ముత్యాలంపాడు రోడ్డు నుంచి సాయిబాబా ఆలయం వరకు, మధురానగర్‌లో వీవీ నర్సరాజు రోడ్డులో ఏర్పాటు చేసిన నిరోధకాల వల్ల పాదచారులు, ద్విచక్రవాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదుపు తప్పి పడిపోయి గాయాల పాలవుతున్నారు.  

జిల్లాలోని పునాదిపాడు, ఈడుపుగల్లు, కంకిపాడు, గొల్లనపల్లి, బీబీగూడెం, మొవ్వ మండలం కారకంపాడు ఆర్‌అండ్‌బీ రోడ్డులో వేగ నిరోధకాల వల్ల రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేగ నిరోధకాలపై కనీసం రేడియం స్టిక్కర్లు లేవు.

సహజంగా ఒకటి, లేదా రెండు వేగ నిరోధకాలు పక్కపక్కనే వేస్తుంటారు. విజయవాడ-ఏలూరు జాతీయ రహదారికి సమీపంలో ఉందని కారణంగా చూపి బల్లెంవారి వీధిలో నాలుగు వేగ నిరోధకాలు ఏర్పాటు చేశారు. వీటిపై కనీసం రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయడం లేదు. కనీసం సూచికలు లేవు.  

* ఎనికేపాడు-తాడిగడపకు వెళ్లే వంద అడుగల రోడ్డులో 151 సెంటీమీటర్ల వెడల్పులో వేగ నిరోధకం ఉంది. కనీసం అది ఉన్నట్లు సూచికలు ఏర్పాటు చేయలేదు.  

వాహనాల అడుగుభాగం తగిలి రోడ్డుపై పడిన గీతలు


18 సెంటీమీటర్ల ఎత్తా..    

నికేపాడు- తాడిగపడకు వెళ్లే వంద అడుగుల రోడ్డులో 258 సెంటిమీటర్ల వెడల్పు, 18 సెంటిమీటర్ల ఎత్తులో వేగనిరోధకాన్ని వేశారు. తాడిగడప, పోరంకి, కంకిపాడు, ఉయ్యూరు వైపు నుంచి వచ్చేవారు రామవరప్పాడు, గుణదల, ఏలూరు రోడ్డు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, గూడవల్లి తదితర ప్రాంతాలకు అనునిత్యం అత్యధిక సంఖ్యలో రాకపోకలు కొనసాగిస్తుంటారు.

సాయిబాబా ఆలయం పక్క రోడ్డులోని కొమ్మా వెంకట సుబ్బారావు వీధిలో 20 అడుగుల దూరంలోనే రెండు వేగ నిరోధకాలు ఏర్పాటు చేశారు.


వేగ నిరోధకాలు వేయాలంటే...

* పాఠశాలలు, ప్రమాదాలు జరిగే కూడళ్ల వద్ద మాత్రమే అధికారుల అనుమతి తీసుకుని వేయాలి.

* వెడల్పు 2 మీటర్లు, ఎత్తు 10 సెంటిమీటర్లు ఉండాలి

* వాహనాలు దిగడానికి, ఎక్కడానికి అనుకూలంగా ఉండేలా వేయాలి. 

* వేగనిరోధకం ఉందని తెలియజేస్తూ 30 మీటర్లు ముందు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలి.

* రాత్రి సమయంలో వచ్చే వారికి తెలియజేసేలా వేగ నిరోధకంపై రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలి.


పరిశీలించి చర్యలు తీసుకుంటాం...

* విద్యాసంస్థలు మినహాయించి ఎక్కడా వేగ నిరోధకాలు వేయకూడదు. ప్రమాదాలు గుర్తించిన చోట మాత్రం నిబంధనలు ప్రకారమే వేయిస్తాం. మా అనుమతులు లేకుండానే వేస్తున్నారు.పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

-అక్కినేని వెంకటేశ్వరారవు, పీఆర్‌, ఈఈ  

* రహదారులు, వాహనాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని వేగ నిరోధకాలు వేస్తాం. వంద అడుగుల రోడ్డులో కొన్నేళ్ల క్రితమే వేశారు. ఇక్కడి సమస్య మా దృష్టికి రాలేదు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

- టి.అంజనేయులు, సీఆర్డీఏ చీఫ్‌ ఇంజినీర్‌

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని