Bengal: దీదీ కోసం.. ‘మాణికే మాగే హితే’లా ‘మా మాతి మానుష్‌ హితే’

మమతా బెనర్జీ ప్రముఖ నినాదమైన ‘మా మాతి మనుష్’(తల్లి, మాతృభూమి, మనుషులు) ఆధారంగా.....

Published : 23 Sep 2021 02:13 IST

కోల్‌కతా: కొద్ది నెలలుగా సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్న శ్రీలంక పాట ‘మాణికే మాగే హితే’కు భారత్‌లో అపూర్వ ఆదరణ లభించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పాటకు ఉన్న వ్యూస్‌ అంతా ఇంతా కాదు. ఈ ప్రణయ గీతం ఆధారంగా తెలుగుతో పాటు పలు భాషల్లో పాటలు వచ్చాయి. తాజాగా బెంగాలీలో ‘మా మాతి మనుష్‌ హితే’ అనే పాటను రచించారు. అయితే ఈ పాట పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి కోసం రచించడం విశేషం. బెంగాల్‌లోని మేదినిపుర్‌కు చెందిన తండ్రీకూతుళ్లు ఈ పాటను రచించారు. ఐదు రోజుల క్రితం విడుదల చేసిన ఈ గీతానికి మంచి ఆదరణ లభిస్తోంది.

మమతా బెనర్జీ ప్రముఖ నినాదమైన ‘మా మాతి మనుష్’(తల్లి, మాతృభూమి, మనుషులు) ఆధారంగా.. మేదినిపుర్‌కు చెందిన వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త రాజేశ్‌ చక్రవర్తితోపాటు ఆయన కుమార్తె అపరాజిత ఈ పాటను రచించారు. ప్రజల అభివృద్ధి కోసం మమతా బెనర్జీ చేస్తున్న కృషి, చేపడుతున్న ప్రాజెక్టులు సహా అనేక విషయాలను ఈ పాటలో ప్రస్తావించారు. ‘లక్ష్మీర్ భండార్’, ‘స్వస్థ్య సతి’ వంటి పథకాల గురించి ప్రస్తావించారు. దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యతలను సైతం దీదీ చేపట్టాలని ఆ గీతంలో పేర్కొన్నారు. ‘మమతా బెనర్జీ సామాన్య ప్రజల కోసం ఎన్నో గొప్ప పనులు చేశారు. చాలా పథకాలు తీసుకొచ్చారు. ఈ ప్రముఖ ట్యూన్ ద్వారా వాటిని ప్రజల ముందు ఉంచాలని భావించాం. ఈ పాటను ఆమెకు అంకితం చేస్తున్నాం’ అని రాజేష్ చక్రవర్తి వెల్లడించారు.

ఈ నెల 30న జరిగే భవానీపుర్‌ ఉప ఎన్నిక ముందు ఈ పాట విడుదల కావడం గమనార్హం. బెంగాల్‌లో గత ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) ఘన విజయం సాధించినప్పటికీ.. నందిగ్రామ్‌ నుంచి పోటీచేసిన దీదీ ఓడిపోయారు. ఈసారి భవానీపుర్‌ నుంచి పోటీ చేసి గెలుపొందాలని భావిస్తున్నారు. ఈ విజయంతో జాతీయ స్థాయిలోనూ కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని