Updated : 24/08/2021 15:18 IST

Houses For Sale At Rs 87: అక్కడ రూ.87కే ఇంటిని సొంతం చేసుకోవచ్చు!

మాయెంజా(ఇటలీ): రానురాను ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ పెరిగిపోతోంది. దీంతో గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. మారుమూల గ్రామాల్లో పుట్టినవాళ్లు కూడా పట్టణాల్లో స్థిరపడుతూ వారి స్వస్థలాలను మరిచిపోతున్నారు. ఇటలీలోనూ ప్రస్తుతం ఇదే జరుగుతోంది. దీంతో ప్రధాన ఆదాయ వనరు అయిన పర్యాటకం దెబ్బతింటోంది. లోయలు, కొండల్లో ఉన్న గ్రామాల అందాల్ని వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు అక్కడికి వెళుతుంటారు. ముఖ్యంగా రాజధాని రోమ్‌ నగరానికి సమీప గ్రామాలకు ఒకప్పుడు తాకిడి బాగా ఉండేది. కానీ, ప్రజలంతా నగరాలకు తరలుతుండడంతో గ్రామాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో గ్రామాలకు తిరిగి పునర్‌వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా తిరిగి గ్రామాలను ప్రజలతో నింపేందుకు ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే రూ.87లకే ఇళ్లు. 87 రూపాయలకు ఇళ్లేంటి.. సున్నాలు మిస్సై ఉంటాయనుకుంటున్నారా? కాదు.. ఒక్క యూరోకి ఇళ్లు విక్రయించడానికి సిద్ధమైంది ఇటలీ ప్రభుత్వం.

 

రోమ్‌ నగరానికి సమీపంలో ఉన్న మాయెంజా అనే చిన్న పట్టణం ఇప్పుడు ఖాళీ అయ్యింది. దీంతో ఇక్కడ ఒక్క యూరో(రూ.87)కే ఇళ్లు అమ్మాలని నిర్ణయించారు. విడతలవారీగా ఇళ్లను విక్రయానికి ఉంచనున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. తొలి విడతలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 28న ముగియనుంది. ఆయా ఇళ్ల యజమానులను సంప్రదించి వారి అనుమతితో వీటిని విక్రయానికి ఉంచుతున్నట్లు మాయెంజా మేయర్‌ క్లాడియో స్పెర్డుటి పేర్కొన్నారు. రోమ్‌కు 70 కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రాంతం మధ్యయుగం నాటి నుంచి ఉనికిలో ఉందని స్థానికులు తెలిపారు. చారిత్రకంగానూ ఈ పట్టణానికి ప్రాముఖ్యత ఉందన్నారు.

అయితే, ఇల్లు కొన్నవారు తప్పనిసరిగా దాన్ని మూడేళ్లలో మరమ్మతు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంటిని పునరుద్ధరించే వరకు ముందస్తుగా 5000 యూరోలు డిపాజిట్‌ చేయాలి. అలాగే కొన్నవారు కచ్చితంగా ఇంట్లో నివాసం ఉండాల్సిన అవసరం లేదు. అయితే, దాన్ని ఎలా ఉపయోగించుకోబోతున్నారో మాత్రం కచ్చితంగా స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేయాలి.

వాస్తవానికి ఇటలీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం మూడేళ్ల క్రితమే ప్రారంభమైంది. నిర్మానుష్యంగా మారిన గ్రామాల్లో ఒకటైన చింక్వా ఫ్రాండీలో ఖాళీగా ఉన్న ఇళ్లను స్వాధీనం చేసుకొని కేవలం ఒక్క అమెరికన్‌ డాలరుకే అప్పట్లో అమ్మకానికి పెట్టారు. అలాగే సిసీలియా గ్రామంలోనూ ఇదే తరహాలో ఒక్క యూరోకే ఇల్లు విక్రయించారు. ఆ గ్రామంలో ఒకప్పుడు భూకంపం సంభవించడంతో అందరూ సమీప నగరాలకు తరలివెళ్లిపోయారు. దీంతో గ్రామానికి పునర్‌వైభవం తీసుకురావాలని ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని