Omicron: అసత్య ప్రచారాలు నమ్మొద్దు: డీహెచ్‌ శ్రీనివాస్‌రావు

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల నమోదుపై అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) డాక్టర్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. భారత్‌లో ఇప్పటి వరకు ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాలేదని.. దక్షిణాఫ్రికా, బోట్స్‌వానాలో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో...

Updated : 30 Nov 2021 15:14 IST

హైదరాబాద్‌: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల నమోదుపై అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) డాక్టర్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. భారత్‌లో ఇప్పటి వరకు ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాలేదని.. దక్షిణాఫ్రికా, బోట్స్‌వానాలో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త రకమైన కేసులు వస్తే ప్రభుత్వమే నేరుగా ప్రకటిస్తుందని చెప్పారు. సోమవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించారన్నారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని డీహెచ్‌ తెలిపారు.

ఒమిక్రాన్‌ కేసుల నేపథ్యంలో 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు ఉన్నాయన్నారు. విదేశాల నుంచి వచ్చేవారిని నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పరీక్షల్లో పాజిటివ్‌ నిర్ధారణ అయినవారిని ఆస్పత్రికి తరలిస్తామన్నారు. ఒమిక్రాన్‌ కేసులు గుర్తించిన 12 దేశాల నుంచి 40 మందికి పైగా రాష్ట్రానికి వచ్చారని.. వారందరికీ నెగటివ్‌ రావడంతో హోం క్వారంటైన్‌కి పంపామని తెలిపారు. వారి ఆరోగ్యాన్ని 14 రోజులు గమనిస్తామని వివరించారు. ఒమిక్రాన్‌కు డెల్టా కంటే 6 శాతం వేగంగా వ్యాపిస్తున్నట్లు గుర్తించారని.. కానీ వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటోందన్నారు. ఎన్ని మ్యుటేషన్లు వచ్చినా కొవిడ్‌ నిబంధనలను పాటిస్తే మనల్ని మనం కాపాడుకోవచ్చన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు