Updated : 09/09/2020 10:05 IST

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలకు తాత్కాలిక బ్రేక్‌!

న్యూయార్క్‌: కొవిడ్‌ వ్యాక్సిన్‌ రేసులో ముందంజలో ఉన్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. బ్రిటన్‌లో ఈ టీకా వేయించుకున్న ఓ వాలంటీరుకు అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు సమాచారం. దీంతో తుది దశకు చేరుకున్న క్లినికల్‌ ట్రయల్స్‌ను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. ప్రయోగ ప్రామాణిక ప్రక్రియ ప్రకారం వ్యాక్సిన్‌ భద్రతపై మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆస్ట్రాజెనెకా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఆ వాలంటీర్‌కు తలెత్తిన అనారోగ్య సమస్యలేంటో మాత్రం వెల్లడించలేదు.

అయితే, వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఇలాంటి సమస్యలు తలెత్తడం సాధారణ విషయమేనని ఆస్ట్రాజెనెకా అధికార ప్రతినిధి తెలిపారు. ఇలా జరిగినప్పుడు మరోసారి లోతైన సమీక్ష నిర్వహించి.. తిరిగి ప్రయోగాల్ని కొనసాగిస్తుంటామన్నారు. ఇది సర్వసాధారణమైన విషయమేనని పేర్కొన్నారు. ట్రయల్స్‌లో ఎలాంటి లోపాలు ఉండొద్దనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని వివరించారు. ఇంత భారీ స్థాయిలో ట్రయల్స్‌ నిర్వహిస్తున్నప్పుడు ఒకరిద్దరిలో దుష్ప్రభావాలు తలెత్తడం సాధారణంగా జరగుతుంటుందన్నారు. తాజాగా తలెత్తిన సమస్యపై వీలైనంత త్వరగా సమీక్ష నిర్వహించి వ్యాక్సిన్‌ ప్రయోగాల్ని పునఃప్రారంభిస్తామన్నారు.

దీనిపై ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, శాస్త్రవేత్తలు స్పందించారు. జ్వరం, జలుబు వంటి సాధారణ సమస్యలు కాకుండా ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం ఏర్పడి ఉంటుందని వాషింగ్టన్‌ యూనివర్సిటీకి చెందిన డెబోరా ఫుల్లర్‌ అనే ప్రముఖ పరిశోధకుడు అభిప్రాయపడ్డారు. ఈయన కూడా మరో పద్ధతిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ప్రయోగాలు జరుపుతున్నారు. అయితే, దీనిపై పెద్దగా విచారించాల్సిన అవసరం ఏం లేదన్నారు. అసలు టీకా తీసుకున్న వారి శరీరం ఎలా స్పందిస్తోంది.. వారి ఆరోగ్యం ఎలా ఉంటోంది.. వంటి అంశాలపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఇలా తాత్కాలికంగా నిలిపివేసి ఉంటారని అభిప్రాయపడ్డారు.

కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన మరో పరిశోధకుడు ఏంజిలా రస్‌ముస్సేన్‌ స్పందిస్తూ.. వ్యాక్సిన్‌ వల్ల తలెత్తిన అనారోగ్యం అయి ఉండదని అంచనా వేశారు. ఏదేమైనా ఇలాంటి సమస్యల్ని ముందుగా గుర్తించడానికే క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తారని తెలిపారు. చివరి దశలో భాగంగా భారీ సంఖ్యలో వాలంటీర్లకు టీకా అందజేస్తారు. తద్వారా ప్రాథమిక దశల్లో పాల్గొన్న వారిలో కనిపించని దుష్ప్రభావాలేమైనా తలెత్తుతాయేమో పరిశీలిస్తారు. ప్రస్తుతం ఆస్ట్రాజెనెకా అమెరికాలో 30 వేల మంది వాలంటీర్లను ప్రయోగాల కోసం తీసుకుంది. వీరిలో దాదాపు మూడు వంతుల మందికి వ్యాక్సి్‌న్‌ అందజేసినట్లు సమాచారం. ఇంత భారీ మొత్తంలో టీకాను ప్రయోగించడం వల్ల ఫలితాలు మరింత కచ్చితంగా ఉంటాయని భావిస్తున్నారు.

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్‌తో పాటు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది వ్యాక్సిన్లు మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరుకున్నాయి. వీటిలో మోడెర్నా, ఫైజర్‌ సంస్థలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు కూడా చాలా అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌లో ఉన్నాయి. వ్యాక్సిన్‌ తయారీ, భద్రతలో ఎలాంటి రాజీ లేకుండా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందజేసేందుకు కృషి చేయాలని పలు సంస్థలు ఏకగ్రీవంగా తీర్మానించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని