వ్యాక్సిన్‌పై ఆశలు పెంచుతున్న ఫైజర్‌ ప్రకటన!

కరోనా వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా ప్రజావినియోగానికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అనేక సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్‌ ఆసక్తికర ప్రకటన చేసింది..........

Published : 04 Sep 2020 12:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా ప్రజావినియోగానికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అనేక సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్‌ ఆసక్తికర ప్రకటన చేసింది. వచ్చే నెల చివరి నాటికి తమ సంస్థ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ సామర్థ్యం తెలిసిపోతుందని తెలిపింది. కరోనాను అడ్డుకునేందుకు ఈ వ్యాక్సిన్‌ ఉపయోగపడుతుందని నిర్ధారణ అయిన వెంటనే అత్యవసర వినియోగం కింద అనుమతులకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ)కు దరఖాస్తు చేసుకుంటామని స్పష్టం చేసింది.

23000 మంది వాలంటీర్లపై ప్రయోగాలు..

జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ అనే సంస్థతో కలిసి ఫైజర్‌ కంపెనీ కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. తొలి రెండు దశల్లో ఆశాజనక ఫలితాలివ్వడంతో ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. మూడో దశలో 23,000 మంది వాలంటీర్లు ప్రయోగాలకు ముందుకు వచ్చారని సంస్థ సీఈవో ఆల్బర్ట్‌ బోర్లా తెలిపారు. వీరిలో చాలా మందికి రెండో డోసు కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. అక్టోబర్‌ చివరి నాటికి వ్యాక్సిన్‌ సామర్థ్యం ఏంటో తేలిపోయే అవకాశం ఉందన్నారు. టీకా సమర్థంగా పనిచేస్తుందని తేలిన వెంటనే అత్యవసర అనుమతుల కింద ప్రజావినియోగానికి అందుబాటులోకి తెచ్చేందుకు దరఖాస్తు చేసుకుంటామన్నారు.

మూడో దశ ముగియకున్నా..

మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి స్థాయిలో ముగియనప్పటికీ.. ప్రాథమిక ఫలితాలను బట్టి వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతులు జారీ చేస్తామని ఎఫ్‌డీఏ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. దీంతో వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకుంటామని ప్రకటించిన తొలి సంస్థ ఫైజరే కావడం విశేషం. సంస్థ తాజా ప్రకటనతో వ్యాక్సిన్‌ ఈ ఏడాదిలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్న ఆశలు రేకెత్తుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చే ఏడాది ఆరంభంలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడ్డాయి.

ఆశలు రేకెత్తిస్తున్న ప్రకటనలు.. 

నవంబరు 1 నాటికి వ్యాక్సిన్‌ పంపిణీకి సిద్ధంగా ఉండాలంటూ అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్‌.. అధ్యక్ష ఎన్నికలకు ముందే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అనుకున్న సమయం కంటే ముందే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రాథమిక ఫలితాలను బట్టి రిస్క్‌తో కూడిన అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వొచ్చని ఆయన పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. 

వివిధ దశల్లో వ్యాక్సిన్లు..

ఫైజర్‌ తాజా ప్రకటనతో ఇతర సంస్థలు కూడా వ్యాక్సిన్‌ అభివృద్ధిని వేగవంతం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుడుతున్నారు. మోడెర్నా సహా ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి ఆస్ట్రాజెనెకా తయారు చేస్తున్న వ్యాక్సిన్లు కూడా మూడో దశలో ఉన్నాయి. దాదాపు ఫైజర్‌ వ్యాక్సిన్‌ ఉన్న దశలోనే అవి కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు 175 రకాల కరోనా వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉండగా.. వీటిలో 34 క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరుకున్నాయి. వీటిలో ఎనిమిది మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నాయి. ఇక భారత్‌లో మొత్తం 8 రకాల కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధి జరుగుతుండగా.. వీటిలో రెండు రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరుకున్నాయి. 

ఇవీ చదవండి...

కరోనాను దీటుగా అడ్డుకునే కొత్త వ్యాక్సిన్‌!

కరోనా విలయం.. ఒకేరోజు 1096 మంది మృతి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని