Updated : 13/05/2021 10:13 IST

Temple mount: ఇజ్రాయెల్‌-పాలస్తీనా ఘర్షణ వెనక..

పాలస్తీనా-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రెండువైపులా రాకెట్లతో దాడులు జరుగుతున్నాయి. ఇది చినికిచినికి పూర్తిస్థాయి యుద్ధంగా మారుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇంతకూ... ఉన్నట్టుండి ఎందుకీ గొడవ? దేనికోసమీ యుద్ధ వాతావరణం..?
గొడవ ఎక్కడ? 
జెరూసలెంలోని అల్‌-అఖ్సా మసీదు ప్రాంగణంలో కొద్దిరోజుల కిందట పాలస్తీనా, ఇజ్రాయెల్‌ భధ్రతా దళాల మధ్య ఘర్షణతో ఈ గొడవ అందరి దృష్టిని ఆకర్షించింది. ఘర్షణంతా ఈ మసీదు, ప్రాంగణం గురించే! ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్లు, ముస్లింలు, యూదులు అత్యంత పవిత్రంగా భావించే పాత జెరూసలెంలో ఉంటుందీ అల్‌-అఖ్సా మసీదు. మూడు మతాలకూ అత్యంత కీలకమైంది కాబట్టే జెరూసలెం పాతబస్తీని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి, ప్రత్యేక రక్షణ కల్పించింది. 
ఏంటీ అల్‌-అఖ్సా? 
• అల్‌-అఖ్సా మసీదు ఇస్లాం మతస్థులకు అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఒకటి! సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ మసీదు, ప్రాంగణాన్ని ముస్లింలు హరామ్‌ అల్‌-షరీఫ్‌ (పవిత్ర స్థలం) అని పిలుచుకుంటారు. యూదులు ఈ ప్రాంతాన్ని టెంపుల్‌ మౌంట్‌ (ఒకప్పుడు కొండగా ఉండేది)గా భావిస్తారు. ఇస్లామిక్‌ నమ్మకాల ప్రకారం... మహమ్మద్‌ ప్రవక్త మక్కా నుంచి ఒక రాత్రి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత స్వర్గారోహణం చేశారంటారు. సుమారు 5వేల మంది ఒకేసారి ప్రార్థనలు చేసుకోవటానికి వీలైన ఈ మసీదును ఎనిమిదో శతాబ్దంలో నిర్మించారు. బంగారు పూతతో కూడిన రాతిచిప్పలాంటి కప్పు దీని ప్రత్యేకత. మసీదు, దాని ప్రాంగణమంతా పవిత్రమైందని భావిస్తూ... సెలవు రోజుల్లో భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడ ప్రార్థనలు చేస్తుంటారు.
మరి యూదులకేంటి? 
• యూదులకు టెంపుల్‌మౌంట్‌ అత్యంత పవిత్ర స్థలం. ఎందుకంటే ఒకప్పటి ఈ కొండపై రెండు పురాతన యూదు దేవాలయాలుండేవి. మొదటిదేమో బైబిల్‌ ప్రకారం- కింగ్‌ సాల్మన్‌ నిర్మించింది. ఆ తర్వాత బాబిలోనియన్లు దాన్ని కూలగొట్టారు. రెండోది నిర్మితమై, 600 సంవత్సరాలున్న తర్వాత.. తొలి శతాబ్దిలో రోమన్‌ చక్రవర్తి చేతిలో ధ్వంసమైంది. మెస్సయ్య తిరిగి వచ్చాక ఇక్కడే మళ్లీ దేవాలయం కడతారని... ఇక్కడింకా దైవశక్తి ఉందని యూదుల నమ్మకం.
యూదుల స్వాధీనంలో...   జోర్డాన్‌ నిర్వహణలో! 
• 1967లో జరిగిన అరబ్‌-ఇజ్రాయెల్‌ యుద్దంలో తూర్పు జెరూసలెంను జోర్డాన్‌ నుంచి ఇజ్రాయెల్‌ ఆక్రమించుకుంది. ఈ ప్రాంతంలోనే జెరూసలెం పాతబస్తీ కూడా భాగం. ఆ తర్వాత జెరూసలెంను తమ రాజధానిగా ఇజ్రాయెల్‌ ప్రకటించుకుంది. 1990లో కొంతమంది యూదు అతివాదులు కూల్చిన తమ దేవాలయాలను పునర్‌నిర్మించే ప్రక్రియలో భాగంగా శంకుస్థాపన చేయటానికి ప్రయత్నించటంతో గొడవలు తీవ్రమయ్యాయి. 1994లో జోర్డాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఓ శాంతి ఒప్పందం జరిగింది. దానిప్రకారం అల్‌-అఖ్సా మసీదు విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలనుకున్నారు. జోర్డాన్‌ అధీనంలోని వక్ఫ్‌ అనే ఇస్లామిక్‌ ట్రస్టు మసీదు నిర్వహణను చూస్తోంది. ఇజ్రాయెల్‌ భద్రతా బలగాలు ఆ ప్రాంగణంలోనే ఉంటూ... వక్ఫ్‌ ట్రస్ట్‌తో సమన్వయం చేసుకుంటుంటారు. అయితే ఒప్పందంలో భాగంగా ప్రార్థనలకు ముస్లింలను అనుమతించినట్లు యూదులు, క్రిస్టియన్లను అనుమతించరు. వారు కేవలం ఈ స్థలాన్ని సందర్శించి వెళ్లటానికి మాత్రమే అనుమతి ఉంది. (రాతికప్పు కింద పశ్చిమ భాగంలోని గోడ వద్ద యూదులు ప్రార్థనలు చేస్తారు. ఈ గోడ ఒకప్పుడు టెంపుల్‌మౌంట్‌లో భాగంగా ఉండేదని వారి నమ్మకం.) 
అనుమతుల్లో వివక్షంటూ... 
• ముస్లిమేతరులను ప్రార్థనలకు అనుమతించకుండా వివక్ష చూపుతున్నారంటూ చాలాకాలంగా సాగుతున్న వివాదం.. చినికిచినికి గాలివానగా మారింది. ఇటీవలే ఇజ్రాయెల్‌ ‘జెరూసలెం డే’ అంటూ నిర్వహించిన సంబరాలు ఈ ఘర్షణలకు ఆజ్యం పోశాయి. జెరూసలెం పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌ అధికారికంగా జెరూసలెం డేను నిర్వహించింది. తద్వారా తూర్పు జెరూసలెంలో నివసిస్తున్న పాలస్తీనా వాసులను రెచ్చగొట్టినట్లైంది. అధికారికంగా ఇజ్రాయెల్‌ ప్రభుత్వం యధాతథ స్థితిని (ముస్లిమేతరులకు ప్రార్థనలకు అంగీకరించరు) కొనసాగిస్తామని ప్రకటించినా... ఇజ్రాయెల్‌లోని అనేక మతసంస్థలు తమకూ ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో భారీసంఖ్యలో యూదులు ఈ ప్రాంతానికి వస్తుండటంపై జోర్డాన్‌ అధికారికంగా ఇజ్రాయెల్‌కు ఫిర్యాదు కూడా చేసింది. కొద్దివారాల కిందట జెరూసలెం పాతబస్తీలో యూదులు, పాలస్తీనీయుల మధ్య గొడవలు చెలరేగాయి. కొంతమంది పాలస్తీనీయులు యూదులపై దాడి చేశారు. ఫలితంగా... అతివాద యూదులు ఆగ్రహంతో వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ గొడవల నేపథ్యంలో పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో రంజాన్‌ ప్రార్థనలను కూడా ఇజ్రాయెల్‌ పోలీసులు నిషేధించారు. దీంతోపాటు... తూర్పు జెరూసలెంలోని కొన్ని ప్రాంతాల నుంచి పాలస్తీనీయులను ఖాళీ చేయించటానికి ఇజ్రాయెల్‌ బలగాలు ప్రయత్నించటంతో ఘర్షణలు తీవ్రమయ్యాయి. తమను ఖాళీ చేయించి యూదు నివాసాలు ఏర్పాటు చేయజూస్తున్నారనేది పాలస్తీనీయుల ఆరోపణ. వీటన్నింటి నేపథ్యంలో జెరూసలెం డేను ఇజ్రాయెల్‌ నిర్వహించటంతో ఘర్షణలు చెలరేగాయి. అల్‌-అఖ్సా మసీదు ప్రాంగణంలో ఇజ్రాయెల్‌ బలగాలతో పాలస్తీనీయులు గొడవకు దిగటంతో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. - ఈనాడు ప్రత్యేక విభాగం  

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని