Anand Mahindra: మహీంద్రా షోరూంలో రైతుకు అవమానం.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..?

కర్ణాటకలో కారు కొనేందుకు మహీంద్రా షోరూంకు వెళ్లిన రైతుకు అవమానం జరిగిన ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆ సంస్థ ఛైర్మన్‌ ఆనంద్ మహీంద్రా స్పందించారు.

Updated : 26 Jan 2022 05:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కర్ణాటకలో కారు కొనేందుకు మహీంద్రా షోరూంకు వెళ్లిన రైతుకు అవమానం జరిగిన ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆ సంస్థ ఛైర్మన్‌ ఆనంద్ మహీంద్రా స్పందించారు. కస్టమర్లకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కిచెప్పారు. బాధ్యులపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామన్నారు. అసలేం జరిగిందంటే..

కర్ణాటకకు చెందిన కెంపెగౌడ అనే రైతు బొలెరో పికప్‌ ట్రక్‌ కొనుగోలు చేసేందుకు గత శుక్రవారం తమకూరులోని మహీంద్రా షోరూంకు వెళ్లగా.. అక్కడున్న సేల్స్‌మెన్‌ ఆయనను అవమానించారు. రైతు వేషధారణ చూసి.. ‘కారు ధర రూ.10లక్షలు.. నీ వద్ద 10 రూపాయలు కూడా ఉండవు’’ అంటూ హేళనగా మాట్లాడాడు. దీంతో ఆగ్రహానికి గురైన కెంపెగౌడ.. గంటలో రూ.10లక్షలతో వస్తానని, వెంటనే వాహనాన్ని డెలివరీ చేయగలరా? అంటూ సవాల్‌ విసిరారు.

అన్నట్లుగానే గంటలో మొత్తం డబ్బుతో ఆ రైతు షోరూంకు వచ్చారు. అయితే కంగుతిన్న ఆ సేల్స్‌మెన్‌ కారు వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉందని, వాహనాన్ని తక్షణమే డెలివరీ చేయలేమని చెప్పాడు. దీంతో తనకు క్షమాపణలు చెప్పాలని కెంపెగౌడ డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే పోలీసులు రంగంలోకి దిగి సేల్స్‌మెన్‌తో రైతుకు క్షమాపణలు చెప్పించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేశారు. 

దీనిపై ఆనంద్‌ మహీంద్రా నేడు ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘మా కంపెనీ ప్రధాన ఉద్దేశం.. అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేయడమే. వ్యక్తుల మర్యాదను కాపాడటం మా ప్రధానమైన నైతిక విలువ. ఈ సిద్ధాంతాన్ని ఎవరు అతిక్రమించినా.. వారిపై తక్షణమే చర్యలు ఉంటాయి’’ అని మహీంద్రా వెల్లడించారు. అటు మహీంద్రా ప్రతినిధులు కూడా దీనిపై స్పందించారు. కస్టమర్లను గౌరవిస్తూ.. వారికి ఉత్తమ సేవలు అందించాల్సిన బాధ్యత డీలర్లపై ఉందన్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని