Covid Cases: ఆరు కేసులు.. ఆంక్షల గుప్పిట్లో బీజింగ్‌!

కరోనా కట్టడి విషయంలో చైనా ప్రభుత్వం మొదటినుంచి కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. స్వల్ప సంఖ్యలో కేసులు బయటపడినా.. భారీ ఎత్తున పరీక్షలు నిర్వహిస్తూ, వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు యత్నిస్తోంది. తాజాగా రాజధాని నగరం బీజింగ్‌లో ఆయా...

Published : 11 Nov 2021 18:30 IST

బీజింగ్‌: కరోనా కట్టడి విషయంలో చైనా ప్రభుత్వం మొదటినుంచి కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. స్వల్ప సంఖ్యలో కేసులు బయటపడినా.. భారీ ఎత్తున పరీక్షలు నిర్వహిస్తూ, వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు యత్నిస్తోంది. తాజాగా రాజధాని నగరం బీజింగ్‌లో ఆయా కాన్ఫరెన్స్‌లకు హాజరైన వ్యక్తులతోసహా మొత్తం ఆరుగురికి పాజిటివ్‌గా తేలడంతో.. మొత్తం నగరవ్యాప్తంగా సమావేశాలు, ఈవెంట్‌లపై ఆంక్షలు విధించింది. ఇక్కడి చాయాంగ్, హైడియన్‌ ప్రాంతాల్లో గురువారం ఈ కేసులు బయటపడ్డాయి. దీంతో సంబంధిత పాజిటివ్‌ రోగులతో క్లోజ్‌గా కాంటాక్ట్‌ అయిన 280 మందితోపాటు రెండు చోట్ల దాదాపు 12 వేల మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ వ్యవహారం చాలామందితో ముడిపడి ఉన్న నేపథ్యంలో నియంత్రణ చాలా కష్టమని నగర ప్రభుత్వ ప్రతినిధి జు హెజియాన్ అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరగా కట్టడి అవసరమని తెలిపారు.

డోంగ్‌చెంగ్‌లో మాల్‌ మూసివేత..

మరోవైపు కొంతమంది ఉద్యోగులకు పాజిటివ్‌గా తేలడంతో చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్(సీఎన్‌పీసీ) సైతం బీజింగ్‌లోని తన కార్యాలయ భవనాన్ని మూసివేసింది. దీంతోపాటు కొవిడ్‌ సోకిన వ్యక్తితో కలిసి తిరిగిన ఒకరు వచ్చినట్లు తేలడంతో.. డోంగ్‌చెంగ్‌లోని రాఫెల్స్ సిటీ మాల్‌ను మూసివేశారు. లోపల ఉన్న సిబ్బంది, వినియోగదారులను పరీక్షించాకే బయటకు పంపించారు. ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్‌కు బీజింగ్‌ నగరం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాన్ఫరెన్స్‌లను ఆన్‌లైన్‌ వేదికల ద్వారానే నిర్వహించాలని, ఆఫ్‌లైన్ ఈవెంట్‌లకు తక్కువమందిని అనుమతించాలని బీజింగ్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ వైస్ డైరెక్టర్ పాంగ్ జింగ్‌హువో పేర్కొన్నారు. హాజరైన వారినీ క్లోజ్డ్‌ లూప్‌లో ఉంచాలని, ప్రజారవాణా వినియోగించుకోకుండా కట్టడి చేయాలని చెప్పారు. కమ్యూనిస్ట్‌ పార్టీ అగ్రనేతల ఉన్నతస్థాయి సమావేశాలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో బీజింగ్‌లో ఒక్కసారిగా కేసుల కలవరం మొదలుకావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని