Navjot Singh Sidhu: ఇమ్రాన్‌ఖాన్‌ ‘పెద్దన్న’.. సిద్ధూ వ్యాఖ్యలపై దుమారం

పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ మరోసారి వివాదాల్లోకెక్కారు. పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ తనకు ‘పెద్దన్న’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారానికి

Updated : 20 Nov 2021 17:48 IST

దిల్లీ: పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ తనకు ‘పెద్దన్న’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి. దీనిపై భాజపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..

భారత్, పాకిస్థాన్‌ నడుమ కర్తార్‌పూర్‌ నడవాను ఇటీవల తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో పంజాబ్‌ నుంచి పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు, భక్తులు  పాకిస్థాన్‌లోని పవిత్ర దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాను సందర్శించుకుంటున్నారు. సిద్ధూ కూడా నేడు ఈ గురద్వారాకు వెళ్లగా.. అక్కడ పాక్‌ అధికారి ఒకరు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆ అధికారిని ఆలింగనం చేసుకున్న సిద్ధూ.. ఇమ్రాన్‌ ఖాన్‌ తనకు ‘బడా భాయ్‌(పెద్దన్న)’ అని, ఆయనను ఎంతోగానే ప్రేమిస్తున్నానని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియో కాస్త వివాదానికి తెరలేపింది. భాజపా ఐటీ విభాగం హెడ్‌ అమిత్‌ మాల్వియా ఈ వీడియోను ట్వీట్ చేస్తూ.. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘రాహుల్‌కు ఎంతో ఇష్టమైన నవజోత్‌ సింగ్‌ సిద్ధూ.. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను బడా భాయ్‌ అని అన్నారు. గతంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ను సిద్ధూ ఆలింగనం చేసుకుని ప్రశంసలు కురిపించారు. అమరీందర్‌ సింగ్‌ను కాదని పాక్‌పై ప్రేమ చూపించే సిద్ధూను గాంధీ కుటుంబం ఎంచుకోవడంలో ఆశ్చర్యమేముంది’’ అంటూ మాల్వియా దుయ్యబట్టారు.

అటు భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల సల్మాన్‌ ఖుర్షీద్‌ తన పుస్తకంలో రాసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ప్రతిపక్ష పార్టీలో హిందుత్వంలో ఉగ్రవాద సంస్థలు, ఖాన్‌లలో భాయి జాన్‌లు కన్పిస్తున్నారని మండిపడ్డారు. ‘‘పాకిస్థాన్‌ను పొగిడితే ఆనందపడేవారు భారత్‌లో ఇంకా ఉన్నారని కాంగ్రెస్ నమ్ముతోంది. కానీ మన దేశంలో అలాంటి వారెవరూ లేరు. సిద్ధూలాంటి వ్యక్తులకు భారత్‌లో స్థానం లేదు. పంజాబ్‌కు ఆయన కంటే మంచి నేత లభిస్తారు’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని