Diabetes: బీపీ మందులతో మధుమేహం నుంచీ రక్షణ!

అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? బీపీ మందులు వాడాలని వైద్యులు సూచించినా, అశ్రద్ధ చేస్తున్నారా?

Published : 13 Nov 2021 10:44 IST

లండన్‌: అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? బీపీ మందులు వాడాలని వైద్యులు సూచించినా, అశ్రద్ధ చేస్తున్నారా? అయితే మరోసారి ఆలోచించండి. అధిక రక్తపోటును నియంత్రించేందుకు వాడే ఔషధాలు... భవిష్యత్తులో మధుమేహం తలెత్తకుండా రక్షణ కల్పిస్తాయని పరిశోధకులు గుర్తించారు. హైబీపీ కారణంగా పక్షవాతం, గుండెపోటు తలెత్తే ముప్పు ఉంటుంది. బీపీ నియంత్రణకు ఔషధాలను వాడటం వల్ల ఈ ఇబ్బందులు చాలామటుకు దూరమవుతాయి. అధిక రక్తపోటు మధుమేహానికి దారితీసే పరిస్థితి ఉన్నందున... బీపీ మందులతో ఈ సమస్య తగ్గుతుందా? అన్న అంశంపై ఇప్పటివరకూ నిగూఢ పరిశోధనలేవీ జరగలేదు. దీంతో ఈ అంశంపై ఆక్స్‌ఫర్డ్, బ్రిస్టల్‌ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు, బ్రిటిష్‌ హార్ట్‌ ఫౌండేషన్‌ పరిశోధకులు భారీ అధ్యయనమే చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ క్లినికల్‌ పరీక్షల్లో పాల్గొన్న 1,45,000 మంది ఆరోగ్య వివరాలను సేకరించారు. వీరి ఆరోగ్య పరిస్థితులను 4.5 సంవత్సరాల పాటు ఎప్పటికప్పుడు గమనిస్తూ, విశ్లేషిస్తూ వచ్చారు. సిస్టాలిక్‌ రక్తపోటు 5 ఎంఎంహెచ్‌జీ (మిల్లీమీటర్‌ హై) మేర తగ్గితే... టైప్‌-2 మధుమేహం ముప్పు 11% తగ్గుతుందని గుర్తించారు. జీవనశైలి మార్పులు, రక్తపోటు నియంత్రణ ఔషధాలతో ఈ లక్ష్యాన్ని సులభంగానే సాధించవచ్చని వారు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ద లాన్సెట్‌ పత్రిక అందించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని