Republic Day: శకటాల తిరస్కరణతో.. కేంద్రానికి సంబంధం లేదు

రానున్న గణతంత్ర వేడుకల్లో కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ ప్రతిపాదించిన శకటాలను తిరస్కరించడంలో కేంద్రం పాత్రేమీ లేదని కేంద్ర ప్రభుత్వ 

Updated : 18 Jan 2022 10:59 IST

 మనోభావాలంటూ సీఎంలు అనడం సరికాదు
  కేంద్ర ప్రభుత్వ వర్గాల స్పష్టీకరణ

దిల్లీ/కోల్‌కత/చెన్నై: రానున్న గణతంత్ర వేడుకల్లో కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ ప్రతిపాదించిన శకటాలను తిరస్కరించడంలో కేంద్రం పాత్రేమీ లేదని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. ఏయే శకటాలను అనుమతించాలో నిపుణుల కమిటీనే నిర్ణయిస్తుందని, ఇందులో ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేశాయి. నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఆయన నెలకొల్పిన ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీని గుర్తుచేసేలా శకటాన్ని రూపొందించామని, దీన్ని కేంద్రం తిరస్కరించడంతో బెంగాల్‌ ప్రజల మనోభావాలను దెబ్బతిన్నాయంటూ రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆమె బాటలోనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సైతం సోమవారం ప్రధానికి లేఖ రాశారు. కేరళ నేతలు కూడా తమ రాష్ట్రాన్ని అవమానించారంటూ కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ‘‘సాధారణ విషయాన్ని ప్రజల మనోభావాల సమస్యగా మఖ్యమంత్రులే చిత్రీకరించడం.. కేంద్రం, రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టిస్తుంది. దీర్ఘకాలంలో సమాఖ్య వ్యవస్థకు చేటు చేస్తుంది’’ అని పేర్కొన్నాయి. గణతంత్ర ఉత్సవాలకు రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి ఈసారి మొత్తం 56 ప్రతిపాదనలు రాగా, అందులో 21 నమూనాలనే ఎంపిక చేసినట్టు వివరించాయి. గణతంత్ర పరేడ్‌లో సమయాభావం కారణంగా. ఏటా ఆమోదించే శకటాల కంటే తిరస్కరించేవే ఎక్కువ ఉంటాయని రక్షణ మంత్రిత్వ శాఖ కూడా వివరణ ఇచ్చింది.

* మరోవైపు బెంగాల్‌ భాజపా సీనియర్‌ నాయకుడు తథాగత రాయ్‌.. తమ రాష్ట్ర శకటాన్ని గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించాలంటూ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. శకటం విషయంలో మమత అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. 

రాజకీయ కారణాలే!

ఈ వివాదంపై జర్మనీలో ఉంటున్న నేతాజీ కుమార్తె అనితా బోస్‌ స్పందించారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా జరుగుతున్న గణతంత్ర ఉత్సవాల్లో ఆయన గుర్తుగా రూపొందించిన శకటం లేకపోవడం వింతగా ఉందన్నారు. ఇందులో రాజకీయ కారణాలు లేకపోలేదంటూ పెదవివిరిచారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని