Gaza: హమాస్‌ నేతలు, సొరంగాలే లక్ష్యంగా

గాజాపై సోమవారం కూడా ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు కొనసాగాయి. హమాస్‌ నాయకులు, వారి స్థావరాలపై 54 ఇజ్రాయెల్‌ విమానాలు విరుచుకుపడ్డాయి. 15 కిలోమీటర్ల మేర సొరంగాలను ధ్వంసం చేశాయి. వీటి ద్వారానే హమాస్‌ తన బలగాలను, పరికరాలను ఒక చోటు

Updated : 18 May 2021 08:08 IST

గాజాపై కొనసాగిన ఇజ్రాయెల్‌ దాడులు

గాజాసిటీ: గాజాపై సోమవారం కూడా ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు కొనసాగాయి. హమాస్‌ నాయకులు, వారి స్థావరాలపై 54 ఇజ్రాయెల్‌ విమానాలు విరుచుకుపడ్డాయి. 15 కిలోమీటర్ల మేర సొరంగాలను ధ్వంసం చేశాయి. వీటి ద్వారానే హమాస్‌ తన బలగాలను, పరికరాలను ఒక చోటు నుంచి ఇంకో చోటుకు తరలిస్తోంది. హమాస్‌కు చెందిన 9 మంది కమాండర్ల ఇళ్లను కూడా విమానాలు నేలమట్టం చేశాయి. తాజా దాడుల్లో రాకెట్‌ దాడులకు కారణమైన కీలక హమాస్‌ నేతను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. సాధారణ పౌరులెవరూ మృతి చెందినట్లు ఇప్పటివరకు గాజా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించలేదు. ఇప్పటివరకు 3,100 రాకెట్లను ప్రయోగించింది. వీటిలో చాలావరకు  ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థ మధ్యలోనే అడ్డుకుంది.

గాజా అతలాకుతలం
ఇజ్రాయెల్‌ దాడులు గాజా ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎత్తైన భవనాలతో పాటు వరుస దాడులతో రోడ్లు, సదుపాయాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గాయపడిన వ్యక్తులతో ఆసుపత్రులు నిండిపోయాయి. కొంతమందిని అంబులెన్సుల్లో పొరుగునున్న ఈజిప్ట్‌కు తరలిస్తున్నారు. గాజా ప్రాంతంలో విద్యుత్‌ కేంద్రానికి ఇంధన సరఫరా ఆగిపోయింది. ప్రస్తుతం రెండు మూడు రోజులకు సరిపోయే ఇంధనమేఉందని అధికారులు తెలిపారు. ‘‘ఇలాగే దాడులు కొనసాగితే పరిస్థితులు దారుణంగా మారే ప్రమాదం ఉంది’’ అని గాజా మేయర్‌ యాహ్యా సరాజ్‌ తెలిపారు. గాజా, ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 200 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. గాజా దాడుల్లో.. ఇజ్రాయెల్‌కు చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఎలాంటి ప్రకటన లేకుండానే..
ఇజ్రాయెల్‌కు తమ సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని ఇప్పటికే ప్రకటించిన అమెరికా.. అందుకు అనుగుణంగానే ఆదివారం ఐరాస భద్రతా మండలి సమావేశంలో వ్యవహరించింది. దీంతో ఎలాంటి సంయుక్త ప్రకటన లేకుండానే సమావేశం ముగిసింది. ప్రకటనను అమెరికా అడ్డుకుందని చైనా పేర్కొంది. పరిస్థితులు సద్దుమణిగేందుకు, అమెరికా తన బాధ్యత నిర్వర్తించాలని, భద్రతా మండలికి మద్దతు ఇవ్వాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్‌ కోరారు. ఇజ్రాయెల్‌ సంయమనం పాటించాలని, దాడులు చేయడం ఆపాలని చైనా స్పష్టం చేసింది.  అగ్రరాజ్యం మాత్రం.. తాము దౌత్యమార్గాలో కాల్పుల విరమణకు కృషి చేస్తున్నామని పేర్కొంది.  సమావేశంలో ఐరాస సెక్రటరీ జనరల్‌ గుటెరస్‌.. ఇజ్రాయెల్‌, గాజాలో జరుగుతున్న రక్తపాతంపై విచారం వ్యక్తం చేశారు. తక్షణం ఇరువర్గాలు దాడులు ఆపాలని కోరారు. ఇజ్రాయెల్‌ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్‌ అల్‌ మల్కీ ఆరోపించారు. గాజాలోని సాధారణ పౌరులను మానవ కవచాలుగా వాడుకొని హమాస్‌ దాడులు చేస్తోందని ఇజ్రాయెల్‌ ప్రతినిధి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని