ఇంటినే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చిన మంత్రి! 

కరోనా సెకండ్‌ వేవ్‌తో కర్ణాటక విలవిలలాడుతోంది. ఆస్పత్రుల్లో బెడ్‌లు.. ఆక్సిజన్‌ కొరతతో రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో కర్ణాటక హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మై .....

Published : 14 May 2021 21:30 IST

బెంగళూరు: కరోనా సెకండ్‌ వేవ్‌తో కర్ణాటక విలవిలలాడుతోంది. ఆస్పత్రుల్లో బెడ్‌లు.. ఆక్సిజన్‌ కొరతతో రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో కర్ణాటక హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మై తన ఇంటినే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చి గొప్ప ఉదారతను చాటుకున్నారు. హవేరి జిల్లా శిగ్గవిలో తన ఇంటిని 50మంది రోగులకు సరిపడేలా బెడ్‌లను ఏర్పాటు చేసినట్టు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. శిగ్గవి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి.. అక్కడ పలువురు వైద్యులు, వైద్య సిబ్బందిని కూడా నియమించినట్టు తెలిపింది. ఇంటి పరిసరాల్లోని వరాండాలో 50 పడకలు ఏర్పాటు చేశారని, శ్వాస తీసుకొనేందుకు ఇబ్బందులు పడే రోగుల కోసం ఆక్సిజన్‌ కాన్స్‌ంట్రేటర్లు కూడా అందుబాటులో ఉంచాలని మంత్రి భావిస్తున్నారని కార్యాలయం తెలిపింది. రాష్ట్రంలో ఒక మంత్రి నివాసాన్ని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చడం ఇదే తొలిసారి అని పేర్కొంది. ఈ సెంటర్‌ ఏర్పాటుతో నియోజకవర్గంలోని తాలుకా ఆస్పత్రిపై భారం కొంత వరకు తగ్గుతుందని తెలిపింది. 

కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఆర్‌ బొమ్మై తనయుడైన బసవరాజ్‌ బొమ్మై, ఆయన కుటుంబ ఎక్కువగా బెంగళూరు లేదా హుబ్లీలోనే నివాసం ఉంటారు. నియోజకవర్గాన్ని సందర్శించే సమయంలో మాత్రమే శిగ్గవిలో బసచేస్తారని హోంమంత్రి కార్యాలయం తెలిపింది.

మరోవైపు, కర్ణాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ సవాడీ కూడా ఈ సంక్షోభ సమయంలో తన వంతు సహకారం అందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. బెళగావి జిల్లాలోని అఠానీలో 50 పడకలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయించారు. ఇందుకోసం ఆయన వ్యక్తిగతంగా రూ.50లక్షలు ఇచ్చారని ఆయన కార్యాలయం వెల్లడించింది. కిట్టూర్‌ రాణి చెన్నమ్మ హాస్టల్‌లో దీన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని