Mask: 2 డోసులు తీసుకున్నా ధరించాల్సిందే

కొత్తగా పుట్టుకొస్తున్న కరోనా వైరస్‌ వేరియంట్లపై ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు ఏమేర పనిచేస్తాయన్న దానిపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌....

Updated : 15 May 2021 14:04 IST

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా

దిల్లీ: కొత్తగా పుట్టుకొస్తున్న కరోనా వైరస్‌ వేరియంట్లను ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు ఏమేర ఎదుర్కొంటాయన్న దానిపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా కీలక సూచన చేశారు. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. మాస్కులు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే భౌతిక దూరం సైతం పాటించాలన్నారు. వైరస్‌ రోజురోజుకీ కొత్తరూపు సంతరించుకుంటున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నారు. కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ల సామర్థ్యం ఎంత అన్నది ఇంకా తెలియదన్నారు. అయితే, ఏ వేరియంట్‌ బారి నుంచైనా మాస్కు, భౌతిక దూరం రక్షిస్తాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు. 

అలాగే టీకా తీసుకున్నవారు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదన్న అంశాన్ని ఇప్పుడప్పుడే మార్గదర్శకాల్లో చేర్చబోమని కేంద్ర ఆరోగ్య శాఖలోని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం  తొందరపాటు అవుతుందన్నారు. ఇంకా వైరస్‌ వ్యాప్తి ఆందోళనకరంగానే ఉన్న నేపథ్యంలో మాస్కులు పక్కనబెట్టడం సురక్షితం కాదని స్పష్టం చేశారు. 

కరోనా టీకాలు తీసుకున్న వ్యక్తులకు ఇకపై మాస్కు అవసరం లేదని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) ప్రకటించింది. కొవిడ్‌-19 రెండు డోసులు తీసుకున్నవారు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చని సీడీసీ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ రెండు డోసులు తీసుకున్నవారు మాస్కులు ధరించాల్సిన అసవరం లేదా? అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో గులేరియా తాజా సూచనలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని