Corona: జీతమిస్తాం.. వారం రోజులు ఆఫీసులకు రావొద్దు: పుతిన్‌

కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం కొనసాగిస్తున్న వేళ రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక ఆదేశాలు జారీచేశారు. దేశంలో పగ్గాల్లేకుండా వ్యాప్తి చెందుతున్న.......

Published : 20 Oct 2021 18:40 IST

మాస్కో: కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం కొనసాగిస్తున్న వేళ రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక ఆదేశాలు జారీచేశారు. దేశంలో పగ్గాల్లేకుండా వ్యాప్తి చెందుతున్న వైరస్‌ కట్టడికి వారం రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలన్న కేబినెట్‌ ప్రతిపాదనను సమర్థించారు.  గత కొన్ని వారాలుగా భారీగా నమోదవుతున్న కొవిడ్‌ కేసులు, మరణాలతో రష్యా విలవిలలాడుతోన్న విషయం తెలిసిందే. గడిచిన 24గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో 1028మంది కొవిడ్‌తో మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2,26,353కి పెరిగినట్టు ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్‌ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఉద్యోగులను వారం రోజుల పాటు పని ప్రదేశాలకు ఉంచితే మంచిదని భావించిన ప్రభుత్వం.. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 7 వరకు దేశవ్యాప్తంగా వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రజలంతా బాధ్యతతో మెలిగి వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఈ సందర్భంగా పుతిన్‌ విజ్ఞప్తి చేశారు.

మరోవైపు, రష్యాలో వ్యాక్సినేషన్‌ రేటు మందగించడం, కొవిడ్‌ నిబంధనల అమలు పట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించకపోవడంతో కరోనా మహమ్మారి మళ్లీ స్వైరవిహారం చేస్తోంది. గత కొన్ని వారాలుగా భారీగా కేసులు, మరణాలు నమోదవుతుండటంతో వ్యాక్సినేషన్‌ని పెంచేందుకు అక్కడి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నప్పటికీ టీకాలపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో జనం ముందుకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు వస్తుండటంతో అక్కడి ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటివరకు ఆ దేశ జనాభాలో కేవలం 32శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు. కొవిడ్‌ ఇంతలా కల్లోలం రేపుతున్నా దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు మాత్రం రష్యా ప్రభుత్వం సిద్ధపడటంలేదు. గతంలో విధించిన లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ పతనం కావడం, పుతిన్‌ ర్యాంకింగ్‌ పడిపోవడంతో ఆ దిశగా చర్యలు తీసుకొనేందుకు వెనుకాడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని