Corona Virus: రష్యాలో ఆగని కొవిడ్‌ మరణ మృదంగం!

రష్యాలో కరోనా విధ్వంసం కొనసాగుతోంది. అక్కడ కొవిడ్ కేసులు, మరణాలు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా.......

Published : 25 Oct 2021 19:33 IST

మాస్కో: రష్యాలో కరోనా మృత్యుకేళి కొనసాగుతోంది. అక్కడ కొవిడ్ కేసులు, మరణాలు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 39,930 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి మొదలైనప్పట్నుంచి ఇవే అత్యధికం కావడం గమనార్హం. మరోవైపు, ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్యా భారీగానే ఉంటోంది. నిన్న ఒక్కరోజే రష్యాలో 1069మంది మరణించారు. ఇటీవల 1075 మంది ఒక్కరోజులో ప్రాణాలు కోల్పోవడం అక్కడ రికార్డు. 

దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో కట్టడి చర్యల్లో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు కేబినెట్‌ చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన పుతిన్‌.. ఈ నెల 30 నుంచి నవంబర్‌ 7వరకు సెలవులు ప్రకటించారు. అలాగే, కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఈ నాన్‌ వర్కింగ్‌ సమయం ముందుగానే ప్రారంభమై నవంబర్‌ 7 తర్వాత కూడా పొడిగించనున్నట్టు పుతిన్‌ తెలిపారు. కొన్ని కీలకాంశాలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. మాస్కోలో మాత్రం అధికారులు ఆఫ్‌-వర్క్‌ కాలాన్ని గురువారం నుంచి ప్రారంభించే యోచనలో ఉన్నారు. పాఠశాలలు, జిమ్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ వేదికలతో పాటు అనేక స్టోర్లను 11 రోజుల పాటు మూసివేయనున్నారు. రెస్టారెంట్లు, కేఫ్‌లకు మాత్రం డెలివరీలకు మాత్రం అనుమతించనున్నారు. ఫుడ్‌ స్టోర్లు, ఫార్మసీలు మాత్రం తెరిచిఉంచేందుకు అనుమతించనున్నారు. ప్రజలు గుమిగూడకుండా చేపడుతున్న ఈ చర్యలతో కొవిడ్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని అక్కడి అధికారులు ఆశిస్తున్నారు. 

రష్యాలో ఇప్పటివరకు 8.2మిలియన్లకు పైగా కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 2,31,669మంది ప్రాణాలు విడిచారు. కొవిడ్‌తో ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవించిన దేశాల జాబితాలో రష్యా ఐదో స్థానంలో ఉంది. వ్యాక్సినేషన్‌ రేటు తక్కువగా ఉండటం, తగిన జాగ్రత్తలు పాటించడంలో ప్రజల అలసత్వమే కరోనా వైరస్‌ విలయతాండవానికి కారణమంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు కేవలం 45మిలియన్ల మందికి మాత్రమే పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని