Bypolls: కమలం కోటలో దీదీ పాగా.. హిమాచల్‌లోనూ భాజపాకు భంగపాటు

దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ స్థానాలు, 29 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడుతున్నాయి. ఇందులో కొన్ని చోట్ల భాజపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్‌లో

Updated : 02 Nov 2021 21:29 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ స్థానాలు, 29 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడుతున్నాయి. ఇందులో కొన్ని చోట్ల భాజపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌ చేయగా.. పశ్చిమ బెంగాల్‌లో భాజపాకు గట్టి పట్టున్న దిన్‌హటా నియోజకవర్గం దీదీ వశమైంది. కర్ణాటకలోనూ కాషాయ పార్టీకి మిశ్రమ ఫలితాలు దక్కాయి. 

భారీ మెజార్టీతో తృణమూల్‌ హవా

పశ్చిమ బెంగాల్‌లో దిన్‌హటా, గోసాబా, శాంతిపుర్‌, ఖర్దాహ్‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. నాలుగు చోట్లా అధికార తృణమూల్‌ విజయఢంకా మోగించింది. ముఖ్యంగా భాజపా మంచి పట్టున్న దిన్‌హటాలో దాదాపు లక్షన్నర ఓట్ల మెజార్టీతో టీఎంసీ విజయం సాధించింది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దిన్‌హటా నుంచి కేంద్ర మంత్రి నిశిత్‌ ప్రామాణిక్‌ పోటీ చేసి స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఆ తరువాత ఆయన ఈ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. నేడు ఫలితాలు వెలువడగా.. దిన్‌హటాలో తృణమూల్‌ అభ్యర్థి ఉదయన్‌ గుహ.. భాజపా అభ్యర్థి అశోక్‌ మండల్‌పై 1.40లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. గోసాబా నియోజకవర్గంలో తృణమూల్‌ అభ్యర్థి సుబ్రతా మండల్‌ 1.41లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. శాంతిపూర్‌, ఖర్దాహ్‌ల్లోనూ టీఎంసీ ఘన విజయాన్ని నమోదు చేసింది.

హిమాచల్‌లో భాజపాకు షాకిచ్చిన కాంగ్రెస్‌

హిమాచల్‌ప్రదేశ్‌లోనూ కాషాయ పార్టీకి షాక్‌ తగిలింది. మండీ లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా ఎంపీ రామ్‌స్వరూప్‌ శర్మ కన్నుమూయడంతో అక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్‌ తరఫున మాజీ సీఎం స్వర్గీయ వీరభద్రసింగ్‌ సతీమణి ప్రతిభా సింగ్‌ పోటీ చేయగా.. భాజపా నుంచి కార్గిల్‌ వీరుడు బ్రిగేడియర్‌ కుషాల్‌ సింగ్‌ బరిలోకి దిగారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో ప్రతిభా సింగ్ విజయం సాధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ సొంత జిల్లా మండీలో భాజపాకు ఇది గట్టి ఎదురుదెబ్బే. ఇక ఇదే రాష్ట్రంలోని అర్కీ, ఫతేపూర్‌, జుట్టబ్‌ కొట్కాయ్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు జరగ్గా.. మూడింట కాంగ్రెస్‌ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు.

బొమ్మైకి ఎదురుదెబ్బ..

కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. సిండ్గీ నియోజకవర్గంలో భాజపా విజయం సాధించగా. హంగల్‌లో కాంగ్రెస్‌ గెలుపు దిశగా దూసుకెళ్తోంది. హంగల్‌.. రాష్ట్ర ముఖ్యమంత్రి, భాజపా నేత బసవరాజు బొమ్మై సొంత జిల్లా హవేరీ పరిధిలో ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించిన భాజపా నేత ఉడసి మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. తాజా ఫలితాల్లో హంగల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌ మాణె భాజపా అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. 

ఈశాన్యంలో కాషాయం రెపరెపలు..

ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో మాత్రం కాషాయ జెండా రెపరెపలాడింది. ఈ రాష్ట్రంలో ఐదు అసెంబ్లీ స్థానాలకు వెలువడుతున్న ఉప ఎన్నికల ఫలితాల్లో ఒక చోట భాజపా విజయం సాధించగా.. మరో నాలుగు చోట్ల ఎన్డీయే కూటమి ఆధిక్యంలో ఉంది. మధ్యప్రదేశ్‌లోనూ భాజపా హవా కొనసాగింది. ఇక్కడి ఖంద్వా లోక్‌సభ నియోజకవర్గంతో పాటు రెండు అసెంబ్లీ స్థానాల్లో కాషాయ పార్టీ ఆధిక్యంలో ఉండగా.. మరో శాసనసభ స్థానంలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. 

హరియాణా చౌటాలాకే..

హరియాణాలోని ఎల్లెనాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం మళ్లీ చౌటాలా వశమైంది. గతంలో ఈ ప్రాంతం నుంచి విజయం సాధించిన ఇండియన్‌ నేషనల్‌ లోక్‌ దళ్(ఐఎన్‌ఎల్‌డీ) సెక్రటరీ జనరల్ అభయ్‌ సింగ్‌ చౌటాలా.. కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. తాజాగా వెలువడిన ఫలితాల్లో అభయ్‌ మరోసారి విజయం సాధించారు. తన సమీప భాజపా-జేజేపీ అభ్యర్థి గోవింద్‌ కందాపై 8వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. 

ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రానగర్‌ హవేలీ లోక్‌సభ స్థానంలో శివసేన విజయం సాధించింది. దాద్రా నగర్‌ హవేలీలో స్వతంత్ర ఎంపీ మోహన్‌ దేల్కర్‌ ఆత్మహత్యతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో మోహన్‌ సతీమణి కళాబెన్‌ దేల్కర్‌ శివసేన అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్‌ నుంచి మహేశ్ దోదీ, భాజపా నుంచి మహేశ్‌ గవిత్‌ బరిలోకి దిగారు. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టగా.. కళాబెన్‌ విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని