Punishment: పిల్లలు తప్పుచేస్తే తల్లిదండ్రులకు శిక్ష.. ఎక్కడంటే.?

పిల్లలు తప్పుచేస్తే తల్లిదండ్రులను శిక్షించేలా కొత్తచట్టాన్ని సిద్ధం చేసింది... చైనా! ‘ఫ్యామిలీ ఎడ్యుకేషన్‌ ప్రమోషన్‌ లా’ పేరుతో ఇప్పటికే ముసాయిదా బిల్లును రూపొందించింది. దీని ప్రకారం- పిల్లల

Updated : 21 Oct 2021 07:26 IST

బీజింగ్‌: పిల్లలు తప్పుచేస్తే తల్లిదండ్రులను శిక్షించేలా కొత్తచట్టాన్ని సిద్ధం చేసింది... చైనా! ‘ఫ్యామిలీ ఎడ్యుకేషన్‌ ప్రమోషన్‌ లా’ పేరుతో ఇప్పటికే ముసాయిదా బిల్లును రూపొందించింది. దీని ప్రకారం- పిల్లల ప్రవర్తన సరిగా లేకపోయినా, వారు నేరాలకు పాల్పడినా ముందుగా తల్లిదండ్రులకు సమాచారమిస్తారు. ఆ తర్వాత బిడ్డల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత కన్నవారిపైనే ఉంటుంది. అప్పటికీ పిల్లలు మారకపోతే, వారి తల్లిదండ్రులు పనిచేసే సంస్థలకు, లేదా యజమానులకు విషయం చేరవేస్తారు. తర్వాత తల్లిదండ్రులకు శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమానికి వారు తప్పనిసరిగా హాజరుకావాలి. లేకుంటే 156 డాలర్ల (సుమారు రూ.11,600) జరిమానా, 5 రోజుల జైలు శిక్ష విధించే అవకాశముంటుంది. చిన్నారుల ప్రవర్తన సరిగ్గా లేకపోవడానికి చాలా కారణాలున్నా, వారి పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ చూపకపోవడమే ప్రధాన కారణమని చైనా చట్టసభ వ్యవహారాల కమిషన్‌ అధికార ప్రతినిధి జాంగ్‌ తైవే పేర్కొన్నారు. ‘‘కమ్యూనిస్టు పార్టీని, దేశాన్ని, ప్రజలను, సామ్యవాదాన్ని ప్రేమించేలా పిల్లలకు బోధించడం తల్లిదండ్రుల విధి అని కొత్తచట్టం చెబుతోంది. పిల్లలు విశ్రాంతి తీసుకునేందుకు, వ్యాయామం చేసేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలి. ట్యూషన్‌, హోంవర్క్‌ పేరుతో వారిపై ఒత్తిడి పెంచకూడదు’’ అని తైవే చెప్పారు. చిన్నారులు, యువతరం, కుటుంబాల కోసం డ్రాగన్‌ దేశం ఇటీవల కొత్త నిబంధనలను తీసుకొస్తోంది. మైనర్లు వారానికి గరిష్ఠంగా మూడు గంటలు మాత్రమే వీడియో గేమ్స్‌ ఆడాలని షరతు విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని